ఆర్ఎస్ ప్రవీణ్‌ను ఓడిస్తేనే రాజకీయాలకు విలువ! స్వేరోస్‌ను మోసం చేశాడు.. ఆకునూరి మురళి సంచలన కామెంట్స్

by Ramesh N |
ఆర్ఎస్ ప్రవీణ్‌ను ఓడిస్తేనే రాజకీయాలకు విలువ! స్వేరోస్‌ను మోసం చేశాడు.. ఆకునూరి మురళి సంచలన కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గత అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కేసీఆర్‌ను తిట్టారని, నేడు ఆయనకు కేసీఆర్ యుగపురుడు లాగా కన్పిస్తున్నాడని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓటర్లను చైతన్య పరిచేందుకు జాగో తెలంగాణ పేరుతో ఆకునూరి మురళి బస్సు యాత్ర చేపట్టారు. తాజాగా నాగర్ కర్నూల్‌లో జాగో తెలంగాణ బస్సు యాత్రలో భాగంగా ఆకునూరి మురళి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వేరోస్‌ను ఏరకంగా మోసం చేశాడు. ఏ రకంగా రాజ్యాంగా ఫీల్డ్‌ను మోసం చేశాడు. ఏ రకంగా బహుజన వాదులను మోసం చేశాడు. ఏ రకంగా రాజ్యాధికారానికి వచ్చే.. కులాలతో కూడిన రాజకీయాలను మోసం చేశాడనే విషయాలను నాగర్ కర్నూల్ ప్రజలకు వివరిస్తున్నాం’ అని ఆరోపించారు.

గత బీఆర్ఎస్ పాలన ఆర్ఎస్పీకి నేడు స్వర్ణయుగం లాగా కనబడుతుందని విమర్శించారు. అది ఎంత పచ్చి అబద్దాలు ఆర్ఎస్ ప్రవీణ్ మాట్లాడుతున్నారని తాము ప్రజలకు చెబుతున్నామని అన్నారు. ఒక సాదాసీదా రాజకీయ నాయకుడి కంటే కూడా ఎక్కువ అబద్ధాలు ఆడుతున్న ఆర్ఎస్పీని ఓడించగలిగితేనే రాజకీయాలకు విలువ అని సంచలన కామెంట్స్ చేశారు. జాగో తెలంగాణ బస్సు యాత్ర ఈ నెల 11 వ తేదిన ముగుస్తోందని స్పష్టంచేశారు. మరోవైపు దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిందన్నారు. బీజేపీ అంబానీ, అదానీలకు ఊడిగం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పారు. ప్రజలు మద్యానికి, డబ్బుకు అమ్ముడుపోవద్దని ఎన్నికల సందర్భంగా పిలుపునిచ్చారు.

Advertisement

Next Story