పంచాయతీ ఎన్నికలపై కసరత్తు.. తుది దశకు ఏర్పాట్లు

by srinivas |   ( Updated:2025-01-03 02:21:52.0  )
పంచాయతీ ఎన్నికలపై కసరత్తు.. తుది దశకు ఏర్పాట్లు
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: గ్రామ సర్పంచ్​పదవీకాలం ముగిసి దాదాపు ఏడాది కావస్తున్నది. దీంతో పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పరిపాలన కొనసాగుతున్నది. ప్రత్యేకాధికారుల పరిపాలనతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతుందనే ప్రచారం సాగుతున్నది. ప్రజలకు స్పందించే అధికారులు లేకపోవడంతో సమస్యల పరిష్కారంలో ఇబ్బందులు కలుగుతున్నట్లు తెలుస్తున్నది. అందుకే మరికొంతకాలం ప్రత్యేకాధికారులతో పాలన కొనసాగిస్తే రాష్ట్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి పంచాయతీ ఎన్నికలకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది. అందులో భాగంగానే పంచాయతీ అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు కనిపిస్తున్నది.

మున్సిపాలిటీలో పంచాయతీలు విలీనం ..

రంగారెడ్డి జిల్లాలో 13 మున్సిపాలిటీలు, 560 గ్రామ పంచాయతీలున్నా యి. 560 గ్రామ పంచాయతీల్లో సుమారుగా 15 గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనం జరిగాయి. మిగిలిన 545 గ్రామాలకు పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. వికారాబాద్​జిల్లాలో 4 మున్సిపాలిటీలు, 566 గ్రామ పంచాయతీలున్నాయి. అన్ని గ్రామ పంచాయతీలకు జరగాల్సిన ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో పోలింగ్ కేంద్రాల ఎంపిక ప్రారంభమైంది. పక్కా భవనాలను పరిశీలిస్తున్నారు. దీంతో గ్రామాల్లో ఇప్పటికే రిజర్వేషన్లపై, పార్టీల బలాబలాలపై చర్చలు నడుస్తున్నాయి.

ఎన్నికల సామగ్రికి ఏర్పాట్లు..

రంగారెడ్డి, వికారాబాద్​జిల్లాల్లోని పంచాయతీ అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో బిజీబిజీగా ఉన్నారు. అక్టోబర్ నెలలో ఓటర్ల తుది జాబితా విడుదల చేశారు. ఆ జాబితాకు అనుగుణంగానే వార్డుల విభజన చేశారు. తదనంతరం ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రిని సమకూర్చుకునేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్​పోటీ చేసే అభ్యర్థులకు కేటాయించే స్వతంత్రపు గుర్తులను ప్రకటించింది. ఆ గుర్తులను బ్యాలెట్​ పత్రాల రూపంలో ముద్రించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. పోలింగ్ కేంద్రాలు, మౌలిక వసతులు, బ్యాలెట్​పత్రాలు, బ్యాలెట్​బాక్స్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. పోలింగ్​అనంతరం జరిగే ఎన్నికల కౌంటింగ్​ కేంద్రాల ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. ఇప్పటికే జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed