తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్దం.. అనూహ్య రీతిలో వారికి మంత్రి పదవులు!

by Prasad Jukanti |
తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్దం.. అనూహ్య రీతిలో వారికి మంత్రి పదవులు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. లోక్ సభ ఎన్నికలు ముగిసిపోవడం అధిష్టానం సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పూర్తి స్థాయి కేబినెట్ కూర్పుపై పీసీసీ ఫోకస్ పెట్టినట్లు కాంగ్రెస్ లో ప్రచారం జరుగుతోంది. అన్ని సజావుగా జరిగితే అతి త్వరలోనే విస్తరణ ఉండబోతున్నదనే టాక్ వినిపిస్తోంది. మంత్రి పదవులు దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రయత్నాలు కొనసాగిస్తుండగా అధిష్టానం మాత్రం వారి పనితీరును బట్టే పదవులు ఇచ్చేందుకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు లోక్ సభ ఎన్నికల ఫలితాలపై త్రీ మెన్ కమిటీ అధ్యయనం చేసి ఆ కమిటీ నివేదిక ప్రకారం ఆశావహుల భవిష్యత్ తేల్చబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ లోకి బీఆర్ఎస్ నుంచి వలసలు మొదలు కావడం సంచలన పరిణామంగా మారింది. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో మరికొంత మంది ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. దీంతో మంత్రివర్గంలో చోటు దక్కెదెవరికి నిరాశ మిగిలేదెవరికి అనేది ఆసక్తిగా మారుతున్నది.

ఆపరేషన్ ఆకర్ష్ తో అటెన్షన్:

అధికార పక్షం కాంగ్రెస్ లో చేరికల పర్వం ఇప్పటి వరకు ఓ లెక్క ఇకపై మరోలెక్క అన్నట్లుగా సాగబోతున్నదనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఇన్నాళ్లు కేసీఆర్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్న నేతలు ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి హస్తం గూటికి చేరుతున్నారు. ఇప్పపటికే రాజ్యసభ సభ్యుడు కేకే, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తాజాగా పోచారం శ్రీనివాస్ రెడ్డి హస్తం గూటికి చేరారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉండబోతున్న కారణంతో మరి కొంత మంది ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే టాక్ సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. మరో వైపు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, బాలు నాయక్, షబ్బీర్ అలీ, మల్ రెడ్డి రంగారెడ్డి, దానం నాగేందర్, ప్రేమ్ సాగర్ రావు పేర్లు మంత్రి వర్గం రేస్ వినిపిస్తున్నాయి. దీంతో ఇతర పార్టీల నుంచి వచ్చే వారిలో కేబినెట్ లోకి ఎంట్రీ దక్కెదెవరికి అనేది సస్పెన్స్ గా మారింది. మరోవైపు తాజాగా కాంగ్రెస్ లోకి మొదలైన చేరికల పర్వంతో సొంత పార్టీలోని ఆశావహులతో పాటు రాజకీయ వర్గాలను అటెన్షన్ గా మారుస్తోంది.

ఆ జిల్లాల్లో చోటు ఎవరికి?:

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంలో సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు 11 మందికి మాత్రమే మంత్రివర్గంలో చోటు కల్పించారు. మరో ఆరుగురికి మంత్రి పదవులు ఇచ్చేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు వేచి చూసే ధోరణలోనే ముందుకు వెళుతున్నారు. ప్రస్తుతం రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా నేతలకు కేబినెట్ లో ప్రాతినిధ్యం లేదు. ఈ క్రమంలో ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో దానం నాగేందర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి అనూహ్యంగా కాంగ్రెస్ లో చేరికతో వీరికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందా లేదా అనేది చర్చనీయాంశం అవుతోంది. అయితే చేరికల అంశం ఇలా ఉంటే మంత్రివర్గ కూర్పులో సామాజిక సమీకరణాలు మరో ఫ్యాక్టర్ గా మారబోతున్నది.కాంగ్రెస్ పార్టీలో మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఎవరూ లేకలపోవడంతో మంత్రి వర్గంలో ఆ వర్గానికి ప్రతినిధిగా ఎవరిని పిక్ చేయబోతున్నారనేది కూడా చర్చనీయాంశం అవుతున్నది.

Advertisement

Next Story

Most Viewed