నేటి నుంచి ఆంక్షలు.. సాయంత్రం ఐదు గంటలకు వైన్స్ బంద్

by Vinod kumar |   ( Updated:2023-11-28 02:15:49.0  )
నేటి నుంచి ఆంక్షలు.. సాయంత్రం ఐదు గంటలకు వైన్స్ బంద్
X

దిశ, సిటీబ్యూరో : అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మరో కీలక ఘట్టం దాటింది. మంగళవారం సాయంత్రం అయిదు గంటలకు ప్రచారానికి తెరపడనున్నందున, సాయంత్రం అయిదు గంటల తర్వాత సైలెన్స్ పిరియడ్ మొదలుకానుంది. నగరంలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలో ఉన్న మొత్తం 212 అభ్యర్థుల తమ ప్రచార సామాగ్రిని తొలగించే ప్రక్రియను కూడా ప్రారంభించేందుకు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ సిబ్బంది సైతం సిద్దంగా ఉంది. అయిదు గంటల తర్వాత అమలయ్యే సైలెన్స్ పిరియడ్‌లో భాగంగా అయిదు గంటలకు సిటీలోని వైన్స్ షాపులను మూడు రోజుల పాటు 28 సాయంత్రం నుంచి 1వ తేదీ ఉదయం 11 గంటల వరకు మూసివేయనున్నారు. దీనికి తోడు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 1800 సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లోని పోలింగ్ స్టేషన్ల చుట్టూ వంద మీటర్ల రేడియస్‌లో 144 సెక్షన్‌ను అమలు చేయనున్నారు.

ఎలాంటి ప్రచార కార్యక్రమాలను నిర్వహించేది లేదని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా సభలు సమావేశాలు నిర్వహించిన పక్షంలో వారిపై చర్యలు తప్పవని ఇప్పటికే రిటర్నింగ్ ఆఫీసర్లు సూచించినట్లు సమాచారం. 29వ తేదీ ఉదయం 7 గంటల నుంచి రిటర్నింగ్ ఆఫీసర్లు, ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లకు డిస్ట్రిబ్యూషన్ కమ్ రిసెప్షన్ సెంటర్లలో బ్యాలెట్ యూనిట్లు, వీవీ ప్యాడ్‌లు, ఈవీఎంలను పంపిణీ చేయనున్నట్లు జిల్లా ఎన్నికల యంత్రాంగం వెల్లడించింది. మెటీరియల్ తీసుకునేందుకు సెంటర్‌లోకి స్టాఫ్ వచ్చినప్పటి నుంచే ఎలక్షన్ డ్యూటీ మొదలవుతుందన్నారు. 29వ తేదీ నుంచి 30వ తేదీ సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత తిరిగి ఎలక్షన్ మెటీరియల్‌ను డిస్ట్రిబ్యూషన్ కమ్ రిసెప్షన్ సెంటర్‌లో అప్పగించే వరకు, అంటే దాదాపు 36 గంటల వరకు స్టాఫ్ ఎన్నికల విధుల్లోనే నిమగ్నమై ఉంటుందని వెల్లడించారు. దీనికి తోడు ఇదివరకు విధులు నిర్వహించిన మాదిరిగా కాకుండా కేంద్ర వ్యయ, సాధారణ పరిశీలకుల తనిఖీలు మరింత ముమ్మరం కానున్నట్లు సమాచారం. ముఖ్యంగా అభ్యర్థి కదలికలపై రహస్య నిఘా ఉంచినట్లు తెలిసింది.

గ్రూప్ మీటింగ్‌లకు ప్లాన్..

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు మంగళవారం రాత్రి నుంచే రహస్యంగా గ్రూప్ మీటింగ్‌లను నిర్వహిస్తూ, నగదు, మద్యం పంపిణీకి రంగం సిద్దం చేసుకున్నట్లు సమాచారం. ప్రచారం నిర్వహిస్తూనే ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఓటర్లకు నగదు పంపిణీ చేస్తూ దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఇక పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో టెన్షన్‌కు గురవుతున్న ప్రధాన రాజకీయ పార్టీల నేతలు భారీగా డబ్బు పంపిణీకి ప్లాన్ చేసినట్లు సమాచారం. అభ్యర్థులు ప్రలోభాలకు సంబంధించి సీ-విజిల్‌లో ఫిర్యాదు పెడితే ఆగమేఘాలపై స్పాట్‌కు చేరుకుని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల విభాగం అధికారులు స్పష్టం చేశారు.

Read More: నేటితో ఎన్నికల ప్రచారం క్లోజ్.. సాయంత్రం ఐదు గంటల తర్వాత గప్ చుప్!

Advertisement

Next Story

Most Viewed