రైతులకు విత్తనాలు అందుబాటులో ఉండాలి.. అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం

by Shiva |
రైతులకు విత్తనాలు అందుబాటులో ఉండాలి.. అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో వివిధ పంటలకు కావాల్సిన నాణ్యమైన విత్తనాలను, ఎరువులను అందుబాటులో ఉండేలా చూడాలని, అదేవిధంగా రైతాంగానికి ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఇవాళ సచివాలయంలో అగ్రికల్చర్, హ్యాండ్లూమ్స్, గనుల సంచాలకులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులతో పంటల వైవిధ్యాలను వివరించడం ద్వారా రైతుల ఆదాయం పెంచడంపై అవగాహన కల్పించేందుకు రైతు వేదికలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.

రైతులు అధికంగా పండించే వరి పంటను ఎగుమతి చేసేందుకు భారత ప్రభుత్వాన్ని ఒక నివేదిక సమర్పించే విధంగా సరైన ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్లలో దళారీ వ్యవస్థ వలన పంటను తక్కువ ధరలకు అమ్ముకుని నష్టపోకుండా, ఆ వ్యవస్థనే నిర్మూలించి రైతుకు నష్టం వాటిల్లకుండా చూడాలన్నారు. మార్కెట్లలో అమ్మకాలు, కొనుగోళ్లు ముఖ్యంగా రోజురోజుకు తగ్గుతున్న మిర్చి ధరల గురించి, పంటలకు తెగుళ్ల నియంత్రణ చర్యల గురించి కుడా మంత్రి సమీక్షించారు.

అదేవిధంగా పాలిస్టర్ వస్త్ర పరిశ్రమలో తలెత్తిన సమస్యలపై చేనేత విభాగం సంచాలకులు మాట్లాడుతూ.. ఉత్పత్తి చేస్తున్న పాలిస్టర్ వస్త్రాలకు ప్రభుత్వ పరంగా మార్కెటింగ్ సౌకర్యాలు ఎక్స్పోసెర్ విజిట్స్ వంటివి ఏర్పాటు చేసి మార్కెటింగ్‌పై అవగాహన కల్పిస్తామని అన్నారు. వస్త్రాల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడబోమని తెలిపారు. ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం మండలంలో జరిగిన అక్రమ గ్రావెల్, బెరైటీస్ తవ్వకాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని, అక్కడ జరుగుతున్న మైనింగ్ మాఫియా‌ను అరికట్టాలని, దోషులు ఎంతటి వారైనా వదలి పెట్టొద్దని హెచ్చరించారు. వ్యవసాయ శాఖకు చెందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో వారి సమస్యలపై సమీక్ష నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలి వ్యవసాయ సంచాకులకు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed