వంతెన నిర్మాణ హామీలు..హుష్‌కాకి

by Sumithra |
వంతెన నిర్మాణ హామీలు..హుష్‌కాకి
X

దిశ , తాండూరు రూరల్ : పాలకులు మారుతున్నా గ్రామాల దుస్థితి ఏమాత్రం మారడం లేదు. మండలం నుంచి పలు గ్రామాల ప్రజలు తాండూరుకి రావాలంటే వాగులు, వంకలు దాటాల్సిందే. వాటిపై వంతెనలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. అత్యవసర సమయాల్లో పొంగుతున్న వాగులు దాటలేక ప్రాణాలు పోతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. ప్రాణాలు పోయిన సంఘటనతోనైనా అధికారులు, పాలకులు స్పందించాల్సిన అవసరముంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధికి పుష్కలంగా నిధులు విడుదల చేస్తున్నట్టు చెబుతున్నా నేటికీ పలు గ్రామాలకు ఇక వాగులు, వంకలపై వంతెనల నిర్మాణాలపై ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాండూరు మండల పరిధిలోని బిజ్వార్ , బేల్కటూర్ గ్రామాలలోని వాగులపై మంతనాలు లేక పలు గ్రామాలప్రజలు నానా అవస్థలుపడుతున్నారు. ఈ ప్రాంతాలలోని వాగులపై వంతెనల నిర్మాణల మాట ఒకటి, రెండు రోజుల ముచ్చట కాదు. కొన్ని సంవత్సరాల నుండి కొనసాగుతుంది. బేల్కటూర్ వాగుపై వంతెన లేకపోవడంతో కరన్ కోట్, ఓగిపూర్, చంద్రవంచ, చిట్టిఘనాపూర్, బేల్కటూర్ గ్రామలతోపాటు కర్ణాటక రాష్ట్ర ప్రజలు కూడా పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాగులు దాటాల్సిన భయంకరమైన పరిస్థితి నెలకొంది.

సకాలంలో ఆస్పత్రికి వెళ్లలేక ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. బొంకూరు వాగులో నీళ్లు ఉప్పొంగి ప్రవహించడంతో వాగుపై వంతెన లేకపోవడంతో రాకపోకలు నిలిచిఉండగా అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి సకాలంలో సరైన వైద్యం అందక పరిస్థితి చేయిదాటి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. వాగుపై వంతెన లేక అదే గ్రామానికి చెందిన వ్యక్తికి సరైన సమయంలో వైద్యం అందక మృతి చెందారు. మృతదేహాన్ని గ్రామానికి తీసుకవెళ్లలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ గ్రామాలకు వాగులపై వంతెన సౌకర్యం లేకపోవడంతో ప్రజలకు అత్యవసర సేవలకు దూరమవుతున్నారు. ఎన్నికల సమయంలో నాయకులు, ప్రజాప్రతినిధులు గ్రామాలకు వచ్చి హామీ ఇవ్వడం మరిచిపోవడం సర్వసాధారణమై పోయాయి. మన పాలకులు వాగులపై వంతెనల నిర్మాణానికి హామీ ఇచ్చారని, అయినా నేటికీ నెరవేరలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అత్యవసర సమయంలో అంబులెన్స్‌ కూడా రాలేని పరిస్థితి ఉంది. గతేడాది కరన్ కోట్ గ్రామానికి చెందిన గర్భిణీ లక్ష్మి వాగు ఉప్పొంగడంతో వంతెన లేక వైద్యం కోసం నానా అవస్థలు పడింది. వాగుపై వంతెన నిర్మాణం కోసం కృషి చేస్తామని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హామీ ఇచ్చారు. అయినాగానీ నేటికీ వంతెన నిర్మాణానికి నోచుకోలేదు. గ్రామల సమీపంలోని వాగులపై వంతెనలు లేకపోవడంతో వర్షాకాలంలో పలు గ్రామాల ప్రజలు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. వాగులపై వంతెనలు లేకపోవడంతో పలు గ్రామాల్లో అత్యవసర పరిస్థితులు తలెత్తితే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. వాగుపై వంతెన నిర్మిస్తామని పాలకులు హామీలు ఇస్తున్నారు. తప్పించి చేతల్లో మాత్రం చేయడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖమంత్రి సబితారెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, అధికారులు, తమ గ్రామాలను సందర్శించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.

Advertisement

Next Story