‘దిశ’ వరుస కథనాలకు స్పందించిన హైడ్రా అధికారులు

by Mahesh |
‘దిశ’ వరుస కథనాలకు స్పందించిన హైడ్రా అధికారులు
X

దిశ, బడంగ్ పేట్: మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగ్ పేట్​ మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలోని చెరువులు, కుంటలు, శ్మశాన వాటికలు, వరద కాలువ, ప్రభుత్వ భూములను కబ్జా చేసి నిర్మించిన అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం కొరడా ఝులిపించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి జిల్లాలో అత్యంత విలువైన హైదరాబాద్‌ను ఆనుకొని ఉన్న బడంగ్​ పేట్​ మున్సిపల్​ కార్పొరేషన్‌పై హైడ్రా ప్రత్యేక దృష్టిసారించినట్లు సమాచారం. ఇప్పటికే బడంగ్‌పే ట్​ మున్సిపల్​ కార్పొరేషన్‌తో పాటు జల్​పల్లి మున్సిపాలిటీ, మీర్​పేట్​ మున్సిపల్ కార్పొరేషన్​ల పరిధిలో ప్రభుత్వ స్థలాలు, చెరువులు కబ్జాకు గురయ్యాయని ‘దిశ’ దినపత్రికలో ప్రధాన శీర్షికన కథనాలు ప్రచురితమయ్యాయి. స్థానిక రాజకీయ నాయకుల అండదండలతోనే ప్రభుత్వ స్థలాలు పెద్ద ఎత్తున కబ్జాకు గురయ్యాయని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలపై హైడ్రా ప్రత్యేక నిఘా పెట్టింది.

ఇప్పటికే బడంగ్ పేట్​ మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలో మూడు సార్లు హైడ్రా అధికారులు పర్యటిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు కబ్జాపై గుట్టు గా ఆరాతీస్తున్నారు. బడంగ్ పేట్​ మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలోని అల్మాస్​ గూడలోని శ్రీ వెంకటేశ్వర కాలనీ పార్క్ స్థలం కబ్జాకు గురయ్యిందని కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు హైడ్రా అధికారులు ఆ స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అది పార్కు స్థలమేనని తేల్చిన హైడ్రా అధికారులు.. నివేదికను హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ కు సమర్పించారు. హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ ఆదేశాల మేరకు పార్క్ స్థలాన్ని ఆక్రమించి ఏర్పాటు చేసిన కంటెయినర్‌​ను ఈ నెల 3న హైడ్రా అధికారులు జెసిబి సహాయంతో తొలగించారు. బడంగ్‌పేట్​ కార్పొరేషన్​ పరిధిలోని మరో ఎనిమిది వేర్వేరు ప్రాంతాల్లో కబ్జాకు గురవుతున్న కట్టడాలను హైడ్రా కమిషనర్​ తిరుమలేష్​ ఆధ్వర్యంలో సోమవారం పరిశీలించారు.

‘దిశ’ దినపత్రికలో వరుస కథనాలు..

జల్​ పల్లి మున్సిపాలిటీ లోని పెద్ద చెరువు తో పాటు తాళ్లకుంటతో పాటు జల్​ పల్లి పెద్ద చెరువు కట్ట కింద ప్రభుత్వ స్థలాలు.. పట్లోళ్ల ఇంద్రారెడ్డి కాలనీ మాయం.. డూప్లికేట్​ పట్టాలతో రిజిస్ట్రేషన్ల దందా.. లేడీ డాన్​ ఆగడాలు అంటూ దిశ దిన పత్రికలో ప్రధాన శీర్షికను వరుస కథనాలు వచ్చాయి. అంతేగాకుండా ‘మీర్​పేట్​ కార్పొరేషన్​ పరిధిలోని తాళ్ల చెరువు మాయం.. ఆనవాళ్లు లేకుండా పోయిన లెనిన్​నగర్​ లోని 30 ఎకరాల చెరువు.. చందన చెరువు కబ్జా .. రూ.100 కోట్ల వ్యాపారం.. బాలాపూర్​లో కుంటలు మాయం.. మామిడిపల్లిలో రెండెకరాల ప్రభుత్వ స్థలం కబ్జా.. రూ.60 కోట్ల భూమి హాం ఫట్​.. బడంగ్ పేట్​లోని సున్నం చెరువు కు గండి.. చెరువు స్థలానికి రెక్కలు, కోమటి కుంట స్థలం ఎవరికోసం వదిలిపెట్టినట్టు’ అంటూ దిశ దిన పత్రికలో సంచలన కథనాలు వెలువడ్డాయి.

పలు కబ్జా స్థలాలను పరిశీలించిన అధికారులు..

మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగ్​ పేట్​ మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలో ఆక్రమణకు గురైన ఓపెన్​ స్థలాలు అంటూ 'దిశ' దినపత్రికలో వచ్చిన వరుస కథనాలకు హైడ్రా అధికారులు స్పందించారు. ఈ నెల 9న ‘పేదలకు శిక్ష పెద్దలపై ప్రేక్షక పాత్ర.. బడంగ్ పేట్​లో టౌన్​ ప్లానింగ్​ అధికారులపై ఆరోపణలు...ఇందిరమ్మ ఇంటి స్థలంలో నిర్మించిన షెడ్డు కూల్చివేత.. పట్టా భూమిలోనే నిర్మిస్తున్నా లెక్కచేయని టౌన్​ ప్లానింగ్​ సిబ్బంది.. 30వ డివిజన్​ లో 153 గజాలు మాయం అంటూ 'దిశ' దిన పత్రికలో కథనం ప్రచురితమయ్యింది. అలాగే ఈ నెల 17వ తేదీన మున్సిపల్​ స్థలంలో అపార్ట్​‌మెంట్లు రెండు భారీ నిర్మాణాలు చేపడుతున్న అక్రమార్కులు... 2200 గజాల ఓపెన్​ ల్యాండ్​లో నిర్మాణం... 2018లో సూచిక బోర్డులు ఏర్పాటు చేసిన అధికారులు... ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికార యంత్రాంగం అంటూ 'దిశ' దినపత్రికల్లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో బీజేపీ బడంగ్ పేట్​ కార్పొరేషన్​ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకట్​ రెడ్డి, బీజేవైఎం అధ్యక్షుడు రాళ్ల గూడెం రామకృష్ణారెడ్డిలు 'దిశ' పత్రికలో వచ్చిన కథనాల ప్రతిని కూడా జత పరుస్తూ హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు.

దీంతో హైడ్రా ఇన్​స్పెక్టర్​ తిరుమలేష్​​ ఆధ్వర్యంలో సోమవారం బడంగ్ పేట్​ కార్పొరేషన్​ పరిధిలోని నాదర్​గూల్​ విలేజ్​ మున్సిపల్​ కాలనీలోని సర్వేనెంబర్​ 743, 747, 748, 749, 750 లలో కబ్జాకు గురైన 5100 గజాల ఓపెన్​ స్థలంతో పాటు మారుతీనగర్​లోని సర్వే నెంబర్​ 79, 80 లలోని 2188 గజాలలో ఆక్రమణకు గురైన ఓపెన్​ స్థలాన్ని గాయత్రీ హిల్స్ ​లోని సర్వే నెంబర్​ 787, 788, 789, 790లలో కబ్జాకు గురైన పార్క్ ప్రదేశాన్ని, సర్వేనెంబర్​ 119 లో అక్రమ కట్టడాల ప్రాంతాన్ని, అయోధ్యనగర్​లోని సర్వేనెంబర్​ 75 /1 లోని ఆక్రమణకు గురైన పార్క్​ స్థలం, సర్వే నెంబర్​ 58,59,60 లోని ఇరిగేషన్​ నాలాను అక్రమించి నిర్మించిన ప్రైవేట్​ ఫంక్షన్​ హాల్​ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రభుత్వ స్థలాలు ఎప్పటి నుంచి కబ్జాకు గురయ్యాయి? ఎంత మేరకు ఆక్రమణకు గురయ్యాయి? కబ్జాకు పాల్పడిందెవరు? అని హైడ్రా అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టారు. త్వరలోనే పూర్తి స్థాయి విచారణ చేపట్టిన అనంతరం హైడ్రా కమిషనర్​ రంగనాథ్​కు నివేదికను అందజేస్తామని, ఆపై అక్రమార్కులపై చర్యలు చేపడుతామని హైడ్రా ఇన్​స్పెక్టర్​ తిరుమలేశ్​ హెచ్చరించారు.

Advertisement

Next Story