- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆఫర్ల పేరిట రియల్ దందా! అనుమతులు గోరంత.. అమ్మకాలు కొండంత
దిశ, రంగారెడ్డి బ్యూరో / షాద్‌నగర్ : సొంతింటి కల సాకారం చేసుకోండి అంటూ సామాన్య ప్రజలను రియల్ ఎస్టేట్ సంస్థలు బురిడీ కొట్టిస్తున్నాయి. అనుమతులు లేకుండా వెంచర్లు ఏర్పాటు చేస్తూ రియల్టర్లు అమాయకులను మోసం చేస్తున్నారు. వెంచర్‌కు డీటీసీపీ, అనుమతులున్నాయంటూ, తక్కువ రేటు, ఇన్‌స్టాల్‌మెంట్, స్పాట్ రిజిస్ట్రేషన్‌కు మంచి ఆఫ ర్ ఉంది అంటూ అందమైన కరపత్రాలు ముద్రించి అరచేతిలో స్వర్గాన్ని చూపుతూ కొనుగోలుదారులకు ప్లాట్లు అంటగడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గ్ పరిధిలో పదుల సంఖ్యలో అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయి. ప్లాట్లు కొనుగోలు చేసిన సామాన్యులు రూ.లక్షల్లో నష్టపోతున్నారు. అధికారుల కళ్ల ముందే అక్రమాలు జరుగుతున్నా వారు చేష్టలుడిగి చూస్తున్నారు. కొందుర్గ్ మండల పరిధిలో ఇంక్రిడబుల్ ఇండియా పేరుతో అనుమతులు గోరంత తీసుకొని కొండంత వ్యాపారం చేస్తూ అక్రమంగా సంపాదిస్తున్నారు. కొందుర్గు మండల కేంద్రానికి ఆనుకొని ఉన్న ఈ వెంచర్ అధికారులకు కనబడడం లేదా.. లేక కనిపించినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా? అనే అనుమానం కలుగుతోంది.
రేరా రిజిస్ట్రేషన్లు లేకుండానే..
నిబంధనల ప్రకారం ఒక రియల్ ఎస్టేట్ వెంచర్‌ను ఆవిష్కరించాలంటే రేరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్టు) 2016 అనుసరించి ముందుగా ప్రమోటర్లు తమ వెంచర్‌కు సంబంధించిన అన్ని వివరాలతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న రియల్ ఎస్టేట్ వెంచర్లను అదుపు చేయడం, కొనుగోలుదారుల హక్కులకు రక్షణ కల్పించడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని 2016 రేరా చట్టం అనుగుణంగా 2018, సెప్టెంబర్ 22న సర్క్యులర్ నంబరు 1/2018 ద్వారా తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్ నిబంధనలు కఠినంగా అమలు చేయా లని ఆదేశాలు జారీ చేసింది. దాని ప్రకారం అనుమతులు పొందిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో 500 చదరపు గజాలపైన 8 ప్లాట్లకు మించి ఏర్పాటు చేసే వెంచర్లను కచ్చితంగా తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ అథారిటీ (టీఎస్ రేరా) కింద రిజిస్ర్టేషన్ చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
ఎవరైనా వెంచర్ ఏర్పాటు చేయాలనుకునే ప్రమోటర్లు ముందుగా అన్ని ధ్రువీకరణ పత్రాలతో పాటు ప్రాజెక్టు వ్యయంలో కొంత శాతం ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. రేరా అనుమతులు లభించిన తర్వాతే డిస్ట్రిక్ట్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఈ అనుమతులు పొందేందుకు నిర్ణీత నిబంధనల ప్రకారం అన్నీ సక్రమంగా ఉంటేనే సంబంధిత అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత ఆమోద ముద్ర వేస్తారు. అయితే జిల్లాలో ఎక్కడా దీన్ని పాటిస్తున్న దాఖలాలు లేవు. అంతేకాకుండా రేరా కింద ఒక వెంచర్‌ను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు నాలుగు ఎకరాల లోపు అయితే రూ.5 లక్షలు, 4 నుంచి 10 ఎకరాల్లోపు రూ.10 లక్షల మేర ప్రభుత్వానికి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రమోటర్లు కొనుగోలుదారులను మభ్యపెట్టి డీటీసీపీ అనుమతులను ముందు పెట్టి ప్లాట్ల విక్రయాలు జరుపుతున్నారు.
రేరాలో రిజిస్ట్రేషన్ చేయించాలంటే ప్రమోటార్లు ఫైర్ ఫైటింగ్ సదుపాయాలు, తాగునీటి వసతి, అత్యవసర సమయాల్లో ప్రజలను ఖాళీ చేయించేందుకు సదుపాయాలు కల్పించడం, పునరుత్పాదక ఇంధన వనరుల కల్పన వంటి అంశాలతో పాటు వెంచర్ ఏర్పాటు చేసే స్పష్టమైన హద్దులతో కూడిన రేఖా చిత్రం, అక్షాంశాలు, రేఖాంశాలతో కూడిన జీపీఎస్ మ్యాప్ వంటి కాపీలను కూడా అందజేయాల్సి ఉంటుంది. వెంచర్లకు జరిగే విక్రయాలకు సంబంధించి అగ్రిమెంట్ కాపీలు వంటివి అందజేయాల్సి ఉంటుంది. ఇవన్నీ జరిగిన తర్వాతే వెంచర్లలో అమ్మకాలు, కొనుగోలు జరపాల్సి ఉంటుంది. రేరా అనుమతి లేకుండా వెంచర్ల ప్రకటన జారీ చేయడం కానీ, బ్రోచర్లు ముద్రించడం, భూమి అభివృద్ధి చేయడం వంటివి చేయరాదు
400 ఎకరాల్లో వెంచర్..
షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలకేంద్రంలో ఇన్‌క్రిడబుల్ ఇండియా పేరుతో సుమారు 400 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమిలో వెం చర్ నిర్వహిస్తున్నారు. 20, 22, 25, 26, 28, 249, 254, 265, 270, 274, 276, 277, 278, 282, 283, 285, 290, 292, 293, 295, 300, 302, 372, 378, 44, 46, 53, 56, 59, 64, 68, 69 సర్వే నంబర్లలో డీటీసీపీ అనుమతి 421 ఎకరాలకు మాత్రమే ఉన్నట్టు బ్రోచర్లో స్పష్టంగా చూపెడుతున్నారు. ఇదిలా ఉంటే అనుమతి కేవలం 38 ఎకరాలకు మాత్రమే ఉన్నట్టు సమా చారం. మరి మొత్తం 600 ఎకరాలకు అనుమతులు ఉన్నాయంటూ కస్టమర్లను రియల్ వ్యాపారులు మోసం చేస్తున్నారు. భూములకు రోజురోజుకూ రేట్లు పెరుగుతున్నాయి.
ప్రజల అవసరాల రీత్యా ఎక్కడో ఓచోట ప్లాట్ తీసుకోవాలన్న ఆకాంక్షను రియల్టర్లు ఆసరా చేసుకుంటున్నారు. కనీసం వెంచర్ సైట్ మొత్తంలో ఎక్కడా ఇంక్రిడబుల్ ఇండియా పేరు కూడా లేకుండా సుమారు 12000 గజాలు అమ్మినట్టు సమాచారం. డీటీసీపీ, రేరా అనుమతుల ప్రకారం అన్ని పనులు పూర్తయితేనే ప్లాట్ల అమ్మకాలు జరపాలని, 15శాతం మాడిగేజ్ గ్రామపంచాయతీకి చేయా లని, మొత్తం పనులన్నీ పూర్తయ్యాక రిలీజ్ చేయాలని ఉంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా వెంచర్ వేసి ప్లాట్ల అమ్మకాలు చేపడుతున్నారు. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తున్నది.