Revanth Reddy: భూసేకరణ పారదర్శకంగా జరగాలి.. అధికారులకు సీఎం ఆదేశాలు

by Ramesh Goud |
Revanth Reddy: భూసేకరణ పారదర్శకంగా జరగాలి.. అధికారులకు సీఎం ఆదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం భూసేకరణ పనుల్లో వేగం పెంచాలని, భూసేకరణ పారదర్శకంగా జరగాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు పనులపై డా. బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం భూసేకరణ పనుల్లో వేగం పెంచాలని అధికారులను, సీఎం ఆదేశించారు.

అలాగే భూసేకరణ పూర్తి పారదర్శకంగా జరగాలని, ఆర్ఆర్ఆర్ నిర్మాణ పనుల్లో పురోగతిపై సంబంధిత కలెక్టర్లు రోజూవారిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించాలని పేర్కొన్నారు. అంతేగాక ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు మధ్య అనుసంధానానికి అనువుగా రహదారుల ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రధాన రహదారులకు అనుసంధానం చేసే ప్రదేశాలను ముందుగానే గుర్తించి నిరంతరం సాఫీగా ప్రయాణాలు సాగేందుకు వీలుగా నిర్మాణాలు ఉండాలని అన్నారు.

ఇక భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్ ఉండాలని, ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కానున్న వివిధ రకాల పరిశ్రమలు, సంస్థలకు ఉపయోగకరంగా ఈ మార్గాల ప్రణాళికలు ఉండాలని స్పష్టం చేశారు. ఆర్ఆర్ఆర్ కింద సంగారెడ్డి – భువనగిరి – చౌటుప్పల్ మార్గంలో భూసేకరణ దాదాపుగా పూర్తి కాగా.. దక్షిణ భాగంలో చౌటుప్పల్- ఆమ‌న్‌గ‌ల్‌- షాద్ న‌గ‌ర్‌- సంగారెడ్డి పరిధిలో 189.20 కిలోమీటర్ల మార్గానికి సంబంధించి భూ సేక‌ర‌ణ, అలైన్‌మెంట్‌ అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఆ సూచనలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్ర నివేదిక తయారు చేసి త్వరగా అందజేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఆర్ఆర్ఆర్ విషయంలో ఏవైనా సాంకేతిక సమస్యలుంటే వెంటనే కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed