రేవంత్‌కు వారంటే ప్రేమ, గౌరవం అసలే లేదు!.. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్

by Ramesh Goud |
రేవంత్‌కు వారంటే ప్రేమ, గౌరవం అసలే లేదు!.. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం రేవంత్ కు యువతపై ప్రేమ లేదని, నిరుద్యోగులు అంటే అసలే గౌరవం లేదని, అక్రమంగా అరెస్ట్ చేసిన వారందరినీ బేషరతుగా వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. టీజీపీఎస్సీని ముట్టడించి ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్వీ కార్యకర్తలు, నిరుద్యోగులను అరెస్ట్ చేసిన పోలీసులు అని బీఆర్ఎస్ ట్వీట్ పై స్పందించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. నిరుద్యోగ యువతను నమ్మించి మోసం చేసిన నయవంచక సర్కారు అని, ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోమంటే ఇంత నిర్బంధమా??, అంటూ.. తెల్ల దొరల పాలన కన్నా.. దుర్మార్గంగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఓ వైపు ప్రజా పాలన అంటునే.. మరోవైపు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి యువతను అక్రమంగా అరెస్టు చేస్తారా? ప్రశ్నించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇంతటి నిరంకుశ విధానాలను అవలంభిస్తారా?? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇది ప్రజా పాలన కాదని, ముమ్మాటికీ ప్రజాకంఠక పాలన అని విమర్శలు చేశారు. ప్రచారంలో ఒక మాట.. ప్రభుత్వంలోకి వచ్చాక.. మరో మాట మాట్లాడుతున్న సీఎం రెండు నాల్కల వైఖరి తెలంగాణ యువతకు అర్థమైపోయిందని, అక్రమంగా అరెస్టు చేసిన వారందరిని బేషరతుగా వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఉద్యోగ నియామకాలు చేపట్టడంలో.. జాబ్ క్యాలెండర్ ప్రకటించడంలో.. అట్టర్ ఫ్లాప్ అయినందుకు వెంటనే నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కారు క్షమాపణలు చెప్పాలన్నారు. నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చకుండా.. నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ సర్కారును ఈ పాపం శాపమై భూస్థాపితం చేయడం ఖాయమని కేటీఆర్ స్పష్టం చేశారు.

Next Story

Most Viewed