ఆ కార్యాలయంలో మహిళలకు ఆత్మగౌరవం ఏది..

by Sumithra |
ఆ కార్యాలయంలో మహిళలకు ఆత్మగౌరవం ఏది..
X

దిశ, తలకొండపల్లి : రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండల కేంద్రంలో మండల మహిళా సమైక్య కార్యాలయాన్ని గత దశాబ్ద కాలం క్రితం కాంట్రాక్టర్లు నిర్మించి, కార్యాలయం చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టకుండా చేతులు దులుపుకున్నారు. కనీసవసతుల కింద మూత్రశాలలను ఏర్పాటు చేయడంలో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహించి వదిలివేశారు. ఈ కార్యాలయంలో ప్రతినిత్యం సుమారు పదిమంది వరకు అధికారులు విధులకు హాజరవుతుంటారు. ఆ కార్యాలయంలో పేరుకు మాత్రమే ఒక్క మూత్రశాల ఉంది. ఆ మూత్రశాలని కూడా అధికారులే వాడుకుంటారు.

కార్యాలయం వద్ద సరిపడా నీళ్లు కూడా లేకపోవడంతో అధికారులు అనుభవించే నరకయాతన అంతా ఇంతా కాదు. ఇక ప్రతి నెలలో సుమారు 4 నుండి 5 సార్లు నిర్వహించే సమావేశాలకు మండలంలోని ఆయా గ్రామాల నుండి 33 మంది వివోలు, మరో 33 మంది ఈసీ మెంబర్స్ మహిళలు మీటింగ్ కు కంపల్సరిగా వచ్చి తీరవాల్సిందే. మండల మహిళా సమైక్య కార్యాలయంలో సమావేశం ఉందంటేనే ఆయా గ్రామాల్లోని పొదుపు సంఘాల మహిళలందరికీ దడ మొదలవుతుంది. ఉదయం ఇంటి నుండి బయలుదేరిన మహిళలు అక్కడికి చేరుకున్న తర్వాత కార్యాలయంలో కనీస వసతులైన మరుగుదొడ్లు, మూత్రశాలలు లేకపోవడంతో ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి పక్కనున్న చెట్ల పొదల్లోకి, పంట పొలాల్లోకి వెళ్లి మలవిసర్జన చేయవలసిన పరిస్థితి దాపురించడం సిగ్గుసిగ్గుగా ఉందంటున్నారు.

భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు సిద్ధించిన రాజకీయ నాయకులు మాత్రం మహిళల కోసం అది చేస్తున్నాం, ఇది చేస్తున్నామని గొప్పలు చెప్పుకోవడమే తప్ప గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలలో మహిళల కోసం కనీస వసతులు కల్పించకపోవడం శోచనీయం. మండల కేంద్రానికి సుమారు అర కిలోమీటర్ దూరంలో ఈ కార్యాలయం ఉండడంతో, చుట్టుపక్కన ఆవాస గృహాలు కూడా ఉండకపోవడంతో తెలిసిన వారి ఇళ్లయినా ఉంటే వారి ఇళ్లల్లోకి వెళ్లి వచ్చే వెసులు బాటు మహిళలకు ఉండేది.

మండలంలోని పొదుపు సంఘాలకు కోట్లాది రూపాయల రుణాలు ఇచ్చే మండల స్థాయి కార్యాలయంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఎలా అని మహిళలు మండిపడుతున్నారు. మండలంలోని సుమారు 925 గ్రూపులలో 10500 మంది పైచిలుకు మహిళలు వివిధ పొదుపు సంఘాల్లో కొనసాగుతున్నారు. జిల్లా స్థాయి అధికారులు, నాయకులు వచ్చినప్పుడు ఈ మహిళా పొదుపు సంఘాలకు కూడా అప్పుడప్పుడు మండల కేంద్రంలో పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహిస్తుంటారు, ఆరోజు ఆ మహిళలకు పగటి చుక్కలు కనిపించడం ఖాయం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, డీఆర్డీఏ పీడీ, శ్రీనిధి అధికారులు వెంటనే చొరవ తీసుకొని మహిళల కోసం మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story