దారుణం... భార్యను, 2 నెలల పసి గుడ్డును హత్య చేసిన భర్త

by S Gopi |
దారుణం... భార్యను, 2 నెలల పసి గుడ్డును హత్య చేసిన భర్త
X

దిశ, అబ్దుల్లాపూర్ మెట్: అదనపు కట్నం కావాలంటూ భార్యను, రెండు నెలల వయసున్న కుమారుడిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన బుధవారం అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అబ్దుల్లాపూర్ మెట్ మండలం బండరావిర్యాల గ్రామానికి చెందిన కందికంటి నర్సింగ్ రావు కుమార్తె లావణ్య(28)అనాజీ పూర్ గ్రామానికి చెందిన ఏర్పుల ధనరాజ్ అనే వ్యక్తితో 2018 సంవత్సరంలో వివాహం జరిపించారు. ప్రస్తుతం రెండు సంవత్సరాల వయసున్న కూతురు ఉండగా రెండు నెలల క్రితం మరో బాబుకి జన్మనిచ్చారు. పెళ్లి జరిగినప్పటి నుంచి ధనరాజ్ తన భార్య లావణ్యతో అదనపు కట్నం కోసం గొడవ పడుతూ పలుమార్లు కొట్టి, వేధించేవాడని వివరించారు.

పలుమార్లు పెద్దల సమక్షంలో ఈ విషయమై సముదాయించి సర్ది చెప్పినప్పటికీ ధనరాజ్ తన వైఖరి ఏం మార్చుకోలేదని వివరించారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 12 గంటల సమయంలో ధనరాజ్ అత్తవారింటికి వెళ్లి లావణ్యను, ఇద్దరు పిల్లలను తీసుకుని అనాజీపూర్ వెళ్లాడు. తన కొడుకుకు రెండు నెలల వయసు ఉండడంతో టీకా వేయాలంటూ అత్తమామలకు సర్ది చెప్పి భార్యను తీసుకుని అనాజీపూర్ చేరుకున్నారు. మధ్యాహ్నం సమయంలో భార్య లావణ్యతో మరోసారి గొడవ జరగడంతో లావణ్యపై గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం పక్కనే ఉన్న నీళ్ల సంపులో తన రెండు నెలల కొడుకును పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు. లావణ్య తండ్రి నరసింగరావు ఫిర్యాదు మేరకు అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed