హత్య కేసును చేధించిన కూకట్​పల్లి పోలీసులు...

by Kalyani |
హత్య కేసును చేధించిన కూకట్​పల్లి పోలీసులు...
X

దిశ, కూకట్​పల్లి : కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలో అక్టోబర్​ 2వ తేదీన సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసును కూకట్​పల్లి పోలీసులు ఛేదించారు. కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్​లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బాలానగర్​ డీసీపీ సురేష్​ కుమార్​, అడిషనల్​ డీసీపీ సత్యనారాయణ, ఏసీపీ శ్రీనివాస్​ రావులతో కలిసి వివరాలు వెల్లడించారు. కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఉదాసీన్​ మఠ్​కు చెందిన ఖాళీ మైదానంలో ఓ మహిళ మృతదేహం లభించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సదరు మహిళ నిజామబాద్​ జిల్లా, అంబం గ్రామానికి చెందిన ధర్మారం ప్రియాంక(23)గా గుర్తించారు. గత రెండు నెలల క్రితం సొంతూరు నుంచి కేపీహెచ్​బీ కాలనీ కి వచ్చి మెట్రో స్టేషన్​ కింద ఉంటూ సెక్స్​ వర్కర్​గా పని చేసుకుంటుంది. ఈ క్రమంలో మెట్రో స్టేషన్​ వద్ద ఉండే మరొక సెక్స్​ వర్కర్​ అయిన ఎల్లమ్మబండ ఎన్టీఆర్​ నగర్​కు చెందిన కటారి మంజుల తో పరిచయం అయింది.

ప్రియాంకకు ఉండటానికి ఇల్లు లేక పోవడంతో తన వద్ద ఉన్న వెండి పట్ట గొలుసులు, మెట్టెలు మంజులకు ఇచ్చి దాచి పెట్టమని చెప్పింది. ఇదిలా ఉండగా వారం రోజుల క్రితం ప్రియాంక తన వెండి వస్తువులు తిరిగి ఇవ్వమని మంజులను అడిగితే మంజుల ఇవ్వకుండా దాట వేస్తూ వస్తుంది. ఈ క్రమంలో గత నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ప్రియాంక తనతో పాటు కొంత మందిని వెంటబెట్టుకుని మంజుల వద్దకు వెళ్లి తన వస్తువులు ఇవ్వకుంటే అంతు చూస్తానని గొడవపడింది. ఇదిలా ఉండగా అక్టోబర్​ 1వ తేదీన మంజుల ప్రియాంకను తన వద్ద ఉన్న వస్తువులు ఇస్తానని చెప్పి ఎన్టీఆర్​ నగర్​లోని తన ఇంటికి పిలిచి వాటిని తిరిగి ఇచ్చింది.

ఇంటికి వచ్చిన ప్రియాంకతో కలిసి మంజుల మద్యం సేవించింది. అదే రోజు రాత్రి 11:20 గంటల ప్రాంతంలో మంజుల ప్రియాంకను తన టీఎస్​ 08 జేఏ 7513 నంబరు గల టీవీఎస్​ వాహనంపై లోధా అపార్ట్మెంట్​ ఎదురుగా ఉన్న ఉదాసీన్​ మఠ్​కు చెందిన ఖాళీ ప్రదేశానికి తీసుకు వెళ్లింది. ప్రియాంకను రోడ్డు పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో తోసేసిన తరువాత మంజుల తనతో తీసుకు వచ్చిన బ్లేడ్​ సహాయంతో ప్రియాంక కడుపు పై కూర్చోని ఆమె గొంతును కోసేసింది. ప్రియాంక మృతి చెందినట్టు ధృవీకరించుకున్న తరువాత ప్రియాంక మృతి అత్యాచారంగా చిత్రీకరించేందుకు ప్రియాంక ఒంటిపై ఉన్న దుస్తులను బ్లేడ్​ సహాయంతో కత్తిరించి అక్కడి నుంచి తన ఇంటికి వెళ్లి పోయింది. ప్రియాంక మృతదేహం లభ్యం అయిన తర్వాత జాగిలాలు, సీసీ కెమెరా ఫూటేజిల ఆధారంగా కూకట్​పల్లి పోలీసులు, ఎస్​ఓటి బృందాలు టీంలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు.

ప్రియాంకను హత్య చేసింది మంజులగా గుర్తించి మంజులను ఎన్టీఆర్​ నగర్​లో అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో మంజుల ప్రియాంకను హత్య చేసి అత్యాచారంగా చిత్రీకరించినట్టు తన నేరాన్ని అంగీకరించింది. ప్రియాంక గత కొన్ని రోజుల క్రితం తనతో పాటు కొంత మందిని తీసుకు వచ్చి గొడవ పడి బెదిరించిందని, ఎప్పటికైన ప్రియాంకతో తనకు ప్రాణ హాని ఉంటుందని తానే పథకం ప్రకారం మద్యం తాపించి హత్య చేసినట్లు అంగీకరించింది. నిందితురాలి వద్ద నుంచి ప్రియాంక కు సంబంధించిన వస్తువులు, హత్యకు వినియోగించిన బ్లేడ్​, హత్య సమయంలో మంజుల ధరించిన​ చీర, హత్య సమయంలో వినియోగించిన టీఎస్​ 08 జేఏ 7513 నంబరు గల టీవిఎస్​ స్కూటిలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించినందుకు కూకట్​పల్లి సిఐ ముత్తు, ఎస్​ఓటి, కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్​ సిబ్బందిని డీసీపీ అభినందించి రివార్డులు అందజేశారు.

Advertisement

Next Story