భగీరథ నీళ్లు తాగేదెలా?

by Mahesh |
భగీరథ నీళ్లు తాగేదెలా?
X

దిశ, తలకొండపల్లి : గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ స్వచ్ఛ తాగునీరు అందించాలనే దృఢసంకల్పంతో సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టారు. అయితే క్షేత్రస్థాయిలో ఈ పథకం ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వడం లేదు. దీంతో చాలీచాలని నీళ్లతో మహిళలకు ప్రతినిత్యం అవస్థలు పడుతున్నారు. ఓహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంకులకు పూర్తిస్థాయిలో నీరు అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫలితంగా తలకొండపల్లి మండలంలో మిషన్ భగీరథ నీటి సరఫరా అరకొరగా సాగుతోంది.

82 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల ద్వారా భగీరథ నీటి సరఫరా

మండలంలో మొత్తం 66 గ్రామాలు, గిరిజన తండాలు, ఆమ్లెట్ గ్రామలతో కలిపి 32 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో సుమారు 50 వేల జనాభాకు 13963 ఆవాసాలకు నల్ల కనెక్షన్లు ఉన్నట్లుగా అధికారులు ధ్రువీకరించారు. అయితే కొన్ని గ్రామాలకు మిషన్ భగీరథ నీరు సక్రమంగా అందకపోవడంతో తాము ఏమి పాపం చేశామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమనగల్ మండలంలోని కర్కల్పాడు గేట్ సమీపంలో మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించారు. అక్కడి నుంచి ఆమనగల్లు, కడ్తాల్, మాడుగుల ,తలకొండపల్లి మండలాలకు నిత్యం నీటిని సరఫరా చేస్తున్నారు.

అయితే తలకొండపల్లి మండలంలోని 40 గ్రామాలకు మాత్రమే తాగునీరు పూర్తిస్థాయిలో అందిస్తూ, మిగతా గ్రామాలకు చాలీచాలని నీరు అందుతుందని ఆయా గ్రామాల సర్పంచులు తెలిపారు. దీనిపై మండల సర్వసభ్య సమావేశాలలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు విన్నవించారు. అయినా సమస్య పరిష్కారరం కాకపోవడంతో చేసేది ఏమీ లేక అందుబాటులో ఉండే బోరు, ఉప్పు నీటిని ట్యాంకుల్లో కలుపుతూ రెండు నీళ్లను సరఫరా చేస్తున్నారు.

వాటర్ ఫిల్టర్స్ వద్దకు క్యూ..

మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా రాకపోవడంతో ఆయా పల్లెల్లోని ప్రజలు వాటర్ ఫిల్టర్స్ వద్దకు క్యూ కడుతున్నారు. ఇదే అదునుగా భావించిన వాటర్ ఫిల్టర్స్ యజమానులు 20 లీటర్ల క్యాన్‌కు రూ. 10 నుంచి రూ.15 వసూలు చేస్తున్నారు. నిజంగా అవి ఏ మేరకు ఫిల్టర్ చేస్తున్నారు.. వాటర్‌లో ఫ్లోరిన్ ఎంత పర్సంటేజీ ఉంది అనే విషయం కూడా గుర్తించే అధికారులు కనిపించడం లేదు. వాటిపై తనిఖీలు చేసే అధికారులే కరువయ్యారు. ఫలితంగా ప్రతి గ్రామంలో వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి.

అనారోగ్యాల బారిన ప్రజలు

మండలంలోని అంతారం, చంద్రధన,రంగరావుపల్లి, హర్యానాయక్ తండా, సూర్య నాయక్ తండా, మాదాయపల్లి, మెదక్ పల్లి, తుమ్మల కుంట తండా, వీరన్న పల్లి, వెంకటాపూర్ గ్రామాలతో పాటు మరికొన్ని తండాలు, గ్రామాలకు కూడా చాలీచాలని మిషన్ భగీరథ నీరు అందుతుందని ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బోరు, భగీరథ నీరును మిక్స్‌ చేసి ట్యాంకుల ద్వారా ట్యాప్ లోకి వదలడంతో ఆ నీరు తాగిన చాలామంది వృద్ధులు, మహిళలు, చిన్నారులు అనారోగ్యాల బారిన పడుతున్నారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే అన్ని గ్రామాలకు సరిపడ నీరు సరఫరా చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. కాగా, మిషన్ భగీరథ గ్రిడ్ డీఈ సందీప్‌ను ‘దిశ’ వివరణ కోరగా మండలంలో కొన్ని గ్రామాలకు మాత్రమే నీరు సరిపడా సరఫరా కావడం లేదన్నారు. లోపం వెంటనే సరి చేస్తామని వివరణ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed