తుర్కయంజాల్‌ మున్సిపల్‌ చైర్మన్ పీఠం మార్పిడిపై ఉత్కంఠ..!

by Kalyani |
తుర్కయంజాల్‌ మున్సిపల్‌ చైర్మన్ పీఠం మార్పిడిపై ఉత్కంఠ..!
X

దిశ, తుర్కయంజాల్‌: తుర్కయంజాల్‌ మున్సిపల్‌ చైర్మన్ పీఠం మార్పిడిపై ఉత్కంఠ నెలకొంది. సోమవారం జరిగిన పురపాలక సంఘం సాధారణ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది. చైర్మన్‌ పదవి నుంచి వైదొలిగేందుకు అనురాధ రాంరెడ్డి సభ్యుల ఆమోదం కోరారు. దీనికి కాంగ్రెస్‌ సభ్యులందరూ చేతులెత్తి సమ్మతి తెలియజేశారు. చెరో రెండున్నరేళ్లు పదవిలో కొనసాగేందుకు గతంలో మల్‌రెడ్డి-రొక్కం వర్గాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు పదవిని రొక్కం వర్గానికి ఇచ్చేందుకు మల్‌రెడ్డి కుటుంబం ఓకే తెలిపింది. బుధవారం చైర్మన్‌ పదవికి అనురాధ రాంరెడ్డి రాజీనామా చేసే అవకాశం ఉంది.

పలు తీర్మానాలకు ఆమోదం..

రాగన్నగూడ వార్డు ఆఫీసులో చైర్‌ పర్సన్‌ అనురాధ రాంరెడ్డి అధ్యక్షతన కౌన్సిల్‌ సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు తీర్మానాలకు పాలకవర్గం ఆమోదం తెలిపింది. కొత్తగా 17మంది మున్సిపల్‌ సిబ్బందిని నియమించేందుకు కౌన్సిల్‌ నిర్ణయించి, కలెక్టర్‌కు నివేదిక పంపారు. అన్ని వార్డుల కార్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయించిన బడ్జెట్‌కు కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. కార్యక్రమంలో వైస్‌ చైర్‌ పర్సన్‌ గుండ్లపల్లి హరితాధన్‌రాజ్‌గౌడ్‌, కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ కొశికె ఐలయ్య, బీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌ కల్యాణ్‌నాయక్‌, బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ శ్రీలతఅనిల్‌కుమార్‌, కౌన్సిలర్లు కొత్తకుర్మ మంగమ్మ, కుంట ఉదయశ్రీగోపాల్‌రెడ్డి, రొక్కం అనితాచంద్రశేఖర్‌రెడ్డి, మర్రి మాధవి మహేందర్‌రెడ్డి, నారని కవితాశేఖర్‌గౌడ్‌, బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు వేముల స్వాతి అమరేందర్‌రెడ్డి, కీర్తనావిజయానంద్‌రెడ్డి, సంగీతమోహన్‌గుప్తా, భాగ్యమ్మధన్‌రాజ్‌, కమిషనర్‌ సాబేర్‌ అలీ, డీఈ సత్యనారాయణ, ఏఈ గుణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story