కేసీఆర్ పనికి కడియం, తుమ్మల నొచ్చుకోలేదా?.. కేసీఆర్ వ్యవహారాన్ని రివీల్ చేసిన ఈటల

by Prasad Jukanti |   ( Updated:2024-05-07 08:01:41.0  )
కేసీఆర్ పనికి కడియం, తుమ్మల నొచ్చుకోలేదా?..  కేసీఆర్ వ్యవహారాన్ని రివీల్ చేసిన ఈటల
X

దిశ, డైనమిక్ బ్యూరో:కేసీఆర్ హయాంలో వ్యవస్థ గాడి తప్పడానికి చాలా కాలం పట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 నెలల కాలంలోనే గాడి తప్పిందని బీజేపీ నేత, మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. కాంగ్రెస్ పరిస్థితి ప్రజలకు అర్థమైపోయిందని, రాష్ట్రంలో 7-10 శాతం కమీషన్లు ఇస్తే తప్ప పనులు కాని పరిస్థితులు నెలకొన్నాయని ధ్వజమెత్తారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడిన ఈటల.. అణగారిన వర్గాల పేరిట ఓట్లు సంపాదించాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించిన అంబేద్కర్ ను ఓడించిందన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. మల్కాజిగిరిలో ఈటలను ఓడించేందుకు రేవంత్ రెడ్డి పోలీసులను, ఇంటలిజెన్స్ అందరినీ దించారని కానీ వీరందరిని పెట్టుకున్న కేసీఆర్ మొన్న అధికారం కోల్పోలేదా అని అన్నారు. ప్రజలు అంతిమ నిర్ణయం తీసుకుంటారన్నారు. రెడ్లు అందరూ కాంగ్రెస్ కే ఓటు వేయాలని రేవంత్ రెడ్డి అంటున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఇది రేవంత్ రెడ్డి దిగజారుడు తనానికి పరాకాష్ట అని ధ్వజమెత్తారు. కులాలు, మతాల ప్రాతిపదికన ఎవరూ గెలవరన్నారన్నారు.

కేసీఆర్ పనికి ఇదే కడియం, తుమ్మల నొచ్చుకోలేదా?:

కేసీఆర్ వద్ద అంతో ఇంతో తప్పును తప్పు అని చెప్పగలిగిన ఏకైక వ్యక్తి ఈటల అని.. గతంలో కేసీఆర్ మంత్రివర్గంలో పని చేసి ఇవాళ కాంగ్రెస్ లో ఉన్న జూపల్లి, తుమ్మల, కడియం, పట్నం మహేందర్ రెడ్డి తమ గుండెల మీద చేయి వేసుకుని చెప్పాలన్నారు. ఉన్నది ఉన్నట్లుగా ముఖం మీదే చెప్పడంతోనే తాను కేసీఆర్ వద్ద ఆగ్రహానికి గురయ్యానన్నారు. ‘హౌసింగ్ పాలసీ మీద కేసీఆర్ కమిటీని వేశారు. ఇందులో తనతో పాటు హరీశ్ రావు, తుమ్మల, ఇంద్రకరణ్ రెడ్డి, కడియం శ్రీహరి వంటి వారం ఉన్నారు. తాము స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వకముందే పాలసీని డిక్లేర్ చేశారు. అప్పుడు ఇదే కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర్ రావు నొచ్చుకున్నారన్నారు. కేసీఆర్ పాలనలో మంత్రులకు ఉన్న విలువ అర్థం చేసుకోవచ్చు’ అన్నారు. దేశవ్యాప్తంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించినా అమలు కావట్లేదన్నారు. ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిది అని మహిళల పట్ల సానుభూతి కలిగిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అని సోనియా గాంధీ ఓ మహిళాగా ఉండి కూడా ముస్లిం మహిళల కోసం త్రిబుల్ తలాక్ చట్టాన్ని తీసుకురాలేకపోయారని మండిపడ్డారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వానికి ఛాన్సే లేదని మోడీ ఫుల్ మెజార్టీతో అధికారంలోకి రాబోతున్నారన్నారు.

రేవంత్ రెడ్డి సంస్కారం నేర్చుకో:

ఎంత పెద్ద పదవిలో ఉన్నా రేవంత్ రెడ్డి సంస్కారం నేర్చుకోవాలని వయసులో రేవంత్ రెడ్డి కంటే తాను పెద్దవాడిన్నారు. మానవ బాంబు అవుతానని, పేగులు మెడలో వేసుకుంటానని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మానవ బాబు అయ్యేవాడు ఉన్మాది అని, పేగులు మెడలో వేసుకునే వాడు సైకో అని సెటైర్ వేశారు. రేవంత్ రెడ్డికి ఎవరు సలహా ఇస్తున్నారో కానీ పద్ధతి మార్చుకోవాలన్నారు. రేవంత్ రెడ్డి తన భాష తీరుతో ముఖ్యమంత్రి హోదాను తగ్గించవద్దని, ప్రజల ముందు పల్చ పడవద్దని సలహా ఇచ్చారు. తాను హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచాక కూడా కేసీఆర్ రెండేళ్లు అధికారంలో ఉన్నారని ఆయన కిందే రెవెన్యూ శాఖ ఉందని అప్పుడు తన భూముల విషయాన్ని ఎందుకు వెలికి తీయలేకపోయారని ప్రశ్నించారు. అధికారం ఉందనే అహంకారంతో ఒకరి వ్యక్తిత్వ హననం చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.

Advertisement

Next Story