ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ స్థాపిస్తాం: RSP

by GSrikanth |   ( Updated:2022-08-31 07:31:02.0  )
ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ స్థాపిస్తాం: RSP
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై నిర్లక్ష్యం వహిస్తుందని, తాము అధికారంలోకి వస్తే ఉన్నత చదువులు చదివే విధంగా ప్రతి మండలంలో ప్రభుత్వ గురుకుల ఇంటర్నేషనల్ స్కూల్స్ స్థాపిస్తామని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హామీ ఇచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన బుధవారం గ్లోబల్ ఎన్ఆర్ఐ ఫోరమ్ ఆధ్వర్యంలో డెట్రాయిట్ నగరంలో మీట్ అండ్ గ్రీట్ సమావేశంలో ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో విద్యకు 8 వేల కోట్లు మాత్రమే కేటాయించిందని, విద్యా రంగానికి ఆ నిధులు ఏమాత్రం సరిపోవని అన్నారు. రాష్ట్రంలో 25 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, ఆ స్కూల్లలో కనీస సౌకర్యాలు కూడా లేవని తెలిపారు. ఉన్నత విద్య కూడా అలానే ఉందని, యూనివర్సిటీల్లో సరిపడా అధ్యాపకులు కూడా లేరని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టల్‌లో విష ఆహారం తిని విద్యార్థులు అనారోగ్యానికి గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ఎక్కడ చుసినా మద్యం షాపులు కనబడుతున్నాయని, బహుజన రాజ్యం వస్తే వాటి స్థానంలో పాలు అమ్ముతామని, ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. రాష్ట్రంలో ప్రజలకు సరైన వైద్యం అందడం లేదన్నారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులు దారుణంగా ఉన్నాయి. కొన్ని ప్రభుత్వ హాస్పత్రుల్లోకి పాములు, ఎలుకలు వస్తున్నాయి.. బెడ్లు లేక రోగులను నేలపై పడుకోబెడుతున్నారని వివరించారు. ఇటీవల ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి నలుగురు మహిళలు చనిపోవడం నిర్లక్ష్యమే కారణమన్నారు.

రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, ప్రభుత్వ ఎనిమిదేళ్ల పాలనలో 5 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు ప్రపంచం గర్వించదగ్గ రైతుబంధు స్కీమ్ తెచ్చానని గొప్పలు చెబుతారని అన్నారు. రైతుబందు వల్ల భూస్వాములు తప్ప రైతులు బాగుపడటం లేదన్నారు. సీఎం ఇప్పటికీ ఉద్యమంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, ప్రజల బతుకులు మారాలంటే బహుజన రాజ్యం రావాలన్నారు.

Also Read : తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి: RSP

Advertisement

Next Story