భూత వైద్యం పేరిట లక్షల్లో దండుకుంటున్న కేటుగాళ్లు

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-25 05:36:11.0  )
భూత వైద్యం పేరిట లక్షల్లో దండుకుంటున్న కేటుగాళ్లు
X

దిశ, శంకరపట్నం: కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలోని, శంకరపట్నం మండలంలోని పలు గ్రామాల్లో భూత వైద్యులు అమాయక ప్రజలను ఆసరా చేసుకొని మాయమాటలతో రూ.లక్షల మోసానికి పాల్పడుతున్నట్టు సమాచారం. మండలంలోని ఆముదాలపల్లి, మొలంగూర్, కేశవపట్నం, తాడికల్ గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో ఉన్న కొంతమంది భూత వైద్యులు, అమాయక ప్రజలను మాయమాటలతో మోసం చేస్తూ క్షుద్ర పూజల పేరిట, గుప్త నిధులు ఉన్నాయంటూ, అమాయక ప్రజల కుటుంబ స్థితిగతులను ఆసరాగా చేసుకుని డబ్బులు దండుకుంటున్నారు.

ఈ పూజ.. ఆ పూజ అంటూ లక్షల రూపాయలను వసూలు చేస్తున్నారని చర్చ జరుగుతుంది. కొన్ని రోజుల క్రితం ఆముదాలపల్లి గ్రామానికి చెందిన గొట్టే సారయ్య అనే వ్యక్తి వీణవంక మండలం పోతిరెడ్డి పల్లెకు చెందిన ఓ వ్యక్తి వద్ద తన తల్లి ఆరోగ్యం బాగు చేస్తానని, నమ్మబలికి మాయ మాటలు చెప్పి, తన వ్యవసాయ భూమిలో గుప్తనిధులు ఉన్నాయంటూ ఆరు లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు తెలిసింది.

బాధితుడు వినవంక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా గొట్టేసారయ్యపై వీణవంక ఎస్‌ఐ శేఖర్ రెడ్డి కేసు నమోదు చేశారు. శంకరపట్నం మండలంలోని పలు గ్రామాల్లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నట్లు తెలిసింది. కొంతమంది భూత వైద్యులు తమ ఇంటి వద్దనే క్షుద్ర పూజలు చేస్తూ, అమాయక ప్రజల ఇబ్బందులను ఆసరా చేసుకుని క్షుద్ర పూజల పేరుతో లక్షలాది రూపాయలను ప్రజల నుండి వసూలు చేస్తున్నారు.

దీంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసినా భూత వైద్యులు తమ తీరు మార్చుకోకపోవడం గమనార్హం. కొన్ని ఏళ్ల నుండి తనిఖీలు లేకపోవడంతో భూత వైద్యులు పెట్రేగిపోతున్నారని మండల ప్రజలు తెలిపారు. వీణవంక పోలీసులు రెండు రోజుల క్రితం కేసు నమోదు చేయడంతో భూతవైద్యుల ఆగడాలు వెలుగు చూశాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆకస్మిక దాడులు నిర్వహించి భూత వైద్యుల నుండి అమాయక ప్రజలను కాపాడాలని కోరుచున్నారు.

Advertisement

Next Story