ఫిరంగినాలపై అక్రమ నిర్మాణాలు.. పట్టించుకోని అధికారులు

by Nagam Mallesh |
ఫిరంగినాలపై అక్రమ నిర్మాణాలు.. పట్టించుకోని అధికారులు
X

దిశ, శంషాబాద్ : ఇటీవల నూతన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెరువులు, నాళాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కొరకు హైడ్రా కమిటీ వేసి దూకుడు పెంచి అక్రమ నిర్మాణాలపై కొరడా జులుపిస్తు కబ్జా రాయుళ్ల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నారు. అయితే రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మధుర నగర్ కాలనీలో మాత్రం దానికి విరుద్ధంగా ఉంది. పురాతనమైన ఫిరంగినాలను సైతం ఇరువైపులా కబ్జా చేస్తూ 111 జీవోకు విరుద్ధంగా అనుమతి లేకుండా భారీ బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానికులు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా.. తూతూ మంత్రంగా పరిశీలించి వెళ్ళిపోతున్నారు. కానీ అక్రమ నిర్మాణాలు ఫిరంగినాల కబ్జా చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అయితే ఈ అక్రమ నిర్మాణాల వల్ల భారీ వర్షాలు వచ్చినప్పుడు వరద వస్తే ఫిరంగినాల కబ్జా చేయడంతో ఆ నీరంతా కాలనీలోకి చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇరిగేషన్ రెవిన్యూ మున్సిపల్ అధికారులు మాత్రం ఇక్కడ కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. ఏకంగా ఫిరంగినాలో లారీలతో మట్టి పోసి పూడ్చివేసి రోడ్లు వేసుకున్న ఘటనలు ఉన్నాయి. ఫిరంగినాల మూసివేసి హోటల్లు, జిమ్ములు వ్యాపార సముదాయాలు నిర్మించుకొని వాటి ప్రారంభానికి ప్రజాప్రతిథులను పిలిపించుకొని వారికి సన్మానాలు చేసి పంపుతున్నారు. నాళాలో దోమలు, ఈగలు, చేరి డెంగ్యూ, మలేరియా లాంటి అనేక రోగాల బారిన పడుతున్నామని మున్సిపల్ అధికారులకు, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తే ఇప్పటికీ పట్టించుకోలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫిరంగి నాలాపై ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేసి నాలా పునరుద్ధరణ పనులు చేపట్టాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed