నాయ‌కుల‌ను ప్ర‌స‌న్నం చేసుకో... నిర్మాణం చేసుకో

by Sridhar Babu |
నాయ‌కుల‌ను ప్ర‌స‌న్నం చేసుకో... నిర్మాణం చేసుకో
X

దిశ, గండిపేట్ : నార్సింగి మున్సిపాలిటీలో అక్ర‌మ నిర్మాణాల‌ను అడ్డుకునే నాథుడు క‌రువ‌య్యాడు. బాధ్య‌త క‌లిగిన అధికారులు, ప్ర‌జా ప్రతినిధులు అక్ర‌మ నిర్మాణాల‌కు వంత పాడుతున్నారు. దీంతో నిర్మాణదారులు ఆడిందే ఆట‌గా పాడిందే పాట‌గా మారింది. నార్సింగి మున్సిపాలిటీలో కోట్లల్లో భూముల ధ‌ర‌లు ఉన్నాయి. ఇక్క‌డ ఏ నిర్మాణం చేప‌ట్టినా కోట్లు ప‌లుకుతాయి. ఈ క్ర‌మంలో స్థానికంగా అక్ర‌మ నిర్మాణాల సంఖ్య రోజురోజుకు పెర‌గ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది. నార్సింగి మున్సిపాలిటీ ప‌రిధిలోని గండిపేట్ లోని సాయిబాబా దేవాల‌యం స‌మీపంలో ఓ ఫంక్ష‌న్‌హాల్‌ను అక్ర‌మంగా నిర్మించారు. ఈ విష‌యం తెలిసిన అధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధులు మౌనం వ‌హిస్తున్నారు.

ఈ అక్ర‌మ నిర్మాణానికి స్థానికంగా ఉన్న ప్ర‌జా ప్ర‌తినిధులు పూర్తి స‌హాయ స‌హ‌కారాలు అందిస్తున్న‌ట్లు స‌మాచారం. కాగా ఈ నిర్మాణాల‌ను నిలువ‌రించేందుకు ప్ర‌య‌త్నించే అధికారుల‌ను ఒత్తిడి చేసి అడ్డుకోకుండా చూస్తున్న‌ట్లు అంత‌ర్గ‌త స‌మాచారం. ఇష్టానుసారంగా నిర్మించిన ఈ ఫంక్ష‌న్‌హాల్‌ను తొల‌గించ‌కుండా ఎందుకు అధికారులు ఉపేక్షిస్తున్నారంటూ స్థానికంగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అక్ర‌మంగా నిర్మించే ఈ నిర్మాణాల వ‌ల్ల స్థానికంగా మున్సిప‌ల్ రెవెన్యూకు గండిప‌డ‌ట‌మే కాకుండా మ‌రికొన్ని చోట్ల ఇలాంటి నిర్మాణాలు చేప‌ట్టే అవ‌కాశం లేక‌పోలేదు. ఈ మేర‌కు అధికారులు చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో వైఫ‌ల్యం చెందుతున్నారు. ఇక ప్ర‌జా ప్ర‌తినిధులు మాత్రం ఈ నిర్మాణాల‌కు పూర్తి స‌హకారం అందిస్తున్న‌ట్లు తెలుస్తుంది. నిర్మాణ‌దారుల‌ను అడ్డుకొని చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్థానికులు కోరుతున్నారు.

అంతా తామై న‌డుపుతున్న ప్ర‌జా ప్ర‌తినిధులు...

నార్సింగి మున్సిపాలిటీ ప‌రిధిలో చేప‌ట్టే అక్ర‌మ నిర్మాణాల‌కు ప్ర‌జా ప్ర‌తినిధులే కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని స్థానికంగా ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు. దీంతో నిర్మాణ‌దారుల‌కు రెక్క‌లొచ్చిన‌ట్లు అయింది. స్థానికంగా రియ‌ల్ట‌ర్లు, కాంట్రాక్ట‌ర్లు రెచ్చిపోయి ఖాళీగా క‌నిపించే స్థ‌లాల‌ను గుర్తించి వాటిని త‌మ సొంతం చేసుకునేందుకు ఎంత‌కైనా తెగిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో నిర్మాణాల‌కు అధికారుల నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తున్న‌ప్ప‌టికీ ప్ర‌జా ప్ర‌తినిధులు మాత్రం ఈ నిర్మాణాలకు స‌హ‌క‌రిస్తున్న‌ట్లుగా తెలుస్తుంది. అయితే ఈ విష‌యంపై అధికారుల‌కు తెలిసిన‌ప్ప‌టికీ నిర్మాణాల‌పై చ‌ర్య‌లు తీసుకునేందుకు వెనుకాడుతున్నారు.

అందులోనూ కొంత మంది ప్ర‌జా ప్ర‌తినిధులు అంతా తామై ఆయా నిర్మాణాల‌కు స‌హ‌క‌రిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నిర్మాణాల‌ను గుర్తించి కూల్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల్సిన ప్ర‌జా ప్ర‌తినిధులే అక్ర‌మ నిర్మాణాల‌కు దాసోహం అన‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. అంతేకాకుండా కోట్ల‌ల్లో భూముల ధ‌ర‌లు ఉండ‌టంతో అక్ర‌మంగా చేప‌ట్టే నిర్మాణాల‌కు ముడుపుల‌ను అడ్డ‌గోలుగా ముట్ట‌జెప్పి అంద‌రి నోరు మూయిస్తున్నారు. దీంతో అధికారులు చ‌ర్య‌లు తీసుకునేందుకు వెళ్లినా ప్ర‌జా ప్ర‌తినిధులు అధికారులు చ‌ర్య‌లు తీసుకోకుండా అడ్డు త‌గులుతున్న‌ట్లు తెలుస్తుంది. క‌నీసం హైడ్రా అధికారులు అయినా స్పందించి అక్ర‌మ నిర్మాణాన్ని కూల్చివేసి, బాధ్యుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed