బాల్య వివాహాలు ఆపడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం : లలిత కుమారి

by Sumithra |   ( Updated:2023-02-23 15:21:54.0  )
బాల్య వివాహాలు ఆపడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం : లలిత కుమారి
X

దిశ ప్రతినిధి, వికారాబాద్ : బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, బాల్య వివాహాలను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలుంటాయని జిల్లా మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారిణి కేతావత్ లలిత కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం తన కార్యాలయం నుండి విడుదల చేసిన ప్రకటనలో తెలుపుతూ బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని అన్నారు. బాల్య వివాహాలను జరిపించిన లేదా ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలుంటాయని తెలిపారు. ముఖ్యంగా నేటి సమాజంలో బాల్య వివాహం అనేది ఒక సమస్యగా మారిందని బాల్య వివాహాలను పూర్తిగా రూపుమాపడానికి ప్రజల్లో విస్తృత అవగాహన సదస్సులు నిర్వహించడం ద్వారానే వికారాబాద్ జిల్లాలో బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టడం సాధ్యమవుతుందని అన్నారు. వికారాబాద్ జిల్లాలో గతసంవత్సరం 2021- 2022 సంవత్సరంలో 228 బాల్యవివాహాలను నిలిపివేశామన్నారు.

అదేవిధంగా బాల్య వివాహాలు చేసినట్లు దృష్టికి వస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామన్నారు. అందులో భాగంగానే సుమారు 8 మందిపై కేసు ఫైల్ చేశామన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ తరపున పాఠశాలల్లో, కళాశాలల్లో బాల్యవివాహాల పైన అవగాహన సదస్సులు నిర్వహిస్తామని, అదేవిధంగా ప్రతిగ్రామంలో బాల్యవివాహాల నిర్మూలనకు, పిల్లలకు సంబంధించిన సమస్యలను గుర్తించడానికి ప్రతిగ్రామంలో వివిధ శాఖల అధికారులతో చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా ముఖ్యంగా బాలికల పట్ల అనుచితంగా ప్రవర్తించిన, అఘాయిత్యాలకు పాల్పడిన వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అందులో భాగంగానే ఎవరైనా ఆపదలో ఉన్న పిల్లల కనిపిస్తే హెల్ప్ లైన్ నెంబర్ 1098 లేదా 100 డయల్ చేయాలని తెలియజేసినారు.

Advertisement

Next Story