బెట్టింగుల జోరు.. కల్వకుర్తి పైనే అందరి దృష్టి

by Mahesh |
బెట్టింగుల జోరు.. కల్వకుర్తి పైనే అందరి దృష్టి
X

దిశ, ఆమనగల్లు : సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అటు పార్టీల అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు, ఇటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నికలకు వినియోగించిన ఈవీఎంలను అధికారులు స్ట్రాంగ్ రూమ్ లో హై సెక్యూరిటీ మధ్య భద్రపరిచారు. ఈ నెల 3న ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా.. అప్పటివరకు కల్వకుర్తి నియోకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో ఫలితాలపై ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు కార్యకర్తలు, నాయకులు ఎవరికి వారుగా అంచనాలు వేసుకుంటున్నారు. అంతేకాకుండా తమ అభ్యర్థి గెలుస్తాడంటే, తమ పార్టీ అభ్యర్థి గెలుస్తాడంటూ జోరుగా బెట్టింగులు సాగిస్తున్నారు. ఇద్దరు, ముగ్గురు ఎక్కడైనా తారసపడితే చాలు.. గెలుపు ఓటములపైనే చర్చ సాగుతున్నది. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు కసిరెడ్డి నారాయణ రెడ్డి, తల్లోజు ఆచారి మధ్య పోటీ ఉందని నియోజకవర్గం వ్యాప్తంగా చర్చ మొదలైంది. సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్‌ను గెలిపిస్తాయనే ఆశతో ఉన్నారు.

బెట్టింగులు షురూ..

కల్వకుర్తి నియోజకవర్గం అంటేనే రాష్ట్ర వ్యాప్తంగా అందరి నోళ్లలో నానేది. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ను ఓడించిన చరిత్ర కల్వకుర్తికి ఉంది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు కసిరెడ్డి నారాయణ రెడ్డి, తల్లోజు ఆచారి గెలుస్తాడని చాలామంది బెట్​ కాస్తున్నారు. మరికొందరు మాత్రం ముగ్గురు అభ్యర్థులపై వేర్వేరుగా బెట్టింగులు షురూ చేశారు. ఇదిలా ఉండగా.. ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం తమ అభ్యర్థులే గెలుస్తారంటూ ప్రధాన పార్టీల నాయకులు, కార్యకర్తలు బెట్టింగులు కాస్తున్నారు.

83.23 శాతం పోలింగ్ సరళి ఎవరికి అనుకూలమో..

కల్వకుర్తి నియోజకవర్గంలో 2,41,762 మంది ఓటర్లు ఉండగా. ఇందులో 1,22,262 మంది పురుషులు, 1,19,500 మంది మహిళలు ఉన్నారు. కాగా 2,01,285 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో 1,02,739 మంది పురుషులు, 98,546 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో 83.26 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ పోలింగ్ శాతాన్ని బట్టి ఏ పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ఉంటుందోనని చర్చించుకుంటున్నారు.

అన్ని మండలాల్లో బీజేపీ అభ్యర్థి ఆచారికి సానుభూతి విపరీతంగా పెరిగిందని, బీఆర్ఎస్ నాయకులు సైతం ఆచారికే జై కొట్టినట్లు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తుందని, కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి గెలవడం ఖాయమేనని కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు. కాగా గ్రామాల్లో మాత్రం మహిళలు, పింఛన్​దారులు, రైతులు తమ పార్టీకి అనుకూలంగా ఓటు వేశారని అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. ఎవరికి వారుగా తమ పార్టీకి అనుకూలంగా పోలింగ్ నమోదైందని చర్చించుకుంటున్నారు.

రేపు వెలువడనున్న అభ్యర్థుల భవితవ్యం

ఈ నెల 3న ఎన్నికల కౌంటింగ్ ఉండడంతో ఒక రోజులో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ప్రస్తుతం అభ్యర్థుల భవితవ్యం స్ట్రాంగ్ రూముల్లో భద్రంగా ఉండగా, ఆదివారం కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇబ్రహీంపట్నంలోని సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి నియోజకవర్గాల కౌంటింగ్ చేపట్టనున్నారు.

Advertisement

Next Story