కర్ర స్తంభం... విరిగితే నష్టం

by Kalyani |
కర్ర స్తంభం... విరిగితే నష్టం
X

దిశ, కొత్తూరు : రోడ్డు పక్కన ఉన్న కర్ర స్తంభం విరిగిపోయే దశలో ఉందని.. ఏదైనా అనుకోని ప్రమాదం సంభవిస్తే ఎవరిది బాధ్యత అని వాహన చోదకులు, ఎస్ బీ పల్లి గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. వివరాల్లోకి వెళితే కొన్ని రోజుల క్రితం మండలంలోని ఎస్ బి పల్లి గ్రామ శివారు నుంచి కేశంపేట వరకు రోడ్డు విస్తరణ పనులు జరిగాయి. అందులో భాగంగా గ్రామ శివారులో రోడ్డు బాగా కిందకి ఉందని సమాంతరంగా చేయడం కోసం మట్టిని పోసి రోడ్డును ఎత్తుగా నిర్మించారు. రోడ్డును ఎత్తు చేయడం వల్ల కరెంటు తీగలు వాహనాలకు తగిలేలా ఉండటంతో కరెంటు తీగలు వాహనాలకు తగులకుండా గుత్తేదారు కర్ర సహాయం తో తీగలను ఎత్తు లేపి ఉంచాడు. ఇలా చేసి నెలలు గడుస్తుండడంతో ఆ కర్ర చెదలు పట్టి విరిగిపోయే దశలో ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ఎప్పుడైనా కర్ర విరగి తీగలు కిందకి వేలాడితే ప్రమాదం జరిగే అవకాశం లేకపోలేదని వాహన చోదకులు వాపోతున్నారు. విద్యుత్‌ ప్రమాదాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసే అధికారులు ఇప్పటికైనా స్పందించి కర్ర స్తంభాన్ని తొలగించి సిమెంట్ స్తంభాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed