పైసల్లేక ఆగిపోయిన కీలక స్కీమ్.. కష్టాల్లో దళిత కుటుంబాలు!!

by GSrikanth |   ( Updated:2022-12-20 05:42:57.0  )
పైసల్లేక ఆగిపోయిన కీలక స్కీమ్.. కష్టాల్లో దళిత కుటుంబాలు!!
X

దిశ, తెలంగాణ బ్యూరో: నిధులు లేక ఎస్సీ డెవలప్​మెంట్ ముందుకు సాగడం లేదు. ముఖ్యంగా స్వయం ఉపాధికి స్కీమ్​కు బ్రేకులు పడ్డాయి. ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు కోరినా బడ్జెట్ లేదని చెబుతుందని స్వయంగా ఎస్సీ వెల్ఫేర్ డెవలప్ మెంట్ శాఖనే అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. కాగితాల్లోనే సర్కార్ లెక్కలు గొప్పగా చూపిస్తున్నది. కానీ పైసా మాత్రం ఇవ్వడంలేదు. ప్రస్తుతం పెండింగ్​లో ఉన్న సంక్షేమ పథకాలను పునరావృతం చేసేందుకు దాదాపు రూ.4 వేల కోట్లు అవసరం. 2014 నుంచి 2022 వరకు స్వయం ఉపాధి, ప్రత్యేక సాయం, భూమి కొనుగోలు వంటి ఎస్సీ సంక్షేమ పథకాలకు రూ.12,708 కోట్లను కేటాయించగా, ఇందులో రూ.8,599 కోట్లను మాత్రమే ఖర్చు చేశారు. మిగతా నిధులను ప్రభుత్వం ఇప్పటివరకు రిలీజ్​చేయకపోతుండగా సబ్సిడీ స్కీమ్​లన్నీ ఆగిపోయాయి. దీంతో రాష్ట్రంలో వేలాది పేద ఎస్సీ కుటుంబాలు కష్టాల్లో ఉన్నాయి. పైగా స్వయం ఉపాధికి ప్రత్యేకంగా ప్రతి ఏడాది సగటున వెయ్యి కోట్లకు తగ్గకుండా కేటాయిస్తూ ఆ వర్గాలను మాత్రం ప్రభుత్వం మభ్య పెడుతున్నది.

నిధులు రాక.. ఏమీ చేయలేక..

దళిత కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు షెడ్యుల్డ్​కులాల సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్ స్కీమ్​లు కొనసాగుతున్నాయి. ప్రతిఏడాది ఉపాధి లేనోళ్లు, నిరుద్యోగులను ఆదుకోవడం ఈ స్కీమ్​ఉద్దేశం. కానీ ప్రభుత్వం నుంచి నిధులు రాకపోతుండగా పథకం అటకెక్కింది. దీంతో ఎస్సీ డెవలప్​మెంట్ శాఖ కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. గడిచిన 9 ఏళ్లుగా వేలాది మంది స్కీమ్​కొరకు అప్లై చేసుకున్నా.. ఇప్పటివరకు ఫైనల్​చేయలేదు. ఇంకా ఎంతో మంది జిల్లా కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

ప్రతిపాదనలు ఇలా..

ఎస్సీ డెవలప్ మెంట్ శాఖలోని స్వయం ఉపాధి స్కీమ్ కు 8 నుంచి 10 తరగతి వరకు ఉత్తీర్ణతతో సంబంధం లేకుండా ఎంపిక చేస్తారు. కనీస వయస్సు 21 నుంచి గరిష్టంగా 50 వరకు ఉండే నిరుద్యోగులను మాత్రమే తీసుకుంటారు. స్వయం ఉపాధిలో ఎక్కువగా మెకానికల్ (డీజిల్), మెకానికల్ (ఎంవీ), టర్నర్, వెల్డర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఏసీ రిపేరింగ్, కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ (అసిస్టెంట్), డ్రెస్ మేకింగ్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ వంటి ట్రేడ్‌ల్లో అవసరమైన సాంకేతిక శిక్షణ ఇచ్చి ఇండస్ట్రియల్స్​ఏర్పాటుకు ఆర్థికసాయం అందిస్తారు. బ్యాంక్​లతో సమన్వయ పరిచి సబ్సిడీపై లోన్లు ఇస్తారు. ఆదాయాన్ని పెంచే మార్గాలను కూడా అధికారులు అందించాల్సి ఉంటుంది.

BRS ఎఫెక్ట్: కేసీఆర్‌కు పొరుగు రాష్ట్రాల నుంచి సవాలు తప్పదా?

Advertisement

Next Story