రెండు పడవలపై ప్రయాణం.. ఈ సారి ఎన్నికల్లో ఎటువైపో

by Sathputhe Rajesh |
రెండు పడవలపై ప్రయాణం.. ఈ సారి ఎన్నికల్లో ఎటువైపో
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఎన్నికలు సమీపిస్తున్నాయంటే చాలు ఆశావాహులు, సిట్టింగ్ లు జనం నోళ్లలో ఎలా నానాలి, వారిని తమకు అనుకూలంగా ఎలా మల్చుకోవాలి అని స్కెచ్ లు వేస్తూ ముందుకు సాగుతుంటారు. రానున్న ఎన్నికల్లో ప్రత్యర్థులకు అందనంత దూరంలో ఉంటేనే గెలుపును అందుకుంటామని ఇలాంటి ఎత్తుగడలు వేయడం కామన్. సిట్టింగ్ లు అయితే తమ చేతిలో ఉన్న అధికారాన్ని వాడుకుంటూ మరింత బలోపేతం అయ్యేందుకు ప్రయత్నిస్తుంటారు. ప్రత్యర్థి పార్టీలకు కనుచూపు మేరలో కూడా కనిపించనంతగా ప్రచార పర్వంలో దూసుకుపోతుంటారు. అయితే ఈ సిట్టింగ్ ఎమ్మెల్యే ఇవన్నీ చేస్తున్నా ఆయనను ఓ రెండు సమస్యలు వెంటాడుతున్నాయి. తన చుట్టూ మంది మార్బలం ఉన్నా ఆయన మనో వేదనను మాత్రం నిలువరించలేకపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడానికి ఏ గుర్తును ఎంచుకోవాలన్న డైలమా ఒకటైతే... వలస వెళ్లిన పార్టీ టికెట్ కోసం పెరుగుతున్న పోటీ ఆయనను ఇబ్బందిపెడుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏంటా కథా అంటే మీరీ స్టోరీ చదవాల్సిందే.

టెన్షన్... టెన్షన్...

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఎదుర్కొంటున్న పరిస్థితి కాస్త డిఫరెంటనే చెప్పాలి. ఆయన వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అంతకంటే ఎక్కువగా తన గుప్పిట ఉన్న ఓ పార్టీ గుర్తును ప్రత్యర్థులకు చిక్కకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారట. ఈ ఎన్నికల్లో రెండు పార్టీల గుర్తులు కూడా తనవే కావాలన్న యోచనలో మునిగిపోయారన్న ప్రచారం జరుగుతోంది. ఒకే అభ్యర్థి రెండు పార్టీల గుర్తులతో పోటీ చేయాలన్న యోచనలో మాత్రం కాదు కానీ ఏదో ఒక పార్టీ తరుపున నిలబడ్డా ప్రత్యర్థులకు ఆ రెండు గుర్తులు దొరకవద్దన్న తాపత్రయమట. తన వల్ల నియోజకవర్గంలో బలంగా నాటుకపోయిన ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గుర్తు సింహాన్ని తన కబంధ హస్తాల్లోనే ఇరికించుకోవాలన్న యోచనతో ఓ వైపున పావులు కదుపుతూనే, టీఆర్‌ఎస్ పార్టీ సింబల్ తనకే దక్కాలని భావిస్తున్నారట. దీంతో తన గెలుపు నల్లేరు మీద నడకలా ఉంటుందని అంచనా వేస్తున్నట్టుగా సమాచారం. వచ్చే ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసే వరకూ రెండు పార్టీల టికెట్లూ తన వద్దే ఉంటేనే అన్నింటా తనకు లాభిస్తుందని లెక్కలు వేసుకుంటున్నారట.

రెండేందుకో...

అయితే ఉద్యమ ప్రస్థానం నుండి టీఆర్‌ఎస్‌లో ఉన్నప్పటికీ చందర్ కు 2014లో టికెట్ ఇచ్చే పరిస్థితి టీఆర్‌ఎస్ కు లేకుండా పోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ వైపే పార్టీ మొగ్గు చూపడంతో.. ప్రజాక్షేత్రంలో తన సత్తా చాటుకోవాలని భావించిన కోరుకంటి ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరుపున పోటీ చేశారు. అప్పటికే కార్మిక క్షేత్రంలో పేరున్న చందర్ తన ఓటు బ్యాంక్ ఏంటో చూపించారు. 2018లో కూడా అధిష్టానం సోమారపుకే ప్రాధాన్యత ఇవ్వడంతో చందర్ మరోసారి నిరాశకు గురయ్యారు. దీంతో మళ్లీ ఏఐఎఫ్ బి తరుపున బరిలో నిలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆ తరువాత గులాబీ కండువా కప్పుకుని అధికారికంగా సింహం గుర్తు ఎమ్మెల్యేగా.. అనధికారికంగా టీఆర్‌ఎస్ శాసనసభ్యుడిగా చెలామణి అవుతున్నారు. అయితే నియోజకవర్గంలో తన వల్ల ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయిన సింహం గుర్తు వచ్చే ఎన్నికల్లో తనను పుట్టి ముంచుతుందేమోనన్న అనుమానం వెంటాడుతుండడంతో దీనికి పరిష్కారం కనుగొనేందుకు చందర్ ఇప్పటినుండే స్కెచ్ లు వేయడం ఆరంభించారని తెలుస్తోంది. సింహం గుర్తును తన పంచనే పెట్టుకోనట్టయితే ఆశావాహులు అదే గుర్తుపై తనపై పోటీ చేస్తే తన ఓట్లు చీలే ప్రమాదం కూడా ఉంటుందన్న కారణంగా చందర్ వ్యూహాల్లో మునిగిపోయినట్టు సమాచారం. ప్రధానంగా గత కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలు కూడా చందర్ ను అప్రమత్తం చేశాయని చెప్పవచ్చు. రామగుండంలో కార్పోరేటర్లుగా పోటీ చేసిన వారిలో చాలా మంది సింహం సింబల్ తోనే బల్దియాలోకి అడుగుపెట్టారు. దీంతో రెబల్స్ కు ఏఐఎఫ్ బి పార్టీ గుర్తు సింహం షెల్టర్ జోన్ గా మారిపోయింది. వచ్చే ఎన్నికల్లో కూడా రెబెల్స్ కు సింహం చిక్కితే తాను మరింత శ్రమించాల్సి వస్తుందని, దీనివల్ల జరిగే నష్టాన్ని పూడ్చుకునేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేయాల్సి వస్తుందని గుర్తించి ముందస్తు దిద్దుబాటు చర్యలకు పూనుకుంటున్నట్టు సమాచారం.

ఇంటి పోరూ...

ఇకపోతే కోరుకంటి చందర్ కు ఇంటిపోరు కూడా తప్పేలా లేదు. ఆయన గెలుపునకు కీలక భూమిక పోషించిన వారిలో ముఖ్య నాయకులు కొంతమంది ఆయనకు దూరం అయ్యారు. అందులో పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి ఒకరు. ఆమె ప్రజల్లోకి వెళ్తూ తన పట్టును నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చాలా అంశాల్లోనూ సంధ్యారాణి దూకుడుగా వ్యవహరిస్తూ తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో సంధ్యారాణి కూడా టికెట్ అడిగే అవకాశాలు ఉన్నాయన్న చర్చ రామగుండంలో బాహాటంగానే సాగుతోంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ద్వారా టికెట్ కోసం ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆమెతో పాటు మరికొంతమంది నాయకులు కూడా టికెట్ కోసం ప్రయత్నించే అవకాశాలు లేకపోలేదు. అయితే టీఆర్ఎస్ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వైపే మొగ్గు చూపితే మాత్రం రెబెల్స్ పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. వీరిలో ఎవరో ఒకరు సింహాం గుర్తును దక్కించుకునే అవకాశాలూ లేకపోలేదు. గత అనుభవవాలను కూడా చూసుకుంటే ఇక్కడి నుండి బలహీనమైన పార్టీ నుండో, స్వతంత్రులుగానో పోటీ చేసిన వారిపై ఓటర్లు మమకారం చూపిస్తుంటారు. సొంత పార్టీ ఆ నాయకున్ని మోసం చేసిందన్న భావన కార్మికుల్లో బలంగా నాటుకుపోయి వారినే అందలం ఎక్కించేందుకు ప్రాధాన్యత ఇస్తుంటారు. అలాంటి సీన్ వచ్చే ఎన్నికల్లోనూ రిపీట్ అయితే తన రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్మకుంటాయన్న ఆందోళన చందర్ లో నెలకొనే అవకాశాలు లేకపోలేదు. దీంతో అటు పార్టీ సింబల్స్ మరోకరికి దక్కకుండా ఇటు అసమ్మతి ఎత్తులను చిత్తు చేస్తూ మరోసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టేందుకు వ్యూహ, ప్రతి వ్యూహాలు వేయాల్సిన పరిస్థితి చందర్ కు తయారైందని అంటున్నారు.

ఓ పార్టీ ఎమ్మెల్యే.. మరో పార్టీ అధ్యక్షుడు..

ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తరుపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన కోరుకంటి చందర్ తనదైన స్టైల్లో పాలిటిక్స్ చేస్తున్నారంటున్న వారూ లేకపోలేదు. నిన్న మొన్నటి వరకూ అనధికారిక టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న చందర్.. ఇటీవల టీఆర్‌ఎస్ పార్టీ నేతగా బాహాటంగానే ఒప్పేసుకున్నారు. ఇందుకు టీఆర్‌ఎస్ అధిష్టానం కూడా సర్టిఫికెట్ ఇచ్చేసింది. టీఆర్‌ఎస్ పార్టీ ఇటీవల నియమించిన జిల్లా అధ్యక్షుల జాబితాలో కోరుకంటికి అవకాశం ఇచ్చింది. ఆయనను పెద్దపల్లి జిల్లా అధ్యక్షునిగా కూడా నియమించడంతో ఆయన పార్టీ ఫిరాయించిన విషయంపై మరింత స్పష్టత ఇచ్చినట్టయింది. రెండు పార్టీలను ఒంటి చేత్తో మెయింటెన్ చేస్తున్న చందర్ కు వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేయడం ఓ లెక్కా? అంటున్నారు కొంతమంది. ఏది ఏమైనా వైవిధ్యమైన రాజకీయాలకు కేరాఫ్ గా ఉండే రామగుండంలో ఈ సారి పాలిట్రిక్స్ చిత్ర విచిత్రంగా ఉంటాయన్నది మాత్రం వాస్తవం.

Advertisement

Next Story