ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పూర్తయ్యేది ఎన్నడు ?

by Sumithra |
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పూర్తయ్యేది ఎన్నడు ?
X

దిశ, ఆమనగల్లు : ఆమనగల్లు పట్టణంలోని మార్కెట్ యార్డులో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవన నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. దీంతో పట్టణ కేంద్రంలో కూరగాయలు, మాంసం, చేపల విక్రయానికి నిర్దిష్ట స్థలాలు లేక రోడ్ల పైన విక్రయిస్తున్నారు. దశాబ్దాల కాలంగా విక్రయదారులు కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

2021లో శంకుస్థాపన..

ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి రూ 4.50 కోట్లు 2021లో బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసింది. స్థానిక మార్కెట్ యార్డ్ ఆవరణలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు స్థలం కేటాయించి, 2021 నవంబర్ 8న శంకుస్థాపన చేశారు. స్థానికుల ఒత్తిడి మేరకు పనులు ప్రారంభించి స్లాబ్ వరకు నిర్మాణం చేపట్టారు. నిధుల విడుదల కాకపోవడంతో కాంట్రాక్టర్ ఈ ఏడాది ప్రారంభంలో పనులు నిలిపివేశారు. నిధులు విడుదలయితే గాని పనులు ప్రారంభించేలా కనిపించడం లేదు.

ఇబ్బందుల్లో వ్యాపారులు నాలుగు మండలాలకు కూడలిగా ఉన్న ఆమనగల్లు పట్టణంలో కూరగాయలు, చేపలు, మాంసం విక్రయాలకు నిర్దిష్ట స్థలాలు లేవు. దీంతో వందలాది వ్యాపారుల కుటుంబాలు రోడ్లపైనే వ్యాపారాన్ని కొనసాగిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. నిర్దిష్ట స్థలం లేక గాంధీ చౌక్ నుంచి పోలీస్ స్టేషన్, హనుమాన్ దేవాలయం, రచ్చకట్ట, అంగడి బజార్ వరకు సీసీ రోడ్డుకు ఇరువైపులా కూరగాయల విక్రయాలు సాగిస్తున్నారు. దీంతో కొనుగోలుదారులతో రద్దీ అధికంగా ఏర్పడి పలు కాలనీలకు వెళ్లే ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.

రోడ్లపైనే నాన్ వెజ్ విక్రయాలు : మాడుగుల వైపు రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న చిరు వ్యాపారుల డబ్బాలు తొలగించడంతో మాంసం అమ్మకం దారులు రోడ్డుపైనే విక్రయాలు కొనసాగిస్తున్నారు. దుమ్ము ధూళితో అక్కడ వాతావరణం అపరిశుభ్రంగా మారుతుంటుంది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పూర్తయితే వ్యాపారాలకు సౌకర్యంతో పాటు ప్రజలకు నాణ్యమైన మాంసం కూడా అందుతుందని మాంసం కొనుగోలుదారులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story