చిరంజీవి కుటుంబానికి రూ. కోటి ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి

by GSrikanth |
చిరంజీవి కుటుంబానికి రూ. కోటి ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రానున్న రోజుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, రాబోయే ఎన్నికల్లో పేదలంతా ఒక్కటై చిత్తుచిత్తుగా ఓడిస్తారని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గత వారం తుకారాంగేట్ ఠాణాలో లాకప్ డెత్‌కు గురైన చిరంజీవి కుటుంబాన్ని ఆయన శనివారం పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడారు. పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా, పోస్ట్ మార్టం రిపోర్టు, శవపంచనామా కూడా ఇవ్వకుండా, కనీసం చనిపోయిన తర్వాత శవాన్ని చూపించకపోవడం అన్యాయమని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.

ఫిట్స్ వస్తే వ్యక్తి ఎలా చనిపోతారని ప్రశ్నించారు. పేదోల్ల పక్షాన మాట్లాడే వారు లేకపోతే చంపేస్తారా అని మండి పడ్డారు. కోట్ల రూపాయల స్కాం చేసిన వారిని ఢిల్లీకి వెళ్లి ప్రభుత్వ లాయర్లను పంపి నేరస్తులను కాపాడే ప్రభుత్వం, చిరంజీవి వంటి పేదలను ఎందుకు చంపుతుందని ప్రశ్నించారు. ఇసుక దందాను ప్రశ్నించినందుకు నేరెళ్ల బాధితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, దొంగతనం నెపంతో మరియమ్మ, శేఖర్, ఖదీర్ ఖాన్, ఇపుడు చిరంజీవిలను ప్రభుత్వం పొట్టనపెట్టుకున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పేద వర్గాలకు చెందిన వారే ఎలా చనిపోతారని నిలదీశారు. అందుకే రాబోయే ఎన్నికల్లో పేదలందరూ ఏకమై కెసిఆర్ ప్రభుత్వాన్ని ఓడించి, తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.

చిరంజీవి హత్యకు కారకులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిరంజీవి కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు బిఎస్పి పోరాడుతుందని తెలిపారు. బాధిత కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయం అందజేయాలని, చిరంజీవి సతీమణికి ఉపాధి కల్పించాలని, పిల్లలను ప్రభుత్వమే పిజి వరకు చదివించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు వరకైనా వెళ్తామని పేర్కొన్నారు. మానవ హక్కుల కమీషన్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కేసీఆర్ అన్ని విషయాల్లో మౌనంగా ఉన్నట్లు ఈ విషయంలో మౌనంగా ఉండద్దని తెలిపారు.

ఒకపక్క పేదలను చంపుతూ, ఇంకోపక్క 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం, దళిత బంధు ఇవ్వడమే తెలంగాణ మోడలా అని అడిగారు. తెలంగాణలో బహుజన రాజ్యం వస్తేనే పేదల బతుకులు బాగుపడుతాయన్నారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు లింగం, బిఎస్పి రాష్ట్ర నాయకులు గుండెల ధర్మెందర్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు చిరంజీవి, సాయికృష్ణ, గుడ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story