Sama Rammohan: ఇక మీ అబద్ధాల సంగతి తేల్చుడే.. కేటీఆర్, హరీశ్ రావుపై సామ రామ్మోహన్ రెడ్డి ఫైర్

by Prasad Jukanti |
Sama Rammohan: ఇక మీ అబద్ధాల సంగతి తేల్చుడే.. కేటీఆర్, హరీశ్ రావుపై సామ రామ్మోహన్ రెడ్డి ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బోగస్ స్టేట్ మెంట్లతో కేటీఆర్, హరీశ్ రావు వారి సైన్యం ప్రజలను తప్పుదారి ప్రయత్నంలో ఉన్నారని పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. ప్రజలు వారిని ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా వారి నైజం మారలేదని వారిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని దుయ్యబట్టారు. శుక్రవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. హైదరాబాద్ నీటి విషయంలో కేటీఆర్ నిస్సిగ్గుగా అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. మంజీరా, కృష్ణా, గోదావరి, ఎల్లంపల్లి నుంచి జలాలు నగరానికి తరలింపులో బీఆర్ఎస్ పాత్ర ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. పొద్దున లేస్తే బోగస్ ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్న కేటీఆర్ సంగతి మేము చెబుతామన్నారు.

అధికారంలో ఉండగా కేటీఆర్ బోగస్ ఎంవోయూలు చేశారని ఆరోపింపిచారు. 10 జూన్ 2022లో తెలంగాణ రాష్ట్రం 3 సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకుందని, ఈ ఒప్పందాల విషయం కేటీఆర్ సైతం తన అధికారిక ట్విట్టర్ లో పోస్టు చేశారు. భువి బయో కెమికల్స్ రూ.1 వెయ్యి 40 కోట్లు, ధాత్రి బయో సిలికేట్స్ రూ.160 కోట్లు వచ్చాయని వెల్లడించారు. కానీ ఆరోజుకు ఇంకా ఆ కంపెనీలు పుట్టనే లేదన్నారు. ఇవి మచ్చుకు మాత్రమేనని తవ్వితే బీఆర్ఎస్ తప్పిదాలు ఇంకా చాలా వస్తాయన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల హయంలో ఎన్ని ఎంవోయూలు జరిగాయి? వాటిలో ఎన్ని కంపెనీలు ఎప్పుడు పుట్టాయి? ఎంత పెట్టుబడులు వచ్చాయి? ఎంత మందికి ఉపాధి కల్పించారో చర్చకు సిద్ధమా కేటీఆర్ అని సవాల్ విసిరారు. మాపై తప్పుడు ప్రచారం చేస్తున్న మిమ్మల్ని ఇక వదిలే ప్రసక్తే లేదని.. మీ బొగోస్ లన్నింటిని ఒక్కొక్కటిగా బయటకు తీస్తామన్నారు.

హరీశ్ రావు.. అదెందుకు చెప్పట్లే?:

మెడికల్ అడ్మిషన్ల విషయంలో తీసుకువచ్చిన జీవో 33పై హరీశ్ రావు అబద్దాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ బిడ్డలకు మేలు జరగాలనే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నదన్నారు. ఈ జీవో వల్ల 299 ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ బిడ్డలకు అదనంగా వస్తున్నాయని ఈ విషయంలో హర్షించాల్సిందిపోయి ఏదో జరిగిపోతున్నదని అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉన్న నిబంధనను తొలగించి 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఇక్కడ చదివిన వారిని స్థానికులుగా గుర్తిస్తున్నారని దీని వల్ల రాష్ట్ర విద్యార్థులకు మోసం జరుగుతుందనడం అవాస్తవం అన్నారు. పాత నిబంధన కారణంగా ఇతర ప్రాంతాల విద్యార్థులు 6 నుంచి 9వ తరగతి వరకు ప్రైవేట్ విద్యాసంస్థల నుంచి సర్టిఫికెట్లు తీసుకువచ్చి స్థానికత పేరుతో తెలంగాణ బిడ్డలకు రావాల్సిన సీట్లు కొట్టేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విషయంలో 20 మందిపై కేసులు కూడా నమోదై దర్యాప్తు జరుగుతున్నదన్నారు.

ఈ ఇబ్బందులు ఉండకూడదనే 9 నుంచి 12 నాలుగు తరగతులు ప్రామాణికం చేశామన్నారు. ఇందులో ఎస్ఎస్సి, ఇంటర్మీడియెట్ బోర్డులు ఉంటాయని ఈ రెండు కూడా ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికెట్లు కాబట్టే తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో జీవో 33 తీసుకువచ్చామన్నారు. అలాగే విద్యార్థులు తెలంగాణకు చెందిన వారే అయితే స్థానికత రుజువు చేసుకునేలా రెసిడెన్షియల్ ఫ్రూఫ్స్ చూపినా సరిపోతుందనే ఆప్షన్ కూడా ఇదే జీవోలో ఉందని కానీ ఈ విషయం హరీశ్ రావు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఎందుకీ మోసపూరితమైన ప్రచారాలకు పూనుకున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అబద్దపు ప్రచారాలని కాంగ్రెస్ ప్రభుత్వం సహనంతో భరిస్తున్నదని, హద్దు దాటి దుష్ప్రచారం చేస్తే జైలు ఊచలు లెక్కపెట్టే రోజులు వస్తాయని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed