ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితం తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి

by karthikeya |
ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితం తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ గడ్డపై రాచరికానికి, నియంతృత్వానికి పెత్తందారీ తనానికి వ్యతిరేకంగా అక్షర యోధులు ఒకవైపు, సాయుధ యోధులు మరోవైపు పోరాడి నిరంకుశ రాచరికాన్ని, హైదరాబాద్ రాజును ముట్టడించి తెలంగాణ బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం 1948, సెప్టెంబర్ 17 ఇదే హైదరాబాద్ గడ్డపై ఆవిష్కృతమైందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయితే ఈ పోరాటం ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదని, ఒక జాతి తన స్వేచ్ఛ కోసం ఆత్మ గౌరవం కోసం రాచరిక పోకడలపై చేసిన తిరుగుబాటు అని పేర్కొన్నారు. తెలంగాణ అంటే త్యాగమని, నాటి సాయుధ పోరాటంలో ఎందరో ప్రాణ త్యాగాలు చేశారని, నిస్వార్థంగా తమ జీవితాలను పణంగా పెట్టి సర్వం కోల్పోయినా వెనుకంజ వేయని ఆ మహనీయుల త్యాగాల ఫలితమే తెలంగాణ అని వ్యాఖ్యానించారు. ఆ నాటి అమరవీరులకు ఘన నివాళి అర్పించాలనే ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం ఇకపై ఈ శుభ దినోత్సవాన్ని ప్రజాపాలన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించనుందని పేర్కొన్నారు.

అనంతరం 4కోట్ల మంది తెలంగాణ ప్రజలకు ప్రజాపాలనా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి.. ఇది తెలంగాణలో అత్యంత కీలకమైన రోజని, అయితే దీనిపై అనేకమంది భిన్నాభిప్రాయాలు ప్రకటిస్తున్నారని, కొందరు విలీన దినోత్సవమని, కొందరు విమోచన దినోత్సవమని సంభోదిస్తున్నారని, కానీ ప్రజా ప్రభుత్వమైన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించి సెప్టెంబర్ 17ను ప్రజాపాలనా దినోత్సవంగా జరుపుకోవాలని తమ సర్కార్ నిర్ణయించినట్లు వెల్లడించారు. నిజాం రాచరిక వ్యవస్థను కూలదోసి ప్రజాస్వామ్య ప్రస్థానానికి నాంది పలికిన రోజని, ఇది ప్రజల విజయమని, అలాంటిది ఇందులో రాజకీయాలకు తావు ఉండకూడదని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed