పోలీసుల చూపు కబ్జాల వైపు?

by Mahesh |
పోలీసుల చూపు కబ్జాల వైపు?
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: ఆపద వస్తే, అన్యాయం జరిగితే మొదటగా గుర్తుకు వచ్చేది పోలీసు. ఆ పోలీసులను సంప్రదిస్తే ప్రతి బాధితుడికి భరోసాగా ఉండేది. నేడు ఏదైనా సమస్యపై పోలీసులను సంప్రదించాలంటేనే ప్రజలు జంకుతున్నారు. కొన్ని చోట్ల పోలీసులే బినామీలను పెట్టుకొని భూ లావాదేవీల్లో జోక్యం చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. మాట వింటే కేసులు ఉండదు.. లేకపోతే బెదిరింపులు, తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అంతేకాకుండా స్థానికంగా పలుకుబడి ఉన్న నాయకులు ఉంటే వారికి అనుకూలంగా వ్యవహరించి నిజమైన బాధితులకు చుక్కలు చూపిస్తున్న ఘటనలున్నాయి.

ఏ స్థాయి అధికారి ఆ స్థాయిలో పరపతిని ఉపయోగించుకుంటున్నారు. ప్రధానంగా హయత్​నగర్, బాలాపూర్, అబ్దుల్లాపూర్​మెట్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కందుకూర్, ఆదిబట్ల, షాద్‌నగర్, కొత్తూర్, నందిగామ, రాజేంద్రనగర్, శంషాబాద్​పోలీస్​స్టేషన్ పరిధిలో లీగల్​కేసులు డీల్​చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్లాట్ల విషయంలో సబ్​–రిజిస్ట్రార్, అగ్రికల్చర్​భూముల విషయంలో తహశీల్లార్లతో పనులు కంప్లీట్ చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అసైన్డ్ ల్యాండ్‌పై కన్నేసి రైతులను బెదిరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం నర్సప్పగూడ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్​ 474/4ల/ఎ/82లో 2 ఎకరాలు, 473/12/2లో 30 గుంటల భూమిని తన తల్లి ఎర్ర నర్సమ్మకు 50 ఏండ్ల క్రితం ప్రభుత్వం అసైన్డ్​ చేసిందని ఎర్ర శ్రీశైలం చెబుతున్నారు. అయితే ఈ పొలంలో తాము ప్లాట్లు కొనుగోలు చేశామని దౌర్జన్యంగా అసైన్డ్ స్థలాన్ని కబ్జా చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి కబ్జా చేసే వాళ్ళు కొన్న ప్లాట్లు 471, 472 సర్వే నెంబర్లల్లో పట్టా భూమిలో కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. పట్టా భూమిలో కొనుగోలు చేసిన స్థలంలో కబ్జా ఉండి.. పక్కనే ఉన్న అసైన్డ్ భూమి పై కన్నేసి కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నాడు.

ఈ విషయాన్ని సంబంధిత తహశీల్దార్, ఆర్డీవోలతో పాటు పోలీసులకు గత నెల 28న ఫిర్యాదు చేశానన్నారు. షాద్​నగర్ ఆర్డీవో‌ను కలిసినప్పుడు పట్టా పొలంలోనే ఉన్నారంటా.. అసైన్డ్​ ల్యాండ్‌లోకి రాలేదనే సమాధానంతో తప్పించుకుంటున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ఆ రైతు బాధను ఏ రెవెన్యూ అధికారి పట్టించుకోకపోవడంతో జిల్లా కలెక్టర్​ కార్యాలయంలోని ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నందుకు షాద్​నగర్ ఏసీపీ కుశల్కర్, స్థానిక ఇన్ స్పెక్టర్ రామయ్య బెదిరించారని పేర్కొన్నాడు.

ఆ భూమి డీఎస్పీ బంధువు, డీఆర్‌డీవో అధికారికి చెందినది అంటూ స్థానిక పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఫారుక్‌నగర్ మండలం వెలిజర్ల గ్రామ పరిధిలోని 33/27 సర్వే నెంబర్‌లో 6 ఎకరాల 28 గుంటల భూమిని ఓ డీఎస్పీ స్థాయి అధికారి కబ్జా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే సర్వే నెంబర్ పక్కన ఆ డీఎస్పీ కొనుగోలు చేసిన భూమి వేరు.. కబ్జా చేసిన భూమి వేరు అని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలోని తోర్రుర్​ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్​ 386,417లో ప్లాట్​ నెంబర్​ 46 డబుల్​ రిజిస్ట్రేషన్ కలిగి ఉంది. ఈ ప్లాట్​ వివాదంలో ఉన్న, పోలీసు కేసు నమోదైనప్పుడు సబ్ రిజిస్ట్రార్ లాగిన్‌లో బ్లాక్ చేయాలి. లేకపోతే తప్పుడు డాక్యుమెంట్ కలిగిన వారిది క్యాన్సిల్ చేయాలి. కానీ రెండవ డాక్యుమెంట్‌ను 2006 డిసెంబర్‌లో చేసుకున్న వ్యక్తి.. అప్పటి నుంచి మౌనంగా ఉండి 2016వ సంవత్సరంలో సబ్ రిజిస్ట్రార్ సహాయంతో మొదటి డాక్యుమెంట్ తప్పు అని హయత్ నగర్ పీఎస్ పరిధిలో కేసు నమోదు చేయించారు.

మొదటి డాక్యుమెంట్​ తప్పని చెప్పిన సబ్​రిజిస్ట్రార్ ఎందుకు ఆ డ్యాకుమెంట్ నెంబర్ బ్లాక్‌లో పెట్టించలేకపోయారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు కూడా 2017లో చార్జ్​షీట్ వేశారు. అందులో మొదటి డాక్యుమెంట్ కలిగిన మధుసూదన్ రాజు స్టేట్‌మెంట్ కూడా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఆ మధుసూదన్​రాజుకు సంబంధించిన ఆధారాలు తెలుసుకొని పాస్‌ఫొటో, సంతకాలు పరిశీలిస్తే దొంగ డాక్యుమెంట్ ఎవరిదో తెలిసిపోతుంది కదా అనే అనుమానం వ్యక్తం అవుతుంది. కానీ రెండవ డాక్యుమెంట్ కలిగిన వ్యక్తి పోలీసు డిపార్ట్​మెంట్‌కు సంబంధించిన వారు కావడంతోనే ఇలాంటి తప్పుడు కేసులు నమోదు చేస్తున్నట్లు బాధితులు ఆరోపణలు చేస్తున్నారు.

ఈ విధంగా పోలీసు విభాగానికి చెందిన కొంత మంది వ్యక్తులు అధికార బలాన్ని వినియోగించుకొని ఎక్కడిక్కడ అవకాశమున్న చోట కబ్జాలు చేసుకుంటున్నారు. అడిగే నాథుడే లేకపోవడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ నేతలకు వంత పాడినందుకేనా ఈ నజరానాలనే అనుమానాలు వస్తున్నాయి. లేకపోతే ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు తప్పులు చేస్తే మేమెందుకు చేయొద్దనే భ్రమలో పోలీసులున్నారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. జిల్లాలో జరిగే అక్రమార్కుల దృష్టిలో తమదైన ముద్ర వేసుకోవాల్సిన విభాగమే అక్రమార్కులుగా మారిపోయారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Next Story