కాంగ్రెస్ ఎమ్మెల్యే తీరును ఖండించిన రెవెన్యూ అసోసియేషన్

by Rajesh |
కాంగ్రెస్ ఎమ్మెల్యే తీరును ఖండించిన రెవెన్యూ అసోసియేషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రెవెన్యూ అధికారుల పట్ల ప్రజా ప్రతినిధులు దురుసుగా వ్యవహరించడం సరికాదని ట్రెసా ప్రతినిధులు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల తహసీల్దార్ కార్యాలయానికి తన అనుచరులతో కలిసి వచ్చిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గిర్దావర్ వెంకట్ రెడ్డిని దుర్బాషలాడడం బాధాకరమన్నారు. తన అనుచరులు పరుష పదజాలంతో దూషించడం సరికాదని ట్రెసా రాష్ట్ర సంఘం అక్షేపించింది. సెలవు రోజుల్లో పని ఎలా చేస్తారని ఓ ఎమ్మెల్యే రెవెన్యూ ఉద్యోగులను మాట్లాడడం గర్హనీయమని సంఘం అభిప్రాయపడింది.

ఒక వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో రైతుల భూసమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలోని రెవెన్యూ ఉద్యోగులంతా జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకు రాత్రి పగలు పని చేస్తున్నారని, ఈ పదిరోజుల్లో పెండింగ్ ధరణి దరఖాస్తులకు నివేదికలు పంపాలని సెలవు రోజుల్లో కూడా పని చేస్తున్నారని.. ఇటువంటి సమయంలో ఎమ్మెల్యే తహసీల్దార్ ఆఫీస్‌కి వెళ్లి సిబ్బందిని ఆవేశంతో దూషించడం వల్ల యావత్ రెవెన్యూ ఉద్యోగులంతా ఆందోళన చెందుతున్నారని ట్రెసా అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే సరైన రెవెన్యూ సిబ్బంది లేక క్షేత్ర స్థాయిలో చాలా పని ఒత్తిడితో రెవెన్యూ ఉద్యోగులు సతమతమవుతున్నారని, అవసరమున్న చోట రిటైర్డ్ ఉద్యోగుల సహకారం తీసుకుంటున్నారని గుర్తు చేశారు.

గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల రెవెన్యూ శాఖకు చాలా నష్టం జరిగిందని దీని వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాంటి రెవెన్యూ శాఖను ఈ ప్రభుత్వం కాపాడుతుందని ఆశాభావంతో ఉన్నామని ట్రెసా ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ప్రజా ప్రతినిధులంటే తమకు గౌరవం ఉందని, ప్రభుత్వ ఉద్యోగులు కూడా పాలనలో బాగమని వారు గుర్తించాలని కోరారు. బాలానగర్ సంఘటన విషయంలో ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, ఆర్ఐ వెంకట్ రెడ్డి సస్పెన్షన్‌ను రద్దు చేయాలని సోమవారం ట్రెసా జిల్లా కమిటీ కలెక్టర్‌ను కలిసిందని, దీనిపై నేడు రెవెన్యూ మంత్రిని కలిసి నిర్ణయం తీసుకుంటామని ట్రెసా ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed