అటవి జీవ వైవిధ్య సంస్థతో PJTSAU అవగాహన ఒప్పందం..

by Kalyani |
అటవి జీవ వైవిధ్య సంస్థతో PJTSAU అవగాహన ఒప్పందం..
X

దిశ, రాజేంద్రనగర్: భారతీయ అటవీ జీవ వైవిధ్య పరిశోధనా మరియు విద్యా మండలి పరిధిలోని హైదరాబాద్ దూలపల్లిలో ఉన్న అటవి జీవ వైవిధ్య సంస్థతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU) తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రాజేంద్రనగర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో జరిగిన కార్యక్రమంలో అవగాహన ఒప్పంద పత్రాలపై రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్. సుధీర్ కుమార్, అటవి జీవ వైవిధ్య సంస్థ డైరెక్టర్ ఇ. వెంకట్ రెడ్డి సంతకాలు చేశారు.

ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. అటవీ సంరక్షణ, జీవవైవిధ్యం, అటవీ వ్యవసాయంలో తమ సంస్థకు ఉన్న అనుభవాలను వివరించారు. ఈ ఒప్పందంతో ఇరు సంస్థలు కలిసి అటవీ వ్యవసాయంలో చేపట్టవలసిన పరిశోధనలు, కార్యక్రమాలకు ఊతం లభిస్తోందని అన్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్. సుధీర్ కుమార్ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయంలో ఏర్పాటుచేసిన జీవ వైవిధ్య వనస్థలి దేశంలోనే మొదటిదని, దీని సంరక్షణ కోసం విశ్వవిద్యాలయం తీసుకున్న చర్యల గురించి వివరించారు.

సుస్థిరమైన, లాభదాయకమైన అటవీ వ్యవసాయ నమూనాలను రూపొందించి రైతులకు చేరవేయుటకు, పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు పరిశోధనా విద్యార్థులకు, పరస్పర సమన్వయ పరిశోధన ప్రాజెక్టుల రూపకల్పనకు ఈ ఒప్పందం దోహదం చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ కార్యక్రమాల సంచాలకులు డాక్టర్ జమునారాణి, అగ్రో ఫారెస్ట్రీ విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏవీ రామాంజనేయులు, విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు డాక్టర్ ఎం. వెంకటరమణ, డాక్టర్ సీమ, డాక్టర్ సుధారాణి, డాక్టర్ జె. సత్యనారాయణ, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ పద్మజ, డాక్టర్ టి. చైతన్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed