ధనిక రాష్ట్రంలో పథకాలు ఎందుకు అమలు కావడం లేదు..

by Sumithra |
ధనిక రాష్ట్రంలో పథకాలు ఎందుకు అమలు కావడం లేదు..
X

దిశ, తలకొండపల్లి : దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమని చెప్పుకుంటున్న పథకాల అమల్లో మాత్రం తెలంగాణ రాష్ట్రం నీరుగారిస్తుందని, మేనిఫెస్టోలో పొందుపరిచిన ఎన్నో పథకాలను ఇప్పటికే గాలికి వదిలారని హుజూర్నగర్ ఎమ్మెల్యే ఈట రాజేందర్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండల కేంద్రంలో సోమవారం రాత్రి పల్లె గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా 18,19,20,21 బూత్ కమిటీ శక్తి కేంద్రం కార్నర్ మీటింగ్ ను మండల బిజెపి అధ్యక్షుడు రవి గౌడ్ అధ్యక్షతన బస్టాండు కూడలిలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హుజూర్నగర్ ఎమ్మెల్యే ఈట రాజేందర్, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి హాజరయ్యారు.

అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుకలైన ఎమ్మెల్యేలను అణగదొక్కడమే కేసీఆర్ నైజం అని, నన్ను అసెంబ్లీకి రాకుండా ఎన్నోసార్లు అవమానపరిచి, బయటికి గెంటివేసారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలు మీటింగులు పెడితే పోలీస్ ఫారాల మధ్య ప్రజా సమస్యలను బయటకి పొక్కకుండా చూస్తున్నారని, వచ్చే 2024 ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమన్నారు. శాసనసభలో అన్ని వర్గాల ప్రజల సమస్యలు నెరవేర్చే విధంగా చర్చలు జరపాలి కానీ, ప్రశ్నించే ఎమ్మెల్యేల గొంతు నొక్కి శాసనసభలో అబద్దాలను కూడా నిజం చేసే విధంగా పదేపదే చెప్పుకుంటూ ప్రభుత్వం కాలం వెళ్లదీస్తుంద అని దుయ్యబట్టారు. రెండవసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఎన్నో పథకాలను నీరుగార్చి ధనిక రాష్ట్రమని చెప్పుకుంటూ ఉండడం సిగ్గుచేటు అన్నారు.

ధనిక రాష్ట్రంలో డబుల్ బెడ్రూం, నిరుద్యోగ భృతి, మహిళా సంఘాల రుణాలు, రైతుల రుణమాఫీ లాంటి ఎన్నో పథకాలను అమలు చేయకపోవడంలో అంతర్యం ఏమిటి అని ఈటెల ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల ముందే కేసీఆర్ పథకాలపై మళ్లీ ప్రత్యేక దృష్టి పెట్టి ఓట్లు వేయించుకుంటాడని ప్రజలందరూ తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని ఈటెల పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఎన్నో స్కీములను,రాష్ట్రంలో అమలులోకి తేకుండా ఆయుష్మాన్ భారత్ లాంటి ఎన్నో స్కీములను కాలయాపన చేస్తూ తొక్కి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, లాంటి ఎన్నో పథకాలకు బడ్జెట్లో సుమారు 30 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి, మన నుండి లిక్కర్ రూపంలో 45 వేల కోట్ల రూపాయలను లాక్కుంటున్నాడనే విషయం మన మహిళా తల్లులు, యువత గ్రహించలేకపోతున్నామని మహిళలను, యువతను ఆయన మేలుకొలుపు చేశాడు.

అంతకుముందు జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి మాట్లాడుతూ ఇప్పటికీ కల్వకుర్తి నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతి నిత్యం వహించిన జైపాల్ యాదవ్ అసమర్థుడని అతని గురించి నేను మాట్లాడడం భావ్యం కాదని ఎద్దేవా చేశారు. కల్వకుర్తిలో ఇప్పటికీ ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కూడా రాలేదని, తలకొండపల్లికి ఒక జూనియర్ కళాశాల తేలేక పోయాడని, తన సొంత బిడ్డను సర్పంచ్ గా గెలిపించుకోవడానికి వెల్జాల్ గ్రామాన్ని ప్రత్యేక మండలం ఏర్పాటు చేస్తానని చెప్పి ఏకగ్రీవంగా గెలిపించుకున్నాడని, మరో ఆరు నెలల్లో ప్రభుత్వ సమయం కూడా అయిపోతుంది అని ఎద్దేవ చేశాడు. కల్వకుర్తి అభివృద్ధి కోసం జాతీయ బీసీ కమిషన్ సభ్యులుగా ఉన్న సమయంలో కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశానని గుర్తు చేశారు. దేశంలోనే మునిసిపాలిటీలలో ఆమనగల్ మున్సిపాలిటీ రెండవ స్థానంలో, రాష్ట్రంలో మొదటి స్థానంలో అత్యధిక మెజార్టీతో గెలవడంతో కేంద్ర ప్రభుత్వం నాలుగు కోట్ల రూపాయల ప్రత్యేక నిధులు కూడా ఇచ్చిందని ఆచారి సూచించారు.

ఎమ్మార్పీఎస్ నాయకుల నిరసన ఎస్సీల వర్గీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మార్పీఎస్ నాయకులు కొంతమంది ఈటల రాజేందర్, ఆచారి మండలానికి వస్తున్నారని ముందుగా తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ నేతలు బిజెపి నాయకులను అడ్డుకోవడానికి గో బ్యాక్, గో బ్యాక్, డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వెంటనే ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు పాండు, కుమార్, వెంకటేష్, పాండు ప్రసాద్ ,సుదర్శన్, నాగరాజు ,బాలాజీ, శేఖర్ రెడ్డి ,హేమరాజు, యాదయ్య, పవన్ వాల్మీకి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story