చిన్నయ్య మెడకు శేజల్ ఉచ్చు.. వ్యవహారంపై అధిష్టానం సీరియస్..?

by Sathputhe Rajesh |   ( Updated:2023-08-15 04:33:09.0  )
చిన్నయ్య మెడకు శేజల్ ఉచ్చు.. వ్యవహారంపై అధిష్టానం సీరియస్..?
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో సొంత పార్టీలో మరో వ్యక్తికి అవకాశం లేకుండా అటు నియోజకవర్గ అభివృద్ధితో పాటు ఇటు పార్టీలో బలంగా ఎదిగిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు ఓ మహిళా ఉద్యోగి చేస్తున్న న్యాయపోరాటం ఆయన మెడకు ఉచ్చు బిగిసేలా కనిపిస్తోంది. రాజకీయంగా అంచెలంచలుగా ఎదిగి ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు గెలుపొందిన దుర్గం చిన్నయ్య నియోజకవర్గంలో గట్టి పట్టు కలిగి ఉన్నారు.

అయితే ఆ నియోజకవర్గంలో ఆరిజిన్ డెయిరీ పేరిట పాల ఉత్పత్తుల ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడంతో పాటు అందులో భాగస్వాముల ఎంపిక, స్థల సేకరణ విషయంలో ఎమ్మెల్యే చిన్నయ్య కీలకంగా వ్యవహరించినట్లు ప్రచారం ఉంది. సంస్థ సీఈవో శేజల్ తనను ఎమ్మెల్యే చిన్నయ్య నమ్మబలికి భిన్న రకాలుగా మోసం చేశాడని ఆరోపిస్తున్నది. కొంతకాలం సద్దుమణిగిన వివాదం మళ్లీ తెరపైకి రావడం కలకలం రేపుతున్నది. అదీ ఎన్నికల ముందు తీవ్రస్థాయిలో వివాదం రేగుతుండడం రాజకీయంగా ఎమ్మెల్యే చిన్నయ్యకు నియోజకవర్గంలో మైనస్‌గా మారుతుందని చెబుతున్నారు. కొంతకాలంగా జరుగుతున్న ఈ ఎపిసోడ్‌పై పార్టీ అధిష్టానం కూడా సీరియస్‌గా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఢిల్లీ దాకా వెళ్లి వచ్చి...

ఆరిజిన్ పాల ఉత్పత్తుల సంస్థ సీఈవో శేజల్ సంస్థ ఏర్పాటుతో పాటు అందులో తన కుటుంబ సభ్యులను భాగస్వాములుగా చేర్చాలని ఎమ్మెల్యే ఒత్తిడి చేసినట్లు ఆరోపిస్తూ న్యాయపోరాటానికి దిగింది. ఒక దశలో యువతులను తన వద్దకు తీసుకురావాలని ఎమ్మెల్యే ఒత్తిడి చేశారని మరోసారి తనను కూడా లైంగికంగా వేధించారని ఆమె ఆరోపించింది. బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రంతో పాటు మంచిర్యాల జిల్లా కేంద్రంలో పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తనకు న్యాయం చేయడం లేదని ఆరోపిస్తూ హైదరాబాద్‌లో డీజీపీ సహా మానవ హక్కుల కమిషన్ మహిళా కమిషన్‌లలో ఫిర్యాదు చేసింది.

రాష్ట్రస్థాయిలో ఎమ్మెల్యే చిన్నయ్య అధికార పార్టీ ఒత్తిళ్లతో తనకు న్యాయం జరగడంలేదని ఆరోపిస్తూ ఢిల్లీకి వెళ్లి తెలంగాణ భవన్ వద్ద నిరసనకు దిగింది. జాతీయ మహిళా కమిషన్ సహా ఢిల్లీలో సైతం ఆమె ఫిర్యాదులు చేసింది. అయినప్పటికీ చిన్నయ్యపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆమె ఆరోపిస్తూ వస్తున్నారు. గత కొంతకాలంగా సద్దుమణిగిందనుకున్న ఆరిజిన్ పాల ఉత్పత్తుల సంస్థ సీఈవో వివాదం తాజాగా సోమవారం మళ్లీ తెరపైకి వచ్చింది. నేరుగా ఆమె బెల్లంపల్లిలో ఉన్న ఎమ్మెల్యే అధికారిక రెసిడెన్స్ ఎదుట నిరసనకు దిగింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ఎమ్మెల్యే చిన్నయ్య పై కేసులు పెట్టి తనకు న్యాయం చేయాలని కోరింది. దీనికి అక్కడి బీజేపీ సహా ఇతర ప్రతిపక్ష నేతలు మద్దతు పలికారు.

ఎమ్మెల్యేకు తలనొప్పి...

తాజా పరిణామాలు ఎన్నికల ముందు జరుగుతుండడంతో ఎమ్మెల్యే చిన్నయ్యకు తలనొప్పిగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే తమ నేత దుర్గం చిన్నయ్య ఎదుగుదల ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీలు సీఈఓ ను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నాయని ఆయన అనుచరులు ఎదురుదాడికి దిగారు. బెల్లంపల్లికి చెందిన సీనియర్ నేత రాజలింగు ఆధ్వర్యంలో ఈ వ్యవహారంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాలకు చేతగాక ఇలాంటి చవకబారు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. కాగా ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు.

ఒక సొంత పార్టీ శాసనసభ్యుడిపై ఈ స్థాయిలో ఫిర్యాదులు వస్తుంటే... అందులోనూ ఒక మహిళ నేరుగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఎమ్మెల్యే పై న్యాయపోరాటం చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం ప్రతిపక్షాలు తీవ్రంగా దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ పరిణామం బెల్లంపల్లి సహా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పై ప్రభావం చూపే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. పార్టీ అగ్రనాయకత్వం కలగజేసుకొని వివాదాన్ని పరిష్కరించడం మంచిదని అభిప్రాయపడుతున్నారు. లేదంటే ఎమ్మెల్యే చిన్నయ్య మనుగడతోపాటు ఉమ్మడి జిల్లాలో పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుందని చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed