నో కంట్రోల్.. రాష్ట్రంలో విచ్చలవిడిగా నకిలీ మెడిసిన్స్ అమ్మకాలు!

by GSrikanth |
నో కంట్రోల్.. రాష్ట్రంలో విచ్చలవిడిగా నకిలీ మెడిసిన్స్ అమ్మకాలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నకిలీ మెడిసిన్స్ నియంత్రణపై పర్యవేక్షణ కొరవడింది. విచ్చలవిడిగా అమ్మకాలు కొనసాగుతుండగా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. తాజాగా వరంగల్​టౌన్ లో నకిలీ మందులు కలకలం సృష్టించాయి. యూపీకి చెందిన ఒక ఫార్మా కంపెనీ రెండు బ్యాచ్​ల ఎసిడిటీ మెడిసిన్ లో క్వాలిటీ లేదని గుర్తించారు. దీంతో వాటిని అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. కొన్నేళ్లుగా మార్కెట్లో వీటి అమ్మకాలు కొనసాగుతుండడం గమనార్హం. ప్రైవేట్ డాక్టర్లు అనేకసార్లు పట్టుబడిన మెడిసిన్ రోగులకు రెఫర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. అయితే అన్ని జిల్లాల్లో ఇదే సమస్య ఉందని స్వయంగా ఉన్నతాధికారులే చెప్పడం విడ్డూరంగా ఉంది.

రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలకు..

వరంగల్ ఘటన నేపథ్యంలో స్టేట్​డ్రగ్ కంట్రోల్ హడావుడి చేస్తున్నది. ప్రస్తుతం టెస్టింగ్ శాంపిళ్ల సంఖ్యను పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అన్నిజిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. దీంతో డ్రగ్ కంట్రోల్​ఆఫీసర్లు రెయిడ్స్ కు రెడీ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా మందుల అమ్మకానికి 29,096 లైసెన్స్​లు మంజూరు చేశారు. దీంతో పాటు 546 ఫార్మా యూనిట్స్,183 బ్లడ్​బ్యాంకులు, 36 బ్లడ్​స్టోరేజ్​సెంటర్లు ఉన్నాయి. గడిచిన ఐదేళ్లలో నకిలీ మెడిసిన్స్​పై 2,466 కేసులు నమోదయ్యాయంటే.. డ్రగ్ అధికారుల పర్యవేక్షణ ఏ విధంగా ఉందనేది? తెలుస్తున్నది.

ముడుపులు తీసుకుంటూ..

ప్రతి నెల డ్రగ్​ఇన్​స్పెక్టర్లు తప్పనిసరిగా మెడికల్​షాపులు తనిఖీలు చేస్తూ.. ర్యాండమ్​గా మెడిసిన్ శాంపిళ్లు తీసి టెస్ట్ లు చేయాల్సి ఉంటుంది. అయితే.. రాష్ట్రానికి అవసరం మేరకు 75 మంది డ్రగ్ ఇన్​స్పెక్టర్లు కావాల్సి ఉండగా.. కేవలం 53 మంది మాత్రమే ఉన్నారు. దీంతో పూర్తిస్థాయిలో ఫోకస్​పెట్టడం సాధ్యమవడం లేదనేది కొందరి ఆఫీసర్ల వాదన. ప్రస్తుతం ఉన్నోళ్లలోనూ మెజార్టీ ఆఫీసర్లు మెడికల్​షాపులపై నిఘా పెట్టడం లేనట్టు స్పష్టమవుతున్నది. ప్రైవేట్, కార్పొరేట్ ఫార్మా కంపెనీల నుంచి ముడుపులు తీసుకోవడంతోనే డ్రగ్ ఇన్ స్పెక్టర్లు పట్టించుకోవట్లేదని విమర్శ కూడా ఉంది. ఇలాగే ఉంటే.. ప్రజారోగ్యానికి ముప్పు పొంచి ఉంటుందని డాక్టర్లు పేర్కొంటున్నారు.

Advertisement

Next Story