నిజంగా ఉద్యమకారుడివైతే.. నా సవాల్ స్వీకరించు: కేసీఆర్‌కు రేవత్ రెడ్డి ఛాలెంజ్

by Satheesh |   ( Updated:2023-10-17 10:42:09.0  )
నిజంగా ఉద్యమకారుడివైతే.. నా సవాల్ స్వీకరించు: కేసీఆర్‌కు రేవత్ రెడ్డి ఛాలెంజ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ చేసి గెలవాలని కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని టీపీసీసీ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎక్కడ డబ్బులు దొరికినా అవి కాంగ్రెస్‌వే అని బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. నిజానికి డబ్బు, మద్యంతో హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికలు గెలిచిన చరిత్ర ఆ పార్టీదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్‌వి దిగజారుడు రాజకీయాలన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేశామని నమ్మితే వచ్చే ఎన్నికల్లో మద్యం, నగదు పంచకుండా ప్రజలను ఓట్లు అడుగుతామని సీఎం కేసీఆర్ ప్రమాణం చేయాలన్నారు.

మీరు నిజంగా ఉద్యమకారులైతే మా సవాల్ స్వీకరించాలని డిమాండ్ చేశారు. అమర వీరుల స్థూపంపై ప్రమాణం చేద్దామని రమ్మంటే కేసీఆర్ రాలేదని ఎద్దేవా చేశారు. మంగళవారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ మందు, మద్యం పంచకుండా 6 గ్యారెంటీ స్కీమ్‌లతోనే ప్రజల్లోకి వెళ్తామన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఏం జరిగిందో దేశ ప్రజలందరూ చూశారని అన్నారు.

కేసీఆర్ ప్రైవేట్ ఆర్మీగా రిటైర్డ్ ఆఫీసర్లు:

నిరుద్యోగ యువతి ప్రవళిక ఆత్మహత్యపై అనేక అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని రక్షించేందుకు ఆదరబాదరగా ఓ డీసీపీ బయటకు వచ్చి ప్రవళిక కుటుంబాన్ని మరింత ఇబ్బంది పెట్టేలా అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. ఈ విషయాన్ని తాను ప్రశ్నించేసరికి ప్రెస్ మీట్ పెట్టిన అధికారిని కాదని అతడి కింది స్థాయి అధికారిని సస్పెండ్ చేశారని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిర్భయ చట్టం గురించి తెలుసా అని ప్రశ్నించారు.

రిటైర్ అయిన అధికారులను ఈ ప్రభుత్వం ఎందుకు కొనసాగిస్తోందని నిలదీశారు. కలెక్టర్లు, ఎస్పీల బదిలీల పేరుతో నిన్నా మొన్న ఎన్నికల సంఘం అధికారులు హడావుడి చేశారని కానీ రిటైర్డ్ అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. రిటైర్డ్ అధికారులను ప్రైవేట్ సైన్యంగా చేసుకుని కేసీఆర్ మాపై దాడులు చేస్తున్నాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed