ఎమ్మార్వో మోసం.. రైతుల భూమిని వేరేవారికి రిజిస్ట్రేషన్

by Sathputhe Rajesh |
ఎమ్మార్వో మోసం.. రైతుల భూమిని వేరేవారికి రిజిస్ట్రేషన్
X

దిశ, చేవెళ్ల: రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని, వారికి తెలియకుండా సంతకం తీసుకుని ఆ రైతు పేరు మీద ఉన్న భూమిని వేరే వారికి కట్టబెట్టిన ఘటన చేవెళ్లలో చోటు చేసుకుంది. బాధితుని కథనం ప్రకారం.. మండల పరిధిలోని అంతారం గ్రామానికి చెందిన ఘనపురం లక్ష్మయ్యకు సర్వే నెంబర్ 145లో వంశపారంపర్యంగా వచ్చిన 10 ఎకరాల భూమిని అమ్ముకోగా.. రావాల్సిన భూమి 2 ఎకరాలు కానీ వచ్చిన భూమి 1 ఎకరా 09 గుంటలు. అందులో ఆయన అన్నలు అయిన మాణయ్య, రాములుకు కూడా వాటా ఉంది. మిగతా భూమి కోసం కలెక్టర్, RDO మరియు తహశీల్దార్ కార్యాలయాల్లో అడ్వకేట్ సహాయంతో అప్లికేషన్ పెట్టుకున్నట్లు తెలిపారు. తహశీల్దార్ తో కుమ్మక్కై మధ్యవర్తులు లక్ష్మయ్యకు మాయ మాటలు చెప్పారు. అమ్ముకున్న భూమి ముటేషన్ కాలేదని, తాము చేయిస్తామని డబ్బులు కూడా ఇస్తామని ఆశ చూపి పాత, కొత్త పాసు పుస్తకాలు తీసుకొన్నారు. ముటేషన్ లో భాగమని ఫిబ్రవరి 4వ తేదీన బాధితుని సంతకం తీసుకున్నారు. కాగా 1ఎకరా 09 గుంటల భూమిని సోమవారం నాడు బాధితుని పేరు మీద నుండి తొలగించి ముత్యం రమణారెడ్డి అనే వ్యక్తి పేరు మీదకి మార్చారు.

ఈ విషయమై బాధితుని తరపు వారు వెళ్లి తహశీల్దార్ ని అడిగారు. అయితే బాధితుడు సంతకం పెట్టడం వల్లనే రిజిస్ట్రేషన్ చేసామంటున్నారని నిర్లక్ష్యపు సమాధాన ఇస్తున్నారన్నారు. బాధితునికి అవగాహన లేకపోవడం అలుసుగా తీసుకొని అతని భూమి రాయించుకోవడంపై బాధితుని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story