మోదీ ఒక్క అడుగు కూడా ముందుకేయ‌లేదు: CPM

by Disha News Web Desk |
మోదీ ఒక్క అడుగు కూడా ముందుకేయ‌లేదు: CPM
X

దిశ‌, అబ్దుల్లాపూర్‌మెట్‌: దేశాన్ని అన్ని రంగాల్లో భ్రష్టుప‌ట్టిస్తోన్న మోదీ ప్రభుత్వాన్ని గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్యంగా ప్రజా ఉద్యమాల‌ను బ‌లోపేతం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీపీఎం జాతీయ ప్రధాన కార్యద‌ర్శి సీతారాం ఏచూరి అన్నారు. సీపీఎం తెలంగాణ రాష్ట్ర మూడవ మ‌హాస‌భ‌ల్లో భాగంగా శ‌నివారం ఆన్‌లైన్ బ‌హిరంగ స‌భ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. రాష్ట్ర మ‌హాస‌భ‌ల సంద‌ర్భంగా ఇబ్రహీంప‌ట్నం ప్రాంతంలో భారీ బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేయాల‌నుకున్నామ‌ని, కొవిడ్ కార‌ణంగా స‌భ ఏర్పాటు చేయ‌లేక‌పోయామ‌న్నారు. ఆదివారం నుంచి ప్రారంభ‌మ‌య్యే మ‌హాస‌భ‌లు కొవిడ్ రూల్స్‌ను అనుస‌రించి జ‌రుగుతాయ‌న్నారు. కొవిడ్ వ‌ల్ల దేశ‌మే కాదు, ప్రపంచ‌మే సంక్షోభంలోకి వెళ్లింద‌న్నారు. క‌రోనాను నియంత్రించ‌లేక మోదీ ప్రభుత్వం చేతులెత్తేసింద‌న్నారు. వ్యాక్సినేష‌న్ ప్రొగ్రామ్‌లో మోదీ ఫొటో పెట్టుకున్నారు త‌ప్పితే.. ఆ కార్యక్రమాన్ని కొన‌సాగించ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌న్నారు. ప్రజ‌లంద‌రికీ క‌రోనా రెండు డోసులు వేస్తేనే దీన్ని నియంత్రించ‌గ‌ల‌మ‌న్నారు.

అలాగే ప్రజా స‌మ‌స్యల ప‌రిష్కారంలోనూ మోదీ ఒక్క అడుగు కూడా ముందుకేయ‌లేద‌ని విమ‌ర్శించారు. ఆర్థిక‌రంగం కుదేల‌యింద‌ని, నిరుద్యోగం, ధ‌ర‌లు పెరిగిపోయాయ‌ని తెలిపారు. దేశం సంప‌ద అంతా లూటీ అవుతోంద‌న్నారు. స్వాతంత్ర్యం వ‌చ్చాక ఇంత ఘోరంగా ఎప్పుడూ లేద‌న్నారు. రెండేళ్లలో ఇప్పటికే రెండుసార్లు ఇండ‌స్ట్రియ‌ల్ స్ట్రయిక్‌లు జ‌రిగాయ‌ని, రాబోయే రోజుల్లో మ‌ళ్లీ జ‌రిగే అవ‌కాశం ఉంద‌న్నారు. మోదీ ప్రభుత్వం ఇవేవీ ప‌ట్టించుకోకుండా దేశ సంప‌ద‌ను లూటీ చేస్తూ బ‌డా పెట్టుబ‌డిదారుల‌కు అందిస్తున్నార‌ని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం రాజ‌కీయ కుంభ‌కోణాల‌న్నీ లీగ‌లైజ్ చేసింద‌ని విమ‌ర్శించారు. దేశ సంప‌ద‌లో 55శాతం కేవ‌లం 112మంది చేతుల్లోనే ఉందంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చన్నారు. దేశంలో ఎక్కడా సామాజిక న్యాయం జ‌ర‌గ‌డంలేద‌ని, ఈ ఏడేళ్లలో మ‌హిళ‌ల‌పై దాడులు విప‌రీతంగా పెరిగిపోయాయ‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మ‌ధ్య సంబంధాల‌ను పూర్తిగా చెడ‌గొడుతున్నార‌ని, రాష్ట్ర ప్రభుత్వ అధికారాల‌న్నింటినీ కేంద్రం ర‌ద్దు చేస్తోంద‌ని ఆరోపించారు.

కేంద్రం ఏక‌ప‌క్షంగా వ్యవ‌సాయ చ‌ట్టాలు తీసుకొచ్చిందని, ఈ చ‌ట్టాల ఏర్పాటు స‌మ‌యంలో ఒక్క రాష్ట్రాన్ని కూడా సంప్రదించ‌లేద‌న్నారు. మోదీ ప్రభుత్వం అమ‌లు చేస్తున్న నూత‌న విద్యావిధానం కూడా ఏక‌ప‌క్షంగానే తీసుకొచ్చింద‌న్నారు. పార్లమెంట్‌లో ఏ ఒక్క చ‌ట్టంపైనా చ‌ర్చ జ‌ర‌గ‌లేద‌ని, చ‌ర్చకు ప‌ట్టుబ‌ట్టిన 12మంది స‌భ్యుల‌ను స‌స్పెండ్ చేశార‌ని విమర్శించారు. ఎన్నిక‌ల క‌మిష‌న్ కేంద్రానికి తొత్తుగా వ్యవ‌హ‌రిస్తోంద‌ని, యూపీలో ప్రొటోకాల్ అమ‌లులో ఉంద‌ని, మోదీ, అమిత్‌షా ఫొటోల‌తో రేష‌న్ సంచులు పంచుతున్నా ఈసీకి కన్పించ‌డంలేదా? అని ప్రశ్నించారు. సీబీఐ, ఈడీల‌ను బీజేపీ పొలిటిక‌ల్ ఏజెన్సీలుగా ఉప‌యోగించుకుంటోంద‌ని విమ‌ర్శించారు. ప్రతిప‌క్ష నాయ‌కుల‌పై అకార‌ణంగా కేసులు మోపి, హింసించి అరెస్ట్‌లు చేస్తున్నార‌ని ఆరోపించారు. దేశంలో ప్రజాస్వామ్యం ర‌ద్దయ్యే ప‌రిస్థితులు దాపురిస్తున్నాయ‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం కేంద్ర క‌మిటీ స‌భ్యులు బృందా కార‌త్‌, రాఘ‌వులు, రాష్ట్ర కార్యద‌ర్శి త‌మ్మినేని వీర‌భ‌ద్రం, చెరుప‌ల్లి సీతారాములు, కాడిగ‌ళ్ల భాస్కర్‌, వెంక‌ట్‌, రాములు, జ్యోతి త‌దిత‌ర‌లు పాల్గొన్నారు.

Advertisement

Next Story