పెద్ద తుప్పరలో ఉద్రిక్తత.. సర్పంచ్ తో పాటు మరో ఎనిమిది మంది అరెస్ట్..

by Sumithra |
పెద్ద తుప్పరలో ఉద్రిక్తత.. సర్పంచ్ తో పాటు మరో ఎనిమిది మంది అరెస్ట్..
X

దిశ, శంషాబాద్ : పట్టా భూమిలో ప్రహరీ నిర్మాణం చేస్తుండగా సర్పంచ్ అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్న ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద తుప్పర గ్రామంలో చోటుచేసుకుంది. శంషాబాద్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద తుప్పర గ్రామానికి చెందిన మడిగెల నందకిషోర్ ఫిర్యాదు చేశారన్నారు. ఈ ఫిర్యాదులో పెద్ద తుప్పర గ్రామంలోని సర్వేనెంబర్ 185 లో నందకిషోర్ పెద్దనాన్న మడిగల వెంకటయ్య, నందకిషోర్ చెల్లెలు మునగాల అర్చన పేర్లపై 0:33 గుంటల పట్టా భూమి ఉందన్నారు. ఈ భూమిలో 2007 సంవత్సరం కన్నా ముందు ఉన్న రెండు గదులు స్కూల్ భవనాన్ని 2007వ సంవత్సరంలో సర్వేనెంబర్ 183 ప్రభుత్వ భూమిలోకి గ్రామ పెద్దలు అందరూ కలిసి మార్చి అక్కడ కొత్త స్కూల్ భవనాన్ని నిర్మించారన్నారు. వారి భూమిలో ఉన్న స్కూల్ భవనం శిథిలావస్థకు చేరడంతో తాము హైకోర్టు నుండి భూమి తమదని అన్నట్టుగా ఆర్డర్ తీసుకున్నామని తెలిపారు.

ప్రస్తుతం తమ దగ్గర హైకోర్టు ఆర్డర్ కూడా ఉన్నదని భూమి వద్దకు వెళ్లి రీకాస్ట్ వేస్తుండగా వారి గ్రామ సర్పంచ్ చిటికెల వెంకటయ్య, అతని అనుచరులు కృష్ణయ్య, ప్రవీణ్, కొండ రవీందర్, దాసు, రాములు, నల్లుల యాదయ్య, కేతావత్ తుల్జా, గుర్రంపల్లి శంకరయ్యలను తీసుకువచ్చి తమ భూమిలోకి అక్రమంగా ప్రవేశించి తాము పనిచేస్తుండగా అడ్డుకున్నారని తెలిపారు. సర్పంచ్ వెంకటయ్య తనకు రెండు ప్లాట్లు ఇస్తేనే వారి పొలానికి ఫ్రీ కాస్ట్ వేసుకునేలా అనుమతి ఇస్తానని, లేకుంటే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకొని మీరు పని ఎలా చేస్తారో చూస్తానని బూతు మాటలు తిడుతూ భయభ్రాంతులకు గురిచేస్తూ బెదిరింపులకు దిగుతున్నారన్నారు. అయితే వీరందరూ కలిసి నందకిషోర్ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూ బెదిరించడం వల్ల అతని తమ్ముడు విజయ్ కి గుండెపోటు వచ్చిందని అన్నారు. కావున తమని ఇబ్బందులు పెడుతున్న సర్పంచ్ చిటికెల వెంకటయ్యతో పాటు అతని అనుచరులపై కఠిన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరారు. కాగా పోలీసులు పెద్ద తుప్పర సర్పంచ్ చిటికెల వెంకటయ్య అతని అనుచరులపై 447, 427, 506,R/W 34 IPC సెక్షన్లలో కేసులు నమోదు చేసి విచారిస్తున్నామన్నారు.

Advertisement

Next Story