కబ్జా కోరల్లో తమ్మిడికుంట.. చెరువు శిఖంలోనే ఎన్‌కన్వెన్షన్

by Nagam Mallesh |
కబ్జా కోరల్లో తమ్మిడికుంట.. చెరువు శిఖంలోనే ఎన్‌కన్వెన్షన్
X

దిశ, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో చెరువుల కబ్జా అస్సలు ఆగట్లేదు. కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని చదును చేసేసి దర్జాగా కబ్జా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అటు ఇరిగేషన్, ఇటు రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారుల్లో స్పందన కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. న్యాయస్థానాల ఆదేశాలను సైతం అధికారులు బేఖాతరు చేస్తున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ఎఫ్టీఎల్‌లు, బఫర్ జోన్‌లలో ఉన్న నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్నా..చాలా చెరువులు ఆక్రమణకు గురవుతూనే ఉన్నాయి. అందులో తమ్మిడికుంట ఒకటి. ఈ చెరువు ఇప్పుడు కబ్జా కోరల్లో చిక్కి కుంచించుకు పోయింది.

తమ్మిడి కుంట ఆక్రమణ..

మాదాపూర్ డివిజన్ ఖానామెట్ సర్వే నంబర్ 36లో తమ్మిడికుంట చెరువు 29 ఎకరాల 24 గుంటల్లో విస్తరించి ఉంది. ఒకప్పుడు మంచినీటి సరస్సుగా ఉన్న ఈ చెరువు గత కొన్నేళ్లుగా క్రమంగా ఆక్రమణకు గురవుతోంది. ఇప్పుడు ఈ చెరువు చుట్టూ కబ్జాదారులు రాబంధుల్లా వాలారు. ఓ పక్కా ఎన్‌కన్వెన్షన్, మరో పక్క పలువురు లీడర్లు, కబ్జాదారులు ఈ చెరువును చెరబట్టారు. సినీ హీరో నాగార్జునదిగా చెబుతున్న ఎన్‌కన్వెన్షన్ ఈ చెరువును ఆనుకునే ఉంది. అయితే ఈ ఎన్‌కన్వెన్షన్ చాలా వరకు తమ్మిడికుంట చెరువులోనే ఉందంటూ గతంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ప్రజా ప్రతినిధులు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా అయినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.

దర్జాగా కబ్జా..

తమ్మిడికుంట చెరువు చుట్టూ కబ్జాలు చాలాకాలంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ చెరువు దాదాపు 10 ఎకరాలకు పైగా కుంచించుకుపోయింది. అందులో ఎన్ కన్వెన్షన్ నిర్వాహకులు దాదాపు 3 ఎకరాలకు పైగా కబ్జాలకు పాల్పడినట్లు సీపీఐ నాయకులు కే.చందూయాదవ్ ఆరోపించారు. ఎన్ కన్వెన్షన్ ఆక్రమణలపై జనంకోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. గతంలో ఎన్ కన్వెన్షన్ ఆక్రమణలకు సంబంధించి జనంకోసం 2012లో లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంబంధిత అధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఎన్ కన్వెన్షన్‌కు తోడు శిల్పారామంకు ఎదురుగా ఆ వైపు నుంచి కూడా జోరుగా కబ్జాలు సాగుతున్నాయి. చుట్టుపక్కల సాగుతున్న నిర్మాణ వ్యర్థాలను తీసుకువచ్చి ఈ చెరువులో పోస్తూ కబ్జాలకు పాల్పడుతున్నారు. చెరువుల కబ్జాల నేపథ్యంలో ఇరిగేషన్ డీఈ పై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నా ఏమాత్రం స్పందించడం లేదని, ఇవన్నీ వారి కనుసన్నల్లోనే జరుగుతుందేమో అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి.

రికార్డుల్లో ఇలా..

తమ్మిడికుంట చెరువును ఇరిగేషన్ అధికారులు 24.08.2013 లో సర్వే చేశారు. దీని పూర్తి విస్తీర్ణం 29.24 ఎకరాలుగా ఉన్నట్లు నిర్ధారించారు. అప్పటికి 29.06 ఎకరాల్లో నీరు ఉందని అధికారులు పేర్కొన్నారు. తమ్మిడి కుంటకు 3717 లేక్ ఐడీ కేటాయించారు. ఆ తర్వాతి కాలంలో ఈ చెరువు క్రమంగా కుంచించుకుపోతూనే ఉంది. ఎన్ కన్వెన్షన్ పేరుతో సినీ హీరో నాగార్జున తమ్మిడికుంటను పెద్ద ఎత్తున ఆక్రమించారని ఆరోపణలు రాగా..గత ప్రభుత్వ పెద్దలను కలిసి మేనేజ్ చేసుకున్నారని, ఇప్పుటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎన్ కన్వెన్షన్ పై దృష్టిసారించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ చెరువు బఫర్ జోన్‌లో చేపడుతున్న నిర్మాణాలపై కూడా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

ఎన్ కన్వెన్షన్ పై చర్యలు తీసుకోవాలి..

తమ్మిడికుంట చెరువును ఆక్రమించి నిర్మించిన ఎన్ కన్వెన్షన్‌ను తొలగించి చెరువును పరిరక్షించాలి. నగరంలో పెద్ద ఎత్తున చెరువులు కబ్జాలకు గురవుతున్నాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ చిన్నచిన్న వారిపై కాకుండా ఇలాంటి బడా నిర్మాణాలపై, బడాబాబులపై చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఈ ప్రభుత్వంపై, హైడ్రాపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది.

- కే.చందూయాదవ్, సీపీఐ నాయకుడు

Advertisement

Next Story