- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైద్య, ఆరోగ్య శాఖకు సర్కార్ ప్రాధాన్యం.. ఏడాది పాలనపై స్పెషల్ రిపోర్ట్
దిశ, తెలంగాణ బ్యూరో: పదేళ్ల పాటు వైద్యారోగ్య శాఖకు పట్టిన గ్రహణాన్ని తొలగించామని ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచే ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించామని పేర్కొన్నది. హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా సలహాలు, సూచనలు, ఆదేశాలతో ఆరోగ్యశాఖలో అద్భుతమైన మార్పులు జరుగుతున్నాయని ప్రభుత్వం గురువారం ఓ ప్రత్యేక ప్రకటనను రిలీజ్ చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా నిధుల కేటాయింపుతో పాటు నియామకాలపైనా దృష్టి సారించామని వివరించింది. అధికారం చేపట్టిన 48 గంటల్లోనే రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితిని రెండింతలు చేశామన్నారు. తొలి ఏడాదిలోనే వైద్యారోగ్య శాఖలో నియామకాలు.. నూతన వైద్య, నర్సింగ్, పారా మెడికల్ కళాశాలల మంజూరు, సీట్లు, బెడ్ల పెంపు లాంటి ఇతర కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డుల జారీ పైలెట్ ప్రాజెక్టును చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఈ కార్డులతో రాష్ట్ర హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని, ఆసుపత్రికి వెళ్లే వారెవరైనా ప్రతి సారి పాత రికార్డులు పట్టుకొని వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయాలని ముఖ్యమంత్రి, హెల్త్ మినిస్టర్ సరికొత్త ఆలోచనలతో ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం తయారు చేసిన రిపోర్టును ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేలా రాష్ట్ర వ్యాప్తంగా పుల్ పబ్లిసిటీ చేయనున్నారు.
వైద్య, ఆరోగ్య శాఖ స్పెషల్ రిపోర్టు ఇలా..Sarkar Pradhanyaam for medical and health department.. Special report on the governance of the year
ఆరోగ్య శ్రీ..
రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద 2014 నుంచి 2023 అక్టోబర్ వరకూ గత ప్రభుత్వం నెలకు సగటున రూ.52 కోట్లు ఖర్చు చేస్తే, 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ వరకూ నెలకు సగటున రూ.76 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. 11 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ఆరోగ్యశ్రీ చికిత్సల ధరల పెంపు సమస్యను 6 నెలల్లో పరిష్కరించింది. ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చే 1,375 వైద్య చికిత్సల ధరలను సుమారు 20 శాతం వరకూ పెంచింది. కొత్తగా 163 రకాల చికిత్సలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో మొత్తం ఆరోగ్యశ్రీ చికిత్సల సంఖ్య 1835కి పెరిగింది. న్యూక్లియర్ మెడిసిన్, ఇంటర్‌వెన్షనల్ రేడియాలజి వంటి ఖరీదైన వైద్య సేవలను సైతం ఆరోగ్యశ్రీ పేషెంట్లకు అందుబాటులోకి తెచ్చింది. పెరిగిన ధరలు, కొత్తగా అందుబాటులోకి వచ్చిన చికిత్సల కోసం అదనంగా రూ.487.29 కోట్లను ఆరోగ్యశ్రీ కోసం కేటాయించింది.
ఉద్యోగాలు..
ఇక ప్రభుత్వ దవాఖానాల్లో ఖాళీలను భర్తీ చేయకుండా గత ప్రభుత్వం నేరపూరిత నిర్లక్ష్యం చేసింది. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన అనతికాలంలోనే ఆరోగ్యశాఖలో 7,750 పోస్టులను భర్తీ చేసింది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ద్వారా మరో 6,494 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. మరో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, 1,690 సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) పోస్టులు, 308 ఫార్మసిస్ట్ (ఆయుష్) పోస్టుల భర్తీకి త్వరలోనే ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ నోటిఫికేషన్లు ఇవ్వనున్నది. జూనియర్ డాక్టర్లకు సంబంధించిన స్టైఫండ్ చెల్లింపులు, పెండింగ్ లో ఉన్న సమస్యలన్నింటికీ ప్రజా ప్రభుత్వం పరిష్కరించింది.
కొత్త కాలేజీలు..
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల కాలంలోనే 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అతి తక్కువ కాలంలోనే ములుగు, గద్వాల్, నర్సంపేట, నారాయణపేట, మెదక్, కుత్బుల్లాపూర్, మహేశ్వరం, యాదాద్రిలో కాలేజీలు, హాస్పిటళ్లను ఏర్పాటు చేసింది. జాతీయ వైద్య కమిషన్‌ను, కేంద్ర ఆరోగ్యశాఖను ఒప్పించి మెప్పించి కాలేజీలకు అనుమతులు తీసుకొచ్చింది. ఒక్కో కాలేజీలో 50 సీట్ల చొప్పున, మొత్తం 400 ఎంబీబీఎస్ సీట్లు రాష్ట్ర విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ 400 సీట్లతో కలిపి రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 3,690 నుంచి 4,090కి పెరిగింది. వికారాబాద్ జిల్లాలోని కొడంగల్‌లో 50 ఎంబీబీఎస్ సీట్లతో మెడికల్ కాలేజీ, 50 సీట్ల కెపాసిటీతో ఫిజియోథెరపీ కాలేజీ, 30 సీట్ల కెపాసిటీతో పారామెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. 2025–26లో ఈ కాలేజీల్లో విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చేందుకు, ఆరోగ్యశాఖ అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
కొడంగల్‌లో 50 బెడ్ల హాస్పిటల్‌ను, 220 బెడ్ల హాస్పిటల్‌గా అప్‌గ్రేడ్ చేసింది. ఈ హాస్పిటల్‌లో స్పెషాలిటీ వైద్య సేవలు వికారాబాద్ జిల్లా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. మంచిర్యాలలో 600 బెడ్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను మంజూరు చేశారు. ఇటీవలే మంత్రులు ఆ హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థుల కోసం కొత్త హాస్టల్ బిల్డింగ్స్ ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ భవనాల నిర్మాణం కోసం రూ.204.85 కోట్లను కేటాయించారు. ఏడాది కాలంలోనే 16 నర్సింగ్ కాలేజీలను, 28 పారామెడికల్ కాలేజీలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.ఒక్కో నర్సింగ్ కాలేజీలో 60 బీఎస్సీ సీట్ల చొప్పున మొత్తం 960 సీట్లు ఈ అకడమిక్ ఇయర్ నుంచే విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. ఒక్కో పారామెడికల్ కాలేజీలో 60 సీట్ల చొప్పున, 28 కాలేజీల్లో ఏడాదికి 1,680 మంది విద్యార్థులు పారామెడికల్ కోర్సులను అభ్యసించబోతున్నారు.
కొత్త ఉస్మానియా ఆసుపత్రి..
రూ.2 వేల కోట్లతో ఉస్మానియా నూతన ఆసుపత్రికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గోషామహల్‌లో సుమారు 32 ఎకరాల విస్తీర్ణంలో కొత్త ఉస్మానియా దవాఖాన నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూతన ఆసుపత్రి కోసం పోలీస్ శాఖ నుంచి ఆరోగ్యశాఖకు భూ బదలాయింపు ప్రక్రియ పూర్తయింది. అత్యాధునిక వసతులు, ఆపరేషన్ థియేటర్లతో పాటు కొత్త ఆసుపత్రిలో 28 వైద్య విభాగాల సేవలు అందనున్నాయి.
డయాలసిస్ సెంటర్లు..
రాష్ట్రంలో పేషెంట్ల సంఖ్యకు అనుగణంగా డయాలసిస్ సెంటర్లు లేవని గతంలో అధికార పార్టీ శాసన సభ్యులే సభలో కన్నీళ్లు పెట్టుకున్న ఘటనలున్నాయి. అందుకే ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా 16 డయాలసిస్ సెంటర్లను మంజూరు చేసింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న 20 డయాలసిస్ సెంటర్లలో అదనంగా 89 డయాలసిస్ మిషన్లను పేషెంట్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. డయాలసిస్ పేషెంట్లకు అవసరమైన సర్జరీలు చేయడానికి, సుమారు రూ.33 కోట్లతో వాస్క్యులర్ సెంటర్లను ప్రభుత్వం మంజూరు చేసింది. హైదరాబాద్‌లోని నిమ్స్, గాంధీ, ఉస్మానియా, వరంగల్‌లోని ఎంజీఎం, ఖమ్మం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, మహబూబ్‌నగర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్‌లో వాస్క్యులర్ సెంటర్ల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది.
మాతృత్వానికి అండగా... ఉచితంగా ఐవీఎఫ్
ఇన్‌ఫర్టిలిటీ సమస్య పేద, మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారింది. మాతృత్వం కోసం పరితపిస్తున్న దంపతులకు ప్రజా ప్రభుత్వం అండగా నిలిచింది. రూ.లక్షల ఖరీదైన ఐవీఎఫ్ సేవలను ఉచితంగా అందజేయాలని నిర్ణయించింది. గాంధీ హాస్పిటల్‌లో ఐవీఎఫ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. పేట్లబుర్జు దవాఖాన, సుల్తాన్‌బజార్ మెటర్నిటీ హాస్పిటల్, వరంగల్ ఎంజీఎంలోనూ ఐవీఎఫ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
అత్యవసర సేవలకు ప్రాధాన్యత..
రోడ్డు ప్రమాదాల్లో, ఇతర ఎమర్జెన్సీ సమయంలో బాధితుల ప్రాణాలు కాపాడేలా రాష్ట్ర, జాతీయ రహదారులపై ప్రతి 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున 74 ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు రూ.వెయ్యి కోట్లతో రెండేళ్లలో ట్రామా కేర్ సెంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. జీవన్‌దాన్ వ్యవస్థను ప్రక్షాళించి, పారదర్శకంగా తయారు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అన్ని ప్రభుత్వ టీచింగ్ హాస్పిటళ్లలో ఆర్గాన్ రిట్రైవల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
గాంధీ, ఉస్మానియా, ఎంజీఎంలో ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సెంటర్లను ఏర్పాటు చేసి, ఆ తర్వాత దశలవారీగా అన్ని టీచింగ్ హాస్పిటళ్లలో ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సేవలను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆరోగ్యశ్రీ కింద ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలను ఉచితంగా చేయిస్తోంది. ప్రభుత్వ దవాఖాన్లలో ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు జరిగేలా చర్యలు తీసుకుంది. అంతేగాక ఇంతకు ముందు సేవలు అందని మండలాల్లో సేవలు అందించేందుకు గానూ రూ.30 కోట్లతో 222 నూతన అంబులెన్స్ లను సర్కార్ అందించనుంది. 136 నూతన 108 అంబులెన్స్ లలో గిరిజన ప్రాంతాలకు 45కు కేటాయించనున్నారు. మిగతావి సేవలు అందని మండలాలు, జాతీయ, రాష్ట్ర రహదారుల ప్రాంతాలకు కేటాయించారు.