TG Govt MOU: తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు.. సీఎంతో ఆరు ఫార్మా కంపెనీల ప్రతినిధుల భేటీ

by Prasad Jukanti |
TG Govt MOU: తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు.. సీఎంతో ఆరు ఫార్మా కంపెనీల ప్రతినిధుల భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో పరిశ్రమలను నెలకొల్పి తద్వారా యువతకు ఉపాధి అవకాశాలను పెంచాలని చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) ఆ దిశగా మరో కీలక ముందడుగు వేసింది. తాజాగా దేశంలో పేరొందిన పలు ఫార్మా కంపెనీల (Pharma Companies) తో ఎంవోయూలు (MOU) కుదుర్చుకుంది. దీంతో రాష్ట్రానికి దాదాపు రూ.5,260 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా ఫార్మా రంగంలో 12,490 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఎంఎస్ఎన్ గ్రూప్, లారస్ ల్యాబ్స్, గ్లాండ్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, అరబిందో ఫార్మా, హెటిరో ల్యాబ్స్ కంపెనీల ప్రతినిధులు ఇవాళ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో సంప్రదింపులు జరిపారు. టీఎస్ఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్న ఈ సమావేశంలో ఎంవోయూ కుదుర్చుకున్నాయి. తమ కంపెనీల కార్యకలాపాల విస్తరణతో పాటు కాలుష్య రహితంగా ఏర్పాటు చేసే గ్రీన్ ఫార్మా కంపెనీలను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వీటి ద్వారా ఫార్మా రంగంలో 12,490 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. కాగా ఇప్పటికే ప్రభుత్వం గుర్తించిన ఫార్మా సిటీలో వీటికి అవసరమైన యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించనుంది.

భూ కేటాయింపులపై సీఎం ఆదేశాలు

మరో నాలుగు నెలల్లో ఫార్మా కంపెనీలు తమ నిర్మాణ పనులు చేపట్టేందుకు వీలుగా స్థలాలను కేటాయించటంతో పాటు, ఫార్మా సిటీలో అవసరమైన సదుపాయాలు కల్పించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎంవోయూల ఒప్పందాల ప్రకారం ఎంఎస్ఎన్ లాబోరేటరీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌తో పాటు ఆర్అండ్‌డీ సెంటర్ నెలకొల్పనుండగా, లారస్ ల్యాబ్స్, అరబిందో ఫార్మా ఫార్ములేషన్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాయి. గ్లాండ్ ఫార్మా ఆర్అండ్‌డీ సెంటర్, ఇంజెక్టబుల్స్, డ్రగ్ సబ్‌స్టెయిన్స్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్లను స్థాపించనుంది. డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ ఇంజెక్టబుల్, బయో సిమిలర్ల యూనిట్ ఏర్పాటు చేస్తుంది. హెటిరో ల్యాబ్స్ ఫినిషిడ్ డోస్, ఇంజెక్టబుల్ తయారీ పరిశ్రమ నెలకొల్పనుంది. ఈ సమావేశంలో డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ డైరెక్టర్ సతీశ్‌‌రెడ్డి, లారస్ ల్యాబ్స్ ఈడీ వీవీ రవికుమార్, గ్లాండ్ ఫార్మా సీఈవో శ్రీనివాస్, ఎంఎస్ ల్యాబ్స్ సీఎండీ ఎంఎస్ఎన్‌రెడ్డి, అరబిందో డైరెక్టర్ మదన్‌మోహన్‌రెడ్డి, హెటిరో గ్రూప్ ఎండీ వంశీకృష్ణ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed