కులగణనకు అసెంబ్లీ సై.. సభలో కేసీఆర్ ప్రభుత్వంపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |
కులగణనకు అసెంబ్లీ సై.. సభలో కేసీఆర్ ప్రభుత్వంపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో:బలహీనవర్గాలను ఆర్థికంగా నిలబెట్టడంతో పాటు జనాభాకు అనుగుణంగా నిధులు కేటాయించడమే తమ ప్రభుత్వ ఉద్దేశం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో బీసీ కులగణనపై శాసనసభలో శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి కార్యక్రమం చేపట్టాలనే ఉద్దేశంతో తీర్మానాన్ని సభ ముందుకు తీసుకువచ్చామని గత ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే చేపట్టి ఆ వివరాలను బహిర్గతం చేయకుండా ఒక కుటుంబం తన దగ్గర దాచుకుని రాజకీయ అవసరం ఉన్నప్పుడు ఆ వివరాలను వాడుకుందని ఆరోపించారు. ఆ సర్వే వివరాలను బయటపెట్టారా? అని ప్రశ్నించారు. బీసీ కులగణన విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదన్నారు. కులగణన తీర్మానంపై ప్రతిపక్షాలకు అనుమానం ఉంటే సూచనలు సలహాలు ఇవ్వాలని తీర్మానంపై ఏదైనా న్యాయపరమైన చిక్కులు వస్తాయనే అనుమాలు ఉంటే ప్రతిపక్షాలు సూచనలు, సలహాలు ఇవ్వాలే తప్ప ఈ తీర్మానానికే చట్టబద్ధత లేదనేలా చర్చ జరగడం మంచిది కాదన్నారు. కులగణన వల్ల అరశాతం ఉన్న వాళ్లకు బాధ ఉంటుందన్నారు. కడియం శ్రీహరిని ఆయన పార్టీ నేతలే తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.

కేసీఆర్ సభకు వచ్చి సలహాలు ఇవ్వాలి:

ఈ తీర్మానం బలహీన వర్గాలను బలంగా తయారు చేయడమే మా ఉద్దేశమని, బాధితులుగా ఉన్న వాళ్లను పాలకులుగా చేయాలన్నదే మా ఆలోచన అన్నారు. బలహీన వర్గాలకు అండగా నిలబడాలంటే వారి లెక్కలు ఏంటో తెలియాలని సుప్రీంకోర్టు వరకు చర్చలు జరిగాయి. బలహీన వర్గాల లెక్కలు తేల్చి, వారి నిధులు, నియామకాల విషయంలో సహేతుకమైన వాటా ఇవ్వాలని యూపీఏ ప్రభుత్వం 2011లో ప్రయత్నం చేసింది. కానీ ఆ తర్వాత వచ్చిన మోడీ ప్రభుత్వం ఆ ప్రయత్నాన్ని తొక్కిపెట్టిందన్నారు. ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్షం నాయకుడు కేసీఆర్ సభకు వచ్చి సూచనలు ఇవ్వాలన్నారు. బీఆర్ఎస్ సభ్యులు కడియం శ్రీహరిని తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు.

తీర్మానాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం: కేటీఆర్

తీర్మానాన్ని పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మద్దతు తెలుపుతున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఈ విషయంలో ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవన్నారు. 2004 డిసెంబర్ 17న కేంద్ర మంత్రిగా కేసీఆర్.. బీసీ నేతలు ఆర్.కృష్ణయ్య, వకుళాభరణం తదితరులను కలిసి తీసుకెళ్ళి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తో భేటీ అయ్యారు. గంటన్నర పాటు సమావేశమయ్యారు. అన్ని రాష్ట్రాల్లో బీసీ సంక్షేమ మంత్రిత్వశాఖలు ఉన్నందున కేంద్రంలోనూ ఓబీసీ మంత్రిత్వశాఖను పెట్టండంటూ కేంద్ర మంత్రిగానే స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రెండుసార్లు తీర్మానాలు చేసి పంపింది. మంత్రిత్వశాఖ పెడితేనే బడ్జెట్‌లో రెండు లక్షల కోట్లు వస్తుందని చెప్పారు. బిహార్ లో జీఏడీ ద్వారా కుల సర్వే ప్రాసెస్ పూర్తయింది. న్యాయపరమైన చిక్కులు రావడంతో రో.500 కోట్ల ధనం వృథా అయింది. గాలిలో వేలాడుతూ ఉన్నది.ఈ కార్యక్రమం ఫలవంతం కావాలంటే ఒక పని చేయాల్సిందే. శాసనసభను పొడిగించండి. బిల్లును పెట్టి ఆమోదించుకుందాం. చట్టబద్ధత ఉంటేనే ఇది సక్సెస్ అవుతుంది. రాజేంద్ర సచార్ కమిషన్ ఏర్పాటులో కేసీఆర్ చొరవ ఉన్నది. ఇప్పుడు పెట్టిన తీర్మానానికి ఆశించిన ఫలితం ఉండాలంటే.. జ్యుడిషియల్ శాంక్టిటీ ఉండాలి. హైకోర్టును అడిగితే ఒక జడ్జిని ఇస్తారు.. లేదంటే రెండు రోజులు పొడిగించి బిల్లు పెడితే మేం కూడా మద్దతు ఇస్తామన్నారు.


క్లారిటీ ఇవ్వాలి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

కులగణనను మేం ఆహ్వానిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, గంగుల కమలాకర్ చెప్పారు. అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంలో స్పష్టత లేదని కులగణనపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలన్నారు. చర్చ సందర్భంగా మాట్లాడిన కడియం, గంగుల.. జన, కులం అంటూ ద్వంద్వ వైఖరి కనిపిస్తోందని జనగణన చేసే హక్కు రాష్ట్రాలకు లేదన్నారు. కేవలం కులగణన మాత్రమే చేసే హక్కు రాష్ట్రాలకు ఉంటుదన్నారు. తీర్మానానికి చట్టబద్ధత కల్పించాలని చట్టబద్ధత లేకుండా తీర్మానం పెడితే లాభం ఉండదన్నారు. ఎలాంటి చట్టబద్ధత లేకుండా తీర్మానం పెడితే లాభం ఉండదన్నారు. ఎన్నికల ముందు తీర్మానం చేసి దాని తర్వాత ఏం చేస్తారని ప్రశ్నించారు. కులగణన చేపట్టిన ప్రకారం తమకు రాజ్యాధికారం కావాలని, ఉద్యోగావకాశాలు కల్పించాలని గంగుల డిమాండ్ చేశారు.

ఈ సర్వే సర్వరోగనివారిణి: భట్టి

రాష్ట్రంలో కులగణన మాత్రమే కాదని ప్రతి ఇంటి సర్వే నిర్వహించి వారి ఆర్థిక స్థితిగతుల వివరాలు సేకరిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బీసీ కులగణనపై జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వంటి అంశాలపై సభ్యులు వ్యక్తం చేసిన అనుమానాలను నివృత్తి చేస్తామన్నారు. తాము చేపట్టబోయే సర్వే వీటన్నింటికి సర్వరోగ నివారిణిగా ఉండబోతున్నదన్నారు. తాము చేయబోయే సర్వే ఈ దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, సామాజిక మార్పులకు పునాదిగా మారబోతున్నదని అటువంటి తీర్మానాన్ని తీర్మానాన్ని ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టిందన్నారు. ఈ సర్వే విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని కన్ఫ్యూజన్ ఉన్నదల్లా బీఆర్ఎస్ కేనన్నారు.

గంగులకు పొన్నం రిప్లై:

ప్రతిపక్షాల సదేహాలు నివృత్తి చేసే బాధ్యత మాదని మాజీ మంత్రి 10 ఏళ్లుగా మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి అప్పుడు బలహీన వర్గాల గొంతు వినిపించలేదని కాబట్టి అప్పుడు చెప్పినవన్నీ ఇప్పుడు చెబుతున్నారు కావొచ్చన్నారు. ఎవరు ఏమి చెప్పినా వింటాం. జవాబు చెబుతామన్నారు. మేము మీలాగా సకల జనుల సర్వే అని చెప్పి బొంబాయి నుంచి బస్సుల రమ్మని చెప్పలేదన్నారు.

బీజేపీ బీటీమ్ ముద్రవేస్తున్నారు: అక్బరుద్దీన్ ఓవైసీ

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశ అభివృద్ధిలో మైనార్టీల పాత్ర ఉందని ముస్లింలు ఇందిరా గాంధీ నుంచి సోనియా గాంధీ వరకు మద్దతు ఇచ్చారని రాష్ట్రంలోనూ కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలకు సహకరించాయని అన్నారు. బీసీ, దళిత వర్గాల కోసం కొట్లాడితే లీడర్లు అంటున్నారని అదే మేము మైనార్టీల కోసం కొట్లాడితే మమ్మల్ని బీజేపీ బి-టీమ్ అంటున్నారని అన్నారు. కులగణన కంటే ముందు సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ ను సభలో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ తీర్మానానికి మేం మద్దతు ఇస్తున్నామని కానీ క్లారిటీ, న్యాయపరమైన అంశాలపై జాగ్రత్తగా ఉండాలన్నారు.


Advertisement

Next Story