మాసాబ్‌ చెరువు ఉనికికే ఎసరు.. యథేచ్ఛగా పూడ్చివేత పనులు

by Mahesh |
మాసాబ్‌ చెరువు ఉనికికే ఎసరు.. యథేచ్ఛగా పూడ్చివేత పనులు
X

దిశ, తుర్కయంజాల్‌: మండలం కేంద్రం లోని మాసాబ్‌ చెరువు ఆత్మ ఘోషిస్తోం ది. సుమారు 40 ఏళ్ల తర్వాత నిండుకుండలా మారి పొలాలను పచ్చగా మార్చి రైతులను, ప్రకృతి ప్రేమికులను ఆహ్లాద పరుస్తున్న చెరువు కబ్జా కోరల్లో, రియల్టర్ల దాహానికి ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడింది. అధికారుల నిర్లక్ష్య వ్యవహారం, గత పాలకులు కాసుల కక్కుర్తితో ఇష్టారీతిన ఎన్‌ఓసీలు ఇవ్వడం తనకు శాపంగా మారిందని దీనంగా రోదిస్తోంది. మాసాబ్‌చెరువు ఉనికి ప్రమాదంలో పడే పరిస్థితులు కళ్లెదుట ప్రస్పుటంగా కనబడుతున్నాయి. వేలకోట్ల రూపాయల విలు వైన భూములను కొట్టేయాలన్న దుర్బుద్ధితో చెరువును నామరూపాల్లేకుండా చేయాలని కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

506 ఎకరాల చెరువు భూమిని కబ్జా చేయాలని కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. చెరువు ఎఫ్టీఎల్‌ పరిధిలోని 205 సర్వే నెంబర్‌లోని సుమారు 14 ఎకరాల స్థలంలో నాగార్జునసాగర్‌ రోడ్డుకు ఆనుకొని సుమారు 6 గజాల ఎత్తున మట్టి నింపారు. బడా ప్రజాప్రతినిధులు, ఉన్నత స్థాయి అధికారుల ప్రోద్బలంతో పకడ్బందీగా కోర్టు ఉత్తర్వులు పెట్టుకుని మరీ ఈ తతంగాన్ని నడిపిస్తున్నారు. రాత్రిపూట వందలాది టిప్పర్లు, ఎక్సకవేటర్లతో చెరువులో మట్టి నింపి ప్లాట్లుగా మలిచే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. దీన్ని అఖిలపక్ష నాయకులు, స్థానికులు, ప్రకృతి ప్రేమికులు ప్రతిఘటించడంతో కొన్ని రోజులుగా తాత్కాలికంగా పనులు నిలిపివేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు గుర్రంగూడ టీచర్స్‌కాలనీ వైపు నుంచి సర్వే నెంబర్‌ 137లో చెరువు మధ్యలో భారీగా డంప్‌ చేస్తున్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. సుమారు కిలో మీటర్‌ పొడవునా 60 ఫీట్ల వెడల్పుతో వందలాది టిప్పర్లతో మట్టి పోయించారు రియల్టర్లు. పెద్ద పెద్ద బండరాళ్ళతో పూడ్చి చెరువును రెండుగా చీల్చారు. సిరీస్‌ కంపెనీ మట్టి పోయ డంతో విషతుల్యమై చేపలు మృత్యువాత పడ్డాయి. విషయం తెలుసుకున్న ‘స్థానిక నేతలు టిప్పర్లను బంద్‌ చేయించారు. అక్కడున్న సూపర్‌వైజర్‌, డ్రైవర్లను పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు. చెరువుకు ఆనుకొని ఉన్న ఓ బడా రియల్టర్‌ వెంచర్‌ కోసం ఈ రోడ్డును వేయిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

రైతులను మభ్య పెట్టి..

చెరువును ఆనుకొని పొలాలు ఉన్న రైతులను మభ్య పెట్టి రియల్టర్లు మట్టి పనులు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. మీ పొలాలకు వెళ్లేందుకు వీలుగా 60 ఫీట్ల వెడల్పు తో తమ సొంత ఖర్చుతో రోడ్డు వేయిస్తానని, తమకు సహకరిస్తే మీకు లాభమని ఏమార్చారు. దీంతో రైతులు తమ భూములకు కూడా విలువ పెరుగుతుందని, రోడ్డు కూడా అణువుగా ఉంటుందన్న ఆశ వారిలో నెలకొంది. బడా రియల్టర్‌ ఉచ్చులో తాము చిక్కుకున్నామన్న సంగతి వాళ్లు ఆలస్యంగా తెలుసుకున్నారు.

ఇరిగేషన్‌ అధికారుల పరిశీలన

సర్వే నెంబర్‌ 137లోని నడిచెరువులో మట్టి నింపిన ప్రాంతాన్ని ఇరిగేషన్‌ ఏఈ గంగ, అధికారులు పరిశీలించారు. చెరువును కబ్జా చేసి మట్టి నింపిన వారిపై కేసులు పెట్టినట్లు తెలిపారు. చెరువు కబ్జాకు గురికాకుండా నిరంతర పర్యవేక్షణ కోసం వీఆర్‌ఏను, ఇరిగేషన్‌ సిబ్బందిని నియమిస్తామని తెలిపారు.

ప్రకృతి ప్రేమికుల ప్రయాస

మాసాబ్‌చెరువును కాపాడుకోవాలన్న ప్రకృతి ప్రేమికులు, అఖిలపక్ష నాయకుల్లో బలంగా నాటుకుంది. సుమారు వెయ్యి మందితో వాట్సప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి నిరంతరం మానిటర్‌ చేసుకుంటున్నారు. సుమారు నెల నుంచి రాత్రింబవళ్లు జాగారం చేస్తున్నారు. చెరువు పరిసరాల్లోనే ఉంటూ టిప్పర్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కోర్టు ఆర్డర్లు రియల్టర్లకు అనుకూలంగా ఉన్నా.. తాము న్యాయం కోసం పోరాడుతామని దీక్ష బూనారు. అవసరమైతే ప్రాణత్యాగానికి సిద్ధమని హెచ్చరిస్తున్నారు.

సహజ సంపదను కాపాడుకోవాలి

సహజ సంపదను, ప్రజల ఆస్తిని కొల్లగొట్టాలని చూస్తున్న రియల్టర్లకు, వ్యాపారులకు బుద్ధి చెప్పి తీరుతాం. మాసాబ్‌ చెరువును కాపాడి భవిష్యత్‌ తరాలకు అందించేందుకు తమవంతు ప్రయత్నం చేస్తాం. చెరువు పరిరక్షణకు ప్రతి ఒక్కరూ స్వతహాగా ముందుకొచ్చి పోరాటంలో పాల్గొంటుండడం గర్వకారణం. -కొంతం యాదిరెడ్డి, బీఆర్‌ఎస్‌ నేత, ప్రకృతి ప్రేమికుడు

కబ్జాదారులతో కొట్లాడుతాం..

వేల కోట్లు విలువచేసే భూములను అప్పనంగా కొట్టేయాలన్న రియల్టర్ల కుట్రలు సాగనివ్వం. చెరువును కాపాడేందుకు ఎంతటి పోరాటమైనా చేస్తాం. ఇప్పటికే అనేక రూపాల్లో నిరసనలను తెలిపాం. ఎన్జీటీ కి, కలెక్టర్‌కు, ఇరిగేషన్‌ అధికారులకు ఫిర్యాదులు చేశాం. సాగర్‌ రోడ్డును దిగ్భంధిస్తాం. దీక్షలు చేస్తాం. -బచ్చిగళ్ల రమేశ్, బీజేపీ దళిత మోర్చా, జిల్లా అధ్యక్షుడు

Advertisement

Next Story