ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించాలి.. కలెక్టర్ ముజ్మిల్ ఖాన్

by Sumithra |
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించాలి.. కలెక్టర్ ముజ్మిల్ ఖాన్
X

దిశ, ఏన్కూరు : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు ప్రణాళిక బద్ధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ ఏన్కూరు మండలం హిమాంనగర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రభుత్వ పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించిన కలెక్టర్ విద్యార్థుల విద్యా ప్రమాణాలు పరీక్షించారు. విద్యార్థులకు ఏకరూప దుస్తులు వచ్చాయా, పాఠ్యాంశాలు జరుగుతున్నాయా, మధ్యాహ్న భోజనం వివరాలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక తరగతుల విద్యార్థుల కనీస విద్యా ప్రమాణాలను కలెక్టర్ పరీక్షించారు. విద్యార్థుల కనీస విద్యా ప్రమాణాల పై ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని, పిల్లలకు తప్పనిసరిగా చదవడం, రాయడం, బేసిక్ మ్యాథ్స్ రావాలని అన్నారు. పాఠశాలలో చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించారు.

విద్యుత్, తాగునీరు, టాయిలెట్ పనులు పూర్తయినట్లు, మైనర్ పనులు పురోగతిలో ఉన్నట్లు తెలిపారు. మిగులు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అంగన్వాడి కేంద్రం ద్వారా గ్రామంలో గర్భిణులను 100 శాతం ఏ.ఎన్.సి. రిజిస్ట్రేషన్ చేసి, రెగ్యులర్ పరీక్షలు చేయించుకునేలా చూడాలని అన్నారు. గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రానికి విద్యుత్ సరఫరా, లైట్లు, ఫ్యాన్ సౌకర్యం కల్పించాలని అన్నారు. పాఠశాల లోపల, ఆవరణ అంతయు పరిశుభ్రంగా ఉంచాలని, ఎక్కడా నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు వహించాలని అన్నారు. పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పిల్లలతో పాటు నేల పై కూర్చొని, వారి విద్యా ప్రమాణాలు పరిశీలించారు. పిల్లలతో మమేకమై, వారిని ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శేషగిరిరావు, ఆర్ ఐ నవీన్ పాల్గొన్నారు.

Advertisement

Next Story