పసిప్రాయంలోనే మద్యం విక్రయాలు.. చిత్తశుద్ధి వహించని చైల్డ్ శాఖ

by Kalyani |   ( Updated:2024-10-17 10:56:38.0  )
పసిప్రాయంలోనే మద్యం విక్రయాలు.. చిత్తశుద్ధి వహించని చైల్డ్ శాఖ
X

దిశ, బషీరాబాద్: బడికి వెళ్లాల్సిన బాలుడు రేకుల డబ్బాలో దర్జాగా మద్యం విక్రయిస్తూ దర్శనమిచ్చాడు. అయితే కొన్ని సంవత్సరాల నుంచి అక్రమ మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తి నుండి ప్రతి నెల ఆబ్కారీ పోలీసులు మామూళ్లు తీసుకుని వెళ్తారని, ఆ కుటుంబానికి చెందిన బాలుడు నిర్భయంగా నిజాలు బయటపెట్టాడు. పూర్తి వివరాల్లోకి వెళితే వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని ఒక గ్రామంలో బెల్టుషాపులో బాలుడు మద్యం విక్రయిస్తూ కనిపించాడు. ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి తన మొబైల్ లో చిత్రీకరించి పోలీసులకు పంపిస్తాను అని చెప్పడంతో ఆ బాలుడు ఇలా స్పందించాడు. పోలీసులంటే భయం లేదు ఎవరికైనా చెప్పుకో. ఆబ్కారీ శాఖ పోలీసులు ప్రతినెలా తమ ఇంటికి వచ్చి నాటుకోడి విందు స్వీకరించి, మామూళ్లు తీసుకెళ్తారు అని విస్తుపోయే నిజాలను వెల్లడించాడు. అక్రమాలకు పురుడు పోస్తున్న ఆబ్కారీ శాఖ, పోలీసులపై చిన్నపిల్లాడు సైతం విమర్శించే నీచ స్థితికి దిగజారి పోయినట్లు బాలుడి మాటలు విన్న ఆ వ్యక్తి ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇకనైనా ఆబ్కారీ శాఖ అక్రమ వసూళ్లు మానుకొని బెల్ట్ షాపులపై కొరడా ఝులిపించాలని సభ్య సమాజం కోరుతుంది. ఈ విషయంపై జిల్లా అధికారులు ఏ విధంగా చర్యలు చేపట్టనున్నారో వేచి చూడాలి.

అవినీతి ఆబ్కారీ శాఖ…

బషీరాబాద్ మండల పరిధిలోని 36 గ్రామపంచాయతీలలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్న ఆబ్కారీ అధికారులు మాత్రం లంచాలు తీసుకుని కార్యాలయాలకే పరిమితం అవుతున్నారని చెప్పడానికి ఇది ఒక గట్టి ఉదాహరణ. ఉన్నత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో గ్రామాలలో గొలుసు దుకాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. బడి ఈడు పిల్లలు సైతం మద్యం సేవించడం వంటివి వెలుగుచూస్తున్నాయి. ఆబ్కారీ అధికారుల నిర్లక్ష్యంతో మండల వ్యాప్తంగా గ్రామాల్లో యువత చెడు వ్యాసనాల వైపు అడుగేడుగుతున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి అనధికార గొలుసు దుకాణాలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

చైల్డ్ లైన్ అధికారులు ఎక్కడ...?

బడికి వెళ్లాల్సిన బాలుడు రేకుల డబ్బాలో దర్జాగా మద్యం విక్రయిస్తూ దర్శనమిచ్చాడు. ఇందుకు గ్రామాలల్లో సరైన అవగాహన లేకపోవడంతో పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు. చైల్డ్ లైన్ అధికారులు ఉన్నప్పటికీ గ్రామాల్లో ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో చాలామంది బాల్యంలోనే పొలం బాట, పశువులు మేపటం, కూలీ పనులు చేయడం వంటి పనులతో అక్కడక్కడ దర్శనమిస్తున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అనే మాటను అధికారులు ఒకసారి నెమరు వేసుకుంటే కల్మషం ఎరుగని బాలల జీవితం బాగుపడుతుంది.

పోలీసుల లోపం…?

చట్టాలు ఎన్ని ఉన్న నోట్ల కట్టలు పెట్టగానే పోలీసులు నోరు మెదపరు. ఈ మాట అ నోటా, ఈ నోటా ఎప్పటి నుంచో వినిపిస్తున్న నగ్న సత్యం. 18 ఏళ్ళ లోపు చిన్న పిల్లలకు మద్యం ఇవ్వొద్దు అని వైన్ షాప్ వద్ద పెద్దగా బ్యానర్ లో దర్శనమిస్తున్నప్పటికీ గ్రామాల్లో మాత్రం అభం శుభం ఎరుగని చిన్నపిల్లలతో మద్యం విక్రయాలు జరిపిస్తున్నారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలకు ప్రేరేపిస్తున్న తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని విద్యావంతులు కోరుతున్నారు.

అల్లర్లకు కారణం బెల్ట్ షాపులే…?

గ్రామాల్లో వీధి వీధినా వెలసిన బెల్ట్ షాపుల్లో మద్యం సేవించిన యువత అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటమే కాకుండా, కుటుంబ తగదాలు, భూ వివాదాలు, అక్రమ సంబంధాలు జీర్ణించుకోలేక మద్యం మత్తులో నెత్తురు చిందిస్తున్నారు.

ఎస్సై గఫార్ ని వివరణ కోరగా…

ప్రభుత్వ అనుమతులు లేకుండా హోటల్లలో, దాబాలలో, అక్రమ మద్యం అమ్మితే, గ్రామంలో బెల్టుషాపులు నడిపిస్తున్నారని నా దృష్టికి వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని అన్నారు. ఎక్సైజ్ ఎస్సై రవికుమార్ ని వివరణ కొరకు ఫోన్ చేసిన, మెసేజ్ పెట్టిన స్పందించడం లేదు.

Advertisement

Next Story