‘రేవంత్ రెడ్డి సునో..’ బీజేపీ గెలవబోయే సీట్ల సంఖ్యపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |
‘రేవంత్ రెడ్డి సునో..’ బీజేపీ గెలవబోయే సీట్ల సంఖ్యపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ‘రేవంత్ రెడ్డి విను.. 2019లో తెలంగాణలో బీజేపీ 4 స్థానాల్లో గెలిచింది. ఈసారి ఎన్నికల్లో 10 కంటే ఎక్కువ సీట్లలో మేము గెలవబోతున్నాం. తెలంగాణలో డబుల్ డిజిట్ స్కోర్ మోడీని 400 స్థానాల్లో గెలిపించేందుకు మార్గం సుగమం చేస్తుంది. కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా, శోచనీయంగా మారింది’ అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. గురువారం భువనగిరిలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచార బహిరంగ సభలో మాట్లాడుతూ.. 2024 సార్వత్రిక ఎన్నికలు రాహుల్ గాంధీకి నరేంద్ర మోడీకి మధ్య జరుగుతున్నాయని, ఓటు ఫర్ జిహాద్ కు ఓట్ ఫర్ వికాస్ కు మధ్య, కొంత మంది కుటుంబ సభ్యుల అభివృద్ధికి, యావత్ దేశాభివృద్ధికి మధ్య మధ్య జరుగుతున్నాయన్నారు. దేశంలో మూడో దశల పోలింగ్ ముగిసే సరికి బీజేపీ 200 సీట్లకు చేరువలో ఉందని 400 సీట్లు సాధించేందుకు తెలంగాణలో గెలవబోయే సీట్లు ఉపయోగపడతాయన్నారు.

దోచుకోవడమే బీఆర్ఎస్, కాంగ్రెస్ విధానం:

నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదం పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పదేళ్లు తమ కుటుంబం బాగు కోసమే పని చేసిందని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారుకు ఐదేండ్లు అవకాశం కల్పించారు.. కానీ ఆ పార్టీ తెలంగాణను ఏటీఎంలా మార్చుకుంటోందని ధ్వజమెత్తారు. తెలంగాణలో బీజేపీకి కనీసం పది సీట్లలో గెలిపించండి.. దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను మార్చుతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అబద్దాలతో ఈ ఎన్నికలు గెలవాలని చూస్తోందని అమిత్ షా ధ్వజమెత్తారు. మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని.. నిజానికి మోడీ గత పదేళ్లుగా ఫుల్ మెజార్టీతో అధికారంలో ఉండి కూడా రిజర్వేషన్లు తొలగించలేదన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీనే తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లలో కోత విధించి ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను అందిస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీకి పదికి పైగా సీట్లు గెలిపించండి.. మేము ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేస్తామన్నారు. మోడీ చేసేదే చెప్తారని.. అదే రాహుల్ గాంధీ చెప్పే గ్యారెంటీలు సూర్యాస్తమయానికి మాయం అవుతాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రైతులకు రుణమాఫీ ఇస్తామనిర రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. రైతు కూలీలకు రూ.12 వేలు, ధాన్యానికి రూ.500 బోనస్ తో పాటు అనేక హామీలు ఇచ్చారని అవేని పూర్తికాలేదని విమర్శించారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ మజ్లిస్ అరాచకాలను ఆపగలవా?:

తెలంగాణలో ఏబీసీ (ఏ అంటే అసద్, బీ అంటే బీఆర్ఎస్, సీ అంటే కాంగ్రెస్) ఈ మూడు ఒక్కటేనని కాంగ్రెస్, బీఆర్ఎస్ లు మజ్లిస్ పార్టీ అరాచకాలను ఆపగలుగుతాయా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ మూడు ట్రయాంగిల్ లాంటివని వీరు రామ నవమి ఊరేగింపునకు కూడా ఆంక్షలు విధించారని, హైదరాబాద్ విమోచనాన్ని కూడా నిర్వహించేందుకు అనుమతివ్వలేదని, సీఏఏను వ్యతిరేకించారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని జరుపనివ్వరని మండిపడ్డారు. మళ్లీ ట్రిపుల్ తలాక్ తీసుకురావాలనుకుంటున్నారని ఆరోపించారు.

భువనగిరి టెక్స్ టైల్ ఇండస్ట్రీ కోసం మోడీ కృషి:

భువనగిరి టెక్స్ టైల్ పరిశ్రమల కోసం మోడీ కృషి చేశారని కొత్త టెక్స్ టైల్ విధానంతో 8 లక్షల మంది చేనేత కార్మికులకు ఉపాధి చేకూరిందన్నారు. రూ. 1500 కోట్లతో జాతీయ టెక్స్ టైల్ విధానం అమల్లోకి తెచ్చామన్నారు. రూ. 14 వేల కోట్లతో పోచంపల్లిలో టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు చేశారన్నారు. చేనేత కోసం మోడీ చేనేత పాలసీ తీసుకువచ్చారని, భువనగిరి 140 కోట్ల ఖర్చుతో భువనగిరి నుంచి బోపాల్ వరకు జాతీయ రహదారి, బీబీ నగర్ ఏయిమ్స్ ఏర్పాటు చేసి 3 జిల్లాలక ప్రజలకు వైద్య సదుపాయం కల్పించారు. జనగామ- భువనగిరి రైల్వే స్టేషన్ ను ఆధునీకీకరణ పనులు, కొమురవెళ్లిలో అత్యాధునిక రైల్వే స్టేషన్ నిర్మాణం పనులు జరుగుతున్నాయని, రాయగిరి నుంచి వరంగల్ వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణం పూర్తయిందని చెప్పారు.

Advertisement

Next Story