ఇక పై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఒకే చోట విద్య

by Mahesh |
ఇక పై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఒకే చోట విద్య
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మించాలన్న ప్రభుత్వ ఆలోచన కార్యరూపం దాలుస్తుంది. దాదాపు పాతిక ఎకరాల విస్తీర్ణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల విద్యార్థులకు ఒకే ప్రాంగణంలో చదువుకునే వెసులుబాటు లభిస్తుందని, ఒక్కో కాంప్లెక్సు నిర్మాణానికి దాదాపు రూ. 26 కోట్లు ఖర్చవుతున్నదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. దసరా కానుకగా రాష్ట్రంలోని 20 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ నెల 11న ముఖ్యమంత్రి, మంత్రులు శంకుస్థాపన (భూమి పూజ) చేస్తారని తెలిపారు. ప్రస్తుతానికి స్థలాన్ని గుర్తించిన నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని, త్వరలోనే ఆ ప్రక్రియ పూర్తయిన వాటికి కూడా శంకుస్థాపనలు ఉంటాయన్నారు. సచివాలయంలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చిన్నతనం నుంచి కుల వివక్ష కొనసాగుతున్నదని, దీన్ని రూపుమాపేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అనే తేడా లేకుండా ఒకే ప్రాంగణంలో విద్యార్థులు చదువుకునేలా ఈ స్కీమ్‌కు ప్రభుత్వం ఆలోచన చేసి కార్యాచరణ మొదలుపెట్టిందన్నారు.

ప్రస్తుతం భూమి పూజ జరుగుతున్న ఈ కాంప్లెక్సుల నిర్మాణం ఏడు నెలల్లో పూర్తయ్యేలా ఆలోచన చేస్తున్నామని, వచ్చే సంవత్సరం దసరా నాటికి ఫంక్షనింగ్‌లోకి వస్తాయని డిప్యూటీ సీఎం భట్టి వివరించారు. ప్రస్తుతానికి కొడంగల్, మధిర, మంథని, హుస్నాబాద్, నల్లగొండ, హుజూర్‌నగర్, ములుగు, ఖమ్మం, కొల్లాపూర్, చాంద్రాయణ్‌గుట్ట, మంచిర్యాల, అచ్చంపేట, తిరుమలగిరి, పాలేరు, వరంగల్, ఆంథోల్, భూపాలపల్లి, స్టేషన్ ఘన్‌పూర్,తుంగతుర్తి నియోజకవర్గాల్లో భూమి పూజ జరుగుతున్నట్లు వివరించారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు వేర్వేరు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయని, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్సు వినియోగంలోకి వస్తే ఇందులోకి షిఫ్ట్ అవుతారని తెలిపారు. మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఇదే ప్రక్రియ కంటిన్యూ అవుతుందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రీన్ ఎనర్జీ బిల్డింగులుగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. తరగతి గదులు మొదలు హాస్టళ్ళు, క్రీడా మైదానాల వరకు ఈ ప్రాంగణంలో ఉంటాయని, అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు.

ప్రపంచ స్థాయిలో తెలంగాణ విద్యార్థులు పోటీ పడేలా విద్యా ప్రమాణాలు ఉంటాయని, సిలబస్ సహా వీటి నిర్వహణపై చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటవుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. గత పదేండ్లలో విద్యా వ్యవస్థలో జరిగిన నిర్లక్ష్యాన్ని గమనంలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుందన్నారు. గత ప్రభుత్వం నిర్మించిన 1,023 గురుకుల విద్యాసంస్థల్లో 662 ప్రైవేటు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, విద్యార్థులకు టాయ్‌లెట్ ఫెసిలిటీ మొదలు మెస్ వరకు సరైన తీరులో ప్లానింగ్ చేయలేదన్నారు. కేవలం రూ. 73 కోట్లనే ఖర్చు చేయగా ఈసారి బడ్జెట్‌లో రూ. 5 వేల కోట్లను కేటాయించినట్లు డిప్యూటీ సీఎం వివరించారు. తగిన సౌకర్యాలు లేనప్పుడు విద్యా ప్రమాణాలు, ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండవని, కేవలం చదువు మీద దృష్టి పెట్టే పద్ధతికి బదులుగా ఎక్స్ ట్రా కరిక్యులర్ ఆక్టివిటీస్ దిశగానూ విద్యార్థుల్ని మానసికంగా డైవర్ట్ చేసేలా ఆలోచిస్తున్నట్లు తెలిపారు.

ఈ కాంప్లెక్స్ లో పన్నెండవ తరగతి వరకు అడ్మిషన్లు ఉంటాయని, చదువుపై ఆసక్తి పెరిగేలా వీటి నిర్వహణ ఉంటుందని డిప్యూటీ సీఎం తెలిపారు. పిల్లల మానసిక వికాసానికి తోడ్పతేలా క్రికెట్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్ తదితర క్రీడలతో పాటు ఓపెన్ ఎయిర్ థియేటర్‌ కూడా ఈ కాంప్లెక్సులో భాగమన్నారు. విద్యార్థులకు హాస్టల్ వసతి ఉన్నట్లుగానే టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బందికి కూడా ఈ ప్రాంగణంలోనే రెసిడెన్షియల్ క్వార్టర్స్ ఉంటాయన్నారు. స్థానిక వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రత మొదలు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ స్కూల్ళ నిర్మాణానికి తగిన డిజైన్‌ను ఖరారు చేసినట్లు తెలిపారు. గతంలో రెసిడెన్షియల్ హాస్టళ్ళలో ఒకే రూమ్‌లో 20 మంది పిల్లలు ఉండేవారని, ఒకే టాయ్‌లెట్ ఉండేదని, ఇప్పుడు సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో ఈ కాంప్లెక్సులు వచ్చిన తర్వాత ప్రస్తుతం నడుస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ళను విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఎలా షిఫ్ట్ చేయాలన్నదానిపై సొసైటీలు నిర్ణయం తీసుకుంటాయన్నారు. గరిష్టంగా 650 మంది విద్యార్థులకే పరిమితం చేయాలనుకుంటున్నట్లు తెలిపారు.

దసరా కానుకగా వీటిని బడుగు బలహీనవర్గాల కుటుంబాలకు అందిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఏడు లక్షల కోట్ల రూపాయలను గత ప్రభుత్వం అప్పు చేసినా రెసిడెన్షియల్ స్కూళ్ళలో మాత్రం కనీసం మరుగుదొడ్లను కూడా తగినంత సంఖ్యలో నిర్మించ లేకపోయిందని ఆరోపించారు. అప్పటి వైఫల్యాలను కప్పిపుచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేయడానికే బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని, మూసీ విషయంలోనూ అదే ధోరణి కనిపిస్తోందన్నారు. పేద కుటుంబాలకు ప్రయోజనం కలిగే ఈ అభివృద్ధికైనా సహకారం అందించాలని సూచించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో విద్యారంగం నిర్లక్ష్యానికి గురైందని, అందువల్లనే మౌలిక సదుపాయాల కల్పనకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు ప్రభుత్వం రూ. 1100 కోట్లను మంజూరు చేసిందని అన్నారు. విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసి సంపూర్ణ పరివర్తన దిశగా ప్రయత్నిస్తున్న ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నట్లు వివరించారు. మెస్ ఛార్జీల విషయంలోనూ ప్రభుత్వం సానుకూలంగా ఆలోచిస్తున్నట్లు తెలిపారు.

చీఫ్ సెక్రటరీ శాంతికుమారి మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రభుత్వం నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ డిజైన్‌ను చూసిన తర్వాత తాను అమెరికాలో ఎంబీఏ చదివిన కాలేజీ వాతావరణం గుర్తుకొచ్చిందని, అందుకే ఇవి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో నిర్మాణమవుతున్నాయన్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్‌గా ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకు దాదాపు మూడున్నర దశాబ్దాలుగా వివిధ హోదాల్లో, వేర్వేరు విభాగాల్లో పనిచేశానని, ఇప్పుడు కడుతున్న కాంప్లెక్సులను దేనితోనూ పోల్చలేనంత ముందుచూపుతో ప్లానింగ్ చేసినవన్నారు. అన్ని విభాగాల అధికారులతో కూలంకషంగా చర్చించిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed