బండి సంజయ్‌కి దమ్ముంటే ముందు ఆ పని చేయాలి: RSP

by GSrikanth |   ( Updated:2022-12-01 15:55:26.0  )
బండి సంజయ్‌కి దమ్ముంటే ముందు ఆ పని చేయాలి: RSP
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రాన్ని పాలిస్తున్న నాయకులు పేదల ప్రజలందరినీ దోచుకొని, కోట్లు సంపాదించి ఢిల్లీలో పెట్టుబడులు పెట్టి స్కాంలు చేస్తున్నారని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కరుడుగట్టిన దొంగల వలే దోపిడీ చేసిన ఆధారాలు, సొమ్ము దొరకకుండా మొబైల్ ఫోన్లు ధ్వంసం చేశారని విమర్శించారు. అలంపూర్ లాంటి అనేక నియోజకవర్గాలలోని పేదల కోసం ఖర్చు చేయాల్సిన డబ్బు దోచుకున్న దొంగలకు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా బీఎస్పీ కమిటీ చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర అలంపూర్ నియోజకవర్గంలో గురువారం ముగిసిన సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దక్షిణ కాశీ జోగులాంబ అలంపూర్ దేవాలయాన్ని ఆయన సందర్శించారు.

అనంతరం అలంపూర్ కేంద్రంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం మార్చడానికి ప్రయత్నిస్తోందని, మైనారిటీలకు ఓటు హక్కు తీసేయాలని కుట్ర చేస్తోందని, కానీ బీసీల కులగణన చేయకుండా మోసం చేస్తుందని ఆరోపించారు. దమ్ముంటే బండి సంజయ్ బీసీ రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. లేదంటే ఓట్ల కోసం రావద్దని హెచ్చరించారు. అలంపూర్ ఎమ్మెల్యే పేదల పక్షాన నిలిచి మాట్లాడలేడని, ఆయన కేసీఆర్ చెప్పిందే చేస్తారని విమర్శించారు. అలంపూర్ నుంచి ప్రజలు రాయచూర్, బెంగళూరు, కర్నూల్, హైదరాబాద్ వలస వెళ్తున్నారని, అదే సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట ప్రజలు వెళ్తారా అని ప్రశ్నించారు. అలంపూర్‌లో పలు సమస్యలున్నాయని వివరించారు. రాబోయే ఎన్నికల్లో అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లో బీఎస్పీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం నియోజకవర్గంలోని అనేక మండలాల నుంచి పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో గద్వాల జిల్లా అధ్యక్షుడు కేశవరావు, మహిళా కన్వీనర్ రాములమ్మ, అలంపూర్ నియోజకవర్గ అధ్యక్షుడు మహేష్, ఉపాధ్యక్షుడు సుంకన్న, జనరల్ సెక్రటరీ రాంబాబు, కనక రాజు, ఇతర మండలాల నాయకులు కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు.

Advertisement

Next Story

Most Viewed