లంపి వైరస్ నివారణకు కంపల్సరీ టీకా

by Sumithra |
లంపి వైరస్ నివారణకు కంపల్సరీ టీకా
X

దిశ, తలకొండపల్లి : రైతులందరూ ముందు జాగ్రత్తగా పశువులకు వైరస్ సోకకుండా టీకాలు తప్పకుండా వేయించాలని తలకొండపల్లి పశువైద్యాధికారి శంకర్ తెలిపారు. మండలంలో నెల రోజుల నుండి పశువులకు ముందు జాగ్రత్తగా లంపి వైరస్ నివారణ టీకాలు వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే మండలంలోని 50 శాతం మేర 6 వేల డోసుల టీకాలు వేయడం పూర్తయినట్లు, మిగిలిపోయిన రైతులు కూడా తప్పనిసరిగా నివారణ టీకాను వేయించాలని ఆయన కోరారు. ఇటీవల దేశంలోని పలు రాష్ట్రాలలో లంపి అనే భయంకరమైన వైరస్ పశువులకు సోకి మృత్యువాత పడ్డ సంఘటనలు చోటుచేసుకున్నాయి.

కాబట్టి మండలంలోని అన్ని గ్రామాల రైతులు ముందు జాగ్రత్తగా ఎలాంటి వైరస్ లు సొకకముందే పశువులకు టీకాలు వేయించాలని సూచించారు. కొంతమంది రైతులు టీకాలు వేయించడం వల్ల పాలు తగ్గిపోతాయని వేయించడానికి సుముఖంగా లేరని, అలా ఏమి ఉండదని ఆయన సూచించారు. కేవలం రెండు మూడు రోజులు మాత్రమే పాలు తగ్గి తర్వాత యధావిధిగా పాల దిగుబడి ఉంటుందని, టీకాలు వేయించుకోవడం వల్ల పశువుకు రోగం సోకినా కూడా ప్రాణాపాయం నుండి బయటపడుతుందని, ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదని తెలిపారు.

లంపి వైరస్ సోకిన పశువులకు ఎక్కువగా జ్వరం, చర్మంపై దద్దుర్లు, మేత మేయకపోవడం, బలహీనంగా ఉండడం లాంటివి కనిపిస్తాయని డాక్టర్ శంకర్ పేర్కొన్నారు. టీకా వేయించని రైతులు ఎవరైనా ఉంటే తలకొండపల్లి, గట్టు ఇప్పలపల్లి పశు వైద్యశాలలతో పాటు, వెల్జాల్, పడకల్ సబ్ సెంటర్లలో కూడా టీకాలు అందుబాటులో ఉన్నాయని, ఎక్కడైనా లంపి వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే 8008986939 మొబైల్ నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.

Advertisement

Next Story